ట్రూఅప్ ఛార్జీలు: ఏపీలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు సెప్టెంబర్‌లో కరెంట్ బిల్లులు అధిక మొత్తంలో వచ్చాయి.
వాడిన యూనిట్లకు టారిఫ్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో పాటు అదనంగా ‘ట్రూ అప్’ ఛార్జీలు యూనిట్‌కి రూ.1.23 చొప్పున చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు.
దాంతో చాలామందికి జులై కంటే తక్కువ విద్యుత్ వినియోగించినా బిల్లులు మాత్రం 20 నుంచి 40 శాతం ఎక్కువగా వచ్చాయి.
2014-19 వరకూ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఈ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయక తప్పదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చెబుతోంది.
కాగా ప్రభుత్వం అదనంగా చేస్తున్న వసూళ్లను నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
ట్రూ అప్ ఛార్జీలంటే ఏంటి?
రీటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి డిస్కమ్‌ల ద్వారా జరిగిన లావాదేవీల్లో వచ్చిన నష్టాలకు గానూ ప్రజల నుంచి అదనపు వసూళ్లకు ఈ ట్రూ అప్ ఛార్జీలు తీసుకొచ్చారు.
విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాలో వచ్చే వ్యత్యాసాల వల్ల తమకు వచ్చే నష్టాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడం కంపెనీలకు అలవాటుగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నష్టాల సర్ధుబాటు పేరుతో గతంలోనూ ఇలాంటి వసూళ్లు జరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునే పద్ధతులు పాటించకుండా చివరకు వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి ఈ విధానం తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
సర్దుబాటు రుసుములు, సర్‌ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఇలా పేరు ఏదైనా వినియోగదారులపైనే ఆ భారం మోపుతున్నారు.
ఏపీలో మూడు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరా జరుగుతోంది. రాయలసీమ 4 జిల్లాలతోపాటూ, నెల్లూరు జిల్లాలకు ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు.
ఈ మూడు సంస్థలు గత ప్రభుత్వ హయంలో ఎదురైన నష్టాలు పూడ్చుకోడానికి ఈ ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశ పెట్టాయి.

ఫొటో సోర్స్, APSPDCL
ట్రూ అప్ భారం ఎంత?
మూడు డిస్కమ్‌ల వినతి మేరకు ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతించింది.
వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించాలంటూ ఏప్రిల్‌లో ఆయా సంస్థలు ఏపీఈఆర్సీని కోరగా మే 12న పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన ఏపీఈఆర్సీ తన ఆమోదం తెలిపింది.
వడ్డీల భారంతో కలిపి రూ.3,103 కోట్ల వసూలుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని 8 నెలల్లో వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు.
డిస్కమ్‌లు రూ.19,603 కోట్లకు క్లెయిమ్ చేయగా 2014-19 సంవత్సరాలకు సంబంధించి రూ.3,103 కోట్ల మేర వసూళ్లకు ఏపీఈఆర్సీ అంగీకరించింది.
వాస్తవానికి రూ.4,939 కోట్లుగా నిర్ధరించినప్పటికీ.. అందులో ఇప్పటికే చెల్లించిన అదనపు వ్యవసాయ సబ్సిడీ, రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్ ద్వారా వచ్చిన రూ.1,926 కోట్ల ఆదాయం మినహాయించి రూ.3,103 కోట్లకు అనుమతి లభించింది.
దానికి అనుగుణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1,167.75 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.701.28 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా రూ.673.83 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు.
అయితే 2014-19 మధ్య సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా ఉండడంతో ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో యూనిట్‌కి రూ. 1.23 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మాత్రం యూనిట్‌కి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడు ఛార్జీలు చెల్లించినా, ఇప్పుడు నష్టాలు భరించాలి..
ఈ ట్రూ అప్ ఛార్జీలు 2014-19 వరకూ ఆయా విద్యుత్ వినియోగదారులు వాడిన యూనిట్లను బట్టి భరించాల్సి ఉంటుంది.
ఐదేళ్లలో మొత్తం ఎన్ని యూనిట్లు వాడారనేది లెక్కగట్టి దానిని 8 నెలల బిల్లుల్లో సర్థుబాటు చేస్తారు.
8 వరుస బిల్లుల్లో సర్థుబాటు చేసి ట్రూ అప్ ఛార్జీలుగా వసూలు ప్రారంభమైంది. దాంతో ఇప్పుడు ఏడాదికి అదనంగా సుమారు రూ.330 కి పైగా చెల్లించాల్సి వస్తుంది.
అంటే, ఆగస్ట్‌లో విద్యుత్ వినియోగానికి గానూ ఇప్పుడున్న టారిఫ్ మేరకు రూ. 600 బిల్లుగా వస్తే దానికి అదనంగా 50 శాతం వరకూ ఈ ట్రూ అప్ ఛార్జీల మొత్తం కలుపుకొని రూ.900కి పైగా బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నష్టాలకు కారణమెవరు
విద్యుత్ పంపిణీ సంస్థలు ఏదో పేరుతో ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం చాలాకాలంగా వస్తోందని, అలా గత ప్రభుత్వ హయంలో కూడా జరిగిందని ఏపీ ట్రాన్స్ కో మాజీ ఎస్‌ఈ ఎం.రాంబాబు చెప్పారు.
"ఇది ఇప్పుడు కొత్త కాదు. కానీ, ఈసారి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఏపీఈఆర్సీ కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. నిజానికి డిస్కమ్‌లకు నష్టాలు రావడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్ లైన్లలో లోపాలతో పాటూ విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలే నష్టాలకు ప్రధాన కారణం. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలను విపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా తప్పుబట్టారు. కానీ ఇప్పుడు ఆ తప్పిదాల వల్ల వచ్చిన నష్టాలు మాత్రం జనాలు భరించాలని చెప్పడం సరికాదు. దీనిని సరిదిద్దాలి. భవిష్యత్తులో ఇంత పెద్ద మొత్తంలో నష్టాలకు కారణమవుతున్న డిస్కమ్ లను సరిచేయాలి" అని అభిప్రాయపడ్డారు.
నష్టాలకు అసలు కారకులను వదిలేసి వినియోగదారుల మీద భారం మోపడం అలవాటుగా మారుతోందని రాంబు చెప్పారు.

ఫొటో సోర్స్, YS JAGAN/FB
అప్పుడు తప్పుపట్టి.. ఇప్పుడెలా
పెట్రో భారమే మోయలేకపోతున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వ తన అప్పుల కోసం ప్రజలకు మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ పి.మధు విమర్శించారు.
"చంద్రబాబు హయంలో సర్థుబాటు ఛార్జీలను జగన్ తప్పుబట్టారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారంటూ వాటిని వ్యతిరేకించారు. కానీ, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపారు. వడ్డీలతో కలిపి ఈ ట్రూప్ ఛార్జీలు రూ.3699 కోట్లుగా ఉన్నాయి. ఇది అందరికీ సమస్యే. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు సమస్య అవుతుంది. ప్రస్తుతానికి 8 నెలలే అని చెబుతున్నా వాటిని కొనసాగించే ప్రమాదం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అందులో భాగంగానే సరఫరా కంపెనీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు" అన్నారు.
ఏపీ ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల వసూలును ఆపాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, fb/Nara Lokesh
ఐదు సార్లు పెంచేశారు...
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఐదు సార్లు పెంచారని, పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
"సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.4 వేల కోట్లు సర్దేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి చెప్పిన కబుర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ఇచ్చిన హామీలు గుర్తులేవా? రెండున్నర ఏళ్ల పాలనలో ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు వడ్డించి రూ.9069 కోట్లు దోచేసారు. అమ్మా కరెంట్ బిల్లెంత! అక్కా బిల్లెంత? అని అడిగే దమ్ము ఇప్పుడుందా జగన్ రెడ్డి? రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను" అన్నారు.
ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు ప్రదర్శనలు చేస్తుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, APSPDCL.IN
చంద్రబాబు ప్రభుత్వం వల్లే..
విద్యుత్ ఛార్జీలు పెరగలేదని, ట్రూ అప్ ఛార్జీలు అనేవి చాలాకాలంగా వసూలు చేస్తున్నవనే అని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టారని వైసీపీకి చెందిన మాజీ మంత్రి కె.పార్థసారధి బీబీసీతో అన్నారు.
"చంద్రబాబు హయంలో విద్యుత్తు శాఖ అప్పులు రూ.31,647.64 నుంచి రూ.62,463.00 కోట్లకు పెరిగాయి. విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను రూ.4,817.69 కోట్ల నుంచి రూ.20,121.97 కోట్లకు పెరిగాయి. అంటే ఐదేళ్లలో రూ. 16 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో ఆయా కంపెనీలు నష్టాల పాలయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటిని సర్దుబాటు చేసి డిస్కమ్‌లను పరిరక్షించే ప్రయత్నం చేస్తోంది. దీనిపై టీడీపీ నేతల విమర్శలు విడ్డూరం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా, తమ వల్లే ఇలాంటి సమస్య వస్తోందని తెలుసుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరో కరెంట్ వాడితే బిల్లు మేం కట్టాలా?
ఎవరో, ఎప్పుడో వాడిన కరెంటు కోసం ఇప్పుడు మేం ఎందుకు బిల్లులు కట్టాలని చాలా మంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
"పెళ్ళయ్యి మూడేళ్లయింది. అప్పట్లో ఊళ్లో ఉండేవాడిని. పెళ్లి తర్వాత సిటీకి మారాం. రెండున్నరేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాం. ఆగస్టులో కరెంట్ బిల్లు రూ.1,260 వచ్చింది. ఇప్పుడు రూ.1,700 దాటింది. మాకంటే ముందు ఈ ఇంట్లో ఉన్నవాళ్లు వాడిన కరెంట్‌కి ఇప్పుడు మేం ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు భరించాలో అర్థం కావడం లేదు. ఇంటి ఓనర్‌ని అడిగితే, నాకు సంబంధం లేదన్నారు. ఎటూ పాలుపోని స్థితిలో పడ్డాం" అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాదెళ్ల రితీశ్ అన్నారు.విజయవాడలో అద్దెకు ఉంటున్న రితీశ్‌తో పాటూ ఏపీలో చాలామంది ఇదే సమస్య ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఈ చార్జీలు తలనొప్పిగా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో 'దిశ చట్టం' అమలులో ఉందా? మహిళలకు దీనితో మేలు జరిగిందా?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- అమర రాజా: ఈ సంస్థను తరలించాలని ఏపీ ప్రభుత్వం అంత కఠినంగా ఎందుకుంది?
- చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?
- ఆంధ్రప్రదేశ్: రోడ్లు అధ్వానం... ప్రయాణం భయానకం
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








