1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?

- రచయిత, గగన్ సభర్వాల్
- హోదా, యూకేలో బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి
బ్రిటన్‌లో ఆదివారం (సెప్టెంబరు 12న) హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 1897లో చోటు చేసుకున్న సారాగఢీ యుద్ధంలో ఆయన 20 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించి వేలాది మంది అఫ్గాన్ సైనికులతో పోరాడారు.
ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల గౌరవార్ధం యూకేలో పది అడుగుల ఎత్తులో ఇషార్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
దీనిని ఇంగ్లండ్‌లోని వోల్వర్ హ్యాంప్టన్‌లోని వెడ్నస్‌ఫీల్డ్‌లో ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానికులతో పాటు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, స్థానిక కౌన్సెలర్లు, మిలిటరీ ఆఫీసర్లు హాజరయ్యారు.
సారాగఢీ స్మారక చిహ్నంపై ఉన్న 8 మీటర్ల స్టీల్ ప్లేటు మీద పర్వత శ్రేణులు, బ్రిటిష్ అవుట్ పోస్టును ప్రతిబింబించే ఆకారంతోపాటు, యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు.

సారాగఢీ యుద్ధం అంటే ఏంటి?
సారాగఢీ యుద్ధం బ్రిటిష్ ఇండియా సైన్యంలోని 36వ సిక్కు పదాతి దళానికి, 10,000 మంది అఫ్గాన్ గిరిజన సేనల మధ్య 1897 సెప్టెంబరు 12న జరిగింది. ఈ యుద్ధం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతంలో జరిగింది.
21 మంది సిక్కు సైనికులు ఆరు గంటలకు పైగా సాగిన యుద్ధంలో అవిరామంగా పోరాడారు. ఈ యుద్ధంలో 180 -200 మంది పఠాన్ గిరిజన సైనికులను మట్టుపెట్టారు.
ఈ 21 మందికి మరణానంతరం 'ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' బిరుదును ప్రకటించి గౌరవించారు. ఇది అప్పట్లో యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే వారికి సైన్యం ఇచ్చే అత్యున్నత బిరుదు.
అప్పటి నుంచీ భారతీయ సైన్యానికి చెందిన 4వ బెటాలియన్ సిక్కు రెజిమెంట్‌లో 21మంది సిక్కు సైనికుల జ్ఞాపకార్ధం సెప్టెంబరు 12న సారాగఢీ దినం జరుపుకుంటున్నారు. బ్రిటిష్ ఆర్మీ పోస్టును రక్షించేందుకు 10,000 మంది అఫ్గాన్ గిరిజన సేనతో పోరాడిన వీరులను సంస్మరించుకుంటారు.

నిజమైన 40 సంవత్సరాల నాటి కల
ఈ 21 మంది సైనికుల సాహసంతో పాటు, సారాగఢీ కథను కూడా అందరితో పంచుకోవాలని వెడ్నస్‌ఫీల్డ్ కౌన్సెలర్ భూపిందర్ గఖల్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు .
"ఈ స్మారక చిహ్నం నిర్మించాలనే కల 41 సంవత్సరాల క్రితంది" అని గఖల్ చెప్పారు. ఆయనకు 14 సంవత్సరాలున్నప్పుడు భారత్‌కు వచ్చారు. అక్కడున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఆయనొక క్యాలెండరును చూశారు. అందులో శిధిలాల పై నిల్చున్న సిక్కు వ్యక్తుల చిత్రాన్ని చూసి అక్కడున్న బ్యాంకు మేనేజరును దాని గురించి ప్రశ్నించారు.
"బాబు, ఇది మీ చరిత్ర, పరిశోధన చేయి" అని ఆయన చెప్పినట్లు చెప్పారు.
అప్పటి నుంచీ, సారాగఢీ యుద్ధంలో మరణించిన 21 మంది సైనికుల సంస్మరణార్ధం స్మారక చిహ్నాన్ని నిర్మించాలనే కల ఉన్నట్లు చెప్పారు.
"ఇది సిక్కు సమాజం గర్వించే క్షణం. ఇది స్థాపించిన తర్వాత మరిన్ని తరాల వరకు నిలిచిపోతుంది. ఈ 21 మంది సిక్కులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయి ఉండవచ్చు. కానీ, వారు ఆఖరి నిమిషం వరకూ పోరాడారు" అని గఖల్ బీబీసీకి చెప్పారు.

ఈ విగ్రహాన్ని ఎవరు నిర్మించారు?
ఈ 10 అడుగుల విగ్రహాన్ని తయారు చేసే పనిని అప్పగించే బాధ్యతను వెన్సీఫీల్డ్‌లో ఉన్న గురునానక్ గురుద్వారా తీసుకుంది. ఈ విగ్రహాన్ని వెస్ట్ మిడ్ ల్యాండ్స్‌కు చెందిన 38 సంవత్సరాల ల్యూక్ పెర్రీ అనే కళాకారుడు రూపొందించారు.
దీని తయారీకి 100,000 పౌండ్లు ఖర్చయింది. విగ్రహ స్థాపన కోసం కేటాయించిన స్థలాన్ని తయారు చేయడం కోసం మరో 36,000 పౌండ్లు ఖర్చయ్యాయి.

"బ్రిటిష్ చరిత్రలో ఈ యుద్ధం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ, బ్రిటిష్ స్కూళ్లలో బ్రిటిష్ పాలన గురించి నేర్పకపోవడం వల్ల అందరూ దీని గురించి మర్చిపోతున్నారు. నేనిందులో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని పెర్రీ అన్నారు.

"లయన్స్ ఆఫ్ ది గ్రేట్ వార్"
దక్షిణ ఆసియాకు చెందిన వారి విగ్రహాలను తయారు చేయడం ల్యూక్ పెర్రీకి ఇది మొదటిసారి కాదు. ఆయన లయన్స్ ఆఫ్ ది గ్రేట్ వార్ స్మారక చిహ్నాన్ని కూడా రూపొందించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం తరపున పోరాడిన సిక్కు సైనికుల సంస్మరణార్ధం ఈ చిహ్నాన్ని నిర్మించారు.
దీనిని నవంబరు 11, 2018లో వెస్ట్ మిడ్ ల్యాండ్స్‌లో ఉన్న స్మెత్ విక్‌లో ఆవిష్కరించారు. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 100 సంవత్సరాలు పూర్తయింది.

ఫొటో సోర్స్, Wolverhampton Council
విగ్రహ నిర్మాణానికి ఖర్చెవరు పెట్టారు?
ఈ విగ్రహం కోసం అవసరమైన నిధులను గురునానక్ గురుద్వారాకు విచ్చేసే భక్తులు, స్థానికుల నుంచి సేకరించారు.
వోల్వర్ హ్యాంప్టన్ కౌన్సిల్ కూడా 35,000 పౌండ్లను దీని నిర్మాణం కోసం కేటాయించింది.
ఈ యుద్ధంలో పోరాడిన వారి చిత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఈ విగ్రహం హవిల్దార్ ఇషార్ సింగ్ లేదా మరో 20 మంది సిక్కు సైనికులనో ప్రతిబింబించదు. దీనిని కేవలం కళాకారుని ఊహాత్మక శక్తి ఆధారంగా చెక్కారు.
"ఈ విగ్రహం చూడగానే గుర్తుపట్టేటట్లు ఉండదు. దీనిని చూడగానే, చాలా మంది వారి తాతలా ఉన్నారని అంటున్నారు. దీంతో, ఎవరికైనా విగ్రహంతో ఒక అనుబంధం ఏర్పడటం సులభమవుతుంది. మన సమాజంలో తగిన స్థానం పొందని కీలకమైన వ్యక్తుల విగ్రహాలను తయారు చేయాలని ఉంది. ప్రజలకు ప్రాతినిధ్యం లభిస్తే, వారు శక్తివంతులను చేసినట్లే" అని పెర్రీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూకేలో ఉన్న ఇతర భారతీయుల విగ్రహాలు
మహాత్మా గాంధీ
లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ సెంటర్‌లో మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1968లో ఫ్రెడ్డా బ్రిలియంట్ గాంధీజీ కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించారు.
వెస్ట్‌మిన్‌స్టర్‌లోని పార్లమెంట్ స్క్వేర్ దగ్గర కూడా గాంధీ విగ్రహం ఉంటుంది. దానిని భారతదేశ ఆర్ధిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ 2015, మార్చి 14న ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని స్కాటిష్ శిల్పకారుడు ఫిలిప్ జాక్సన్ రూపొందించారు.
మరో గాంధీ విగ్రహాన్ని మాంచెస్టర్‌లో 2019, నవంబరు 25న ఆవిష్కరించారు. ఈ తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని రామ్ వి సుతార్ అనే కళాకారుడు తయారుచేశారు. దీనిని, గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థాపించారు. గాంధీ లాంకషైర్‌లోని మిల్లు కార్మికులను కలవడానికి వెళుతూ మార్గమధ్యంలో మాంచెస్టర్ సందర్శించారు.
ఇవి కాకుండా, 2009లో లీసెస్టర్ లో మరొక గాంధీ విగ్రహాన్ని నిర్మించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన వ్యక్తిని సంస్మరించుకునేందుకు స్థానికులు విరాళాలు సేకరించి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.

రాజా రామ్మోహన్ రాయ్
ఆధునిక భారతదేశ పితామహునిగా పిలిచే రాజా రామ్మోహన్ రాయ్‌ని బ్రిస్టల్ లోనే సమాధి చేశారు. ఆయన 1833లో అకస్మాత్తుగా మరణించారు.
బ్రిస్టల్ క్యాథెడ్రల్‌కు దగ్గర్లో ఉన్న కాలేజ్ గ్రీన్ దగ్గర 1997లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిని భారతీయ శిల్పకారుడు నిరంజన్ ప్రధాన్ తయారు చేశారు. దీని తయారీని బ్రిస్టల్ సిటీ కౌన్సిల్ పర్యవేక్షించింది.
బ్రిటిష్ ఇండియా ఏజెంట్ నూర్ ఇనాయత్ ఖాన్
బ్రిటిష్ ఇండియా ఏజెంట్ నూర్ ఇనాయత్ ఖాన్ విగ్రహాన్ని 2012, నవంబరు 8న లండన్‌లో ఆవిష్కరించారు.
ఆమె రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఫ్రాన్స్‌లో పని చేశారు. జర్మన్ల చేతిలో హింసకు గురయ్యారు. ఆమెను తీవ్రంగా హింసించిన తర్వాత కాల్చి చంపారు. ఈ విగ్రహావిష్కరణకు ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఫ్రాన్స్ లో ఆమెను 10 నెలల పాటు హింసించినప్పటికీ ప్రత్యర్థులకు అవసరమయ్యే ఎటువంటి సమాచారాన్నీ బహిర్గతం చేయకుండా ఉంచినందుకు గాను, ఆమెకు మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం జార్జ్ క్రాస్ బిరుదును ఇచ్చి గౌరవించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి యూకేలో ఇచ్చే అత్యున్నత అవార్డు జార్జ్ క్రాస్.
గ్రేవ్స్ ఎండ్‌లో పైలట్ మహీందర్ సింగ్ పుజ్జీ విగ్రహం
మహీందర్ సింగ్ పుజ్జీ ఒక ఫైటర్ పైలట్. ఆయన 1940లో బ్రిటన్ వెళ్లారు. గ్రేవ్స్ ఎండ్‌లో 92 సంవత్సరాల వయస్సులో 2010లో మరణించారు. ఆయన విగ్రహాన్ని కెంట్‌లోని గ్రేవ్స్ ఎండ్‌లో స్థాపించారు.
1914 నుంచి ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ తరుపున పోరాడిన సేవా దళాల ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించేందుకు గుర్తుగా ఈ విగ్రహ స్థాపన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
లండన్ లోని బసవేశ్వర విగ్రహం
లండన్ లోని థేమ్స్ నది దక్షిణ తీరంలో 12వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని 2015, నవంబరు 14న భారత ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కులరహిత సమాజం కోసం బసవేశ్వర కృషి చేశారు.
ఇవి కూడా చదవండి:
- '9/11 దాడుల సూత్రధారి ఎఫ్‌బీఐ నుంచి ముందే ఎలా తప్పించుకున్నాడు’
- ‘ఆ కరెంట్ మేం వాడలేదు’
- శాటిలైట్ ఇంటర్నెట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
- చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?
- తాలిబాన్ నుంచి తప్పించుకున్న మహిళా రోబోటిక్స్ టీమ్ కథ సుఖాంతం అవుతుందా?
- జీ7 దేశాలను మించి కోవిడ్ టీకాలు వేసిన భారత్
- వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








