జీడీపీ భారీ పతనం: ఇది 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డి.పాపారావు
- హోదా, ఆర్థిక విశ్లేషకులు, బీబీసీ కోసం
వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అమలు సమయంలో రాష్ట్రాలను ఒప్పించేందుకు గాను కేంద్రం అప్పట్లో గట్టి హామీ ఇచ్చింది. ఈ కొత్త పన్ను విధానం వల్ల రాష్ట్రాల ఆదాయాలలో ఏ లోటూ రాదని కేంద్రం హామీ ఇచ్చింది.
ఒకవేళ జీఎస్టీ అమలు క్రమంలో ఏ రాష్ట్రానికైకా పన్ను ఆదాయం తగ్గిపోతే ఆ లోటు భర్తీ చేస్తామనీ కేంద్రం చెప్పింది.
ఇందుకోసం రాష్ట్రాల ఆదాయాలను నిర్ణయించేందుకు జీఎస్టీ అమలు ప్రారంభమైన 2017కు ముందు ఏఢాది 2016ను ప్రాతిపదికగా తీసుకున్నారు.
రాష్ట్రాలకు 2016లో వచ్చిన ఆదాయం ప్రాతిపదికగా తీసుకుని అప్పటి నుంచి ఏటా 14 శాతం మేర పెరుగుదల ఉంటుందని కూడా ఒక అంచనాకు వచ్చారు.
ఏ కారణాలతోనైనా రాష్ట్రాలకు వాటి వార్షిక ఆదాయంలో పెరుగుదల ఈ 14 శాతం కంటే తక్కువగా ఉంటే, ఆ లోటును భర్తీ చేసే భారాన్ని జీఎస్టీ నిబంధనల కింద కేంద్ర తీసుకుంది.
జీఎస్టీ అమలు క్రమంలో నష్టపోతామన్న భయం ఉన్నా ఈ పరిహారం(14 శాతం) ప్రతిపాదనకు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సంతృప్తి చెంది జీఎస్టీ అమలుకు అప్పట్లో సహకరించాయి.
ఈ 14 శాతం పరిహారం మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వగలిగేందుకు గాను కేంద్రం జీఎస్టీ పరిహార సెస్‌ను అమలులోకి తెచ్చింది.
ఈ పరిహార నిధి కోసం విలాస వస్తువులపై విధించే 28 శాతం జీఎస్టీ మీద ఆధారపడాలని నిర్ణయించారు.
జీఎస్టీ యంత్రాంగాన్ని, విధివిధానాలనూ నిర్వహించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటుచేసుకున్నారు.
ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జీఎస్టీ విధి విధానాలు, అమలు, అలాగే అమలు క్రమంలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్రం చర్యలు తీసుకుంటుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాగా, 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చాక 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల కాలంలో ఈ వ్యవస్థ సాఫీగానే సాగింది. అప్పటి వరకు కేంద్రానికి, రాష్ట్రాలకు జీఎస్టీతో లభించే ఆదాయాలు, జీఎస్టీ చట్టం పరిధిలో నిర్ణయించుకున్న మేరకు పంపిణీలకు సరిపోయాయి.
నిజానికి, 2018 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం మేర ఆదాయం పెరుగుదల(2016 ప్రాతిపదికగా)లేని రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ పరిహార నిధికి రూ. 62,611 కోట్లు వసూలయ్యాయి. ఆ ఏడాది (2018)లో రాష్ట్రాలకు పరిహారంగా ఇవ్వాల్సింది రూ. 41,146 కోట్లే.
దీంతో ఆ ఒక్క ఏడాదే కేంద్రం వద్ద ఈ పరిహార నిధిలో సుమారు రూ. 20 వేల కోట్లు మిగిలింది.
2019 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఈ నిధి కింద ఇవ్వాల్సిన మొత్తం 69, 275 కోట్ల రూపాయలు కాగా, కేంద్రానికి వసూలైన మొత్తం 95,081 కోట్ల రూపాయలు. అంటే 2019లో కూడా ఈ నిధిలో కేంద్రానికి మిగులు లభించింది.
2018, 2019 ఆర్థిక సంవత్సరాలలో కలిపి కేంద్రానికి దక్కిన జీఎస్టీ పరిహార సెస్ నిధి మిగులు 47,271 కోట్ల రూపాయలు.
ఈ మిగులు నిధిని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది.
అయితే.. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరిహార సెస్ నిధిలో లోటు మొదలైంది. 2020లో కేంద్రానికి పన్ను కింద లభించింది రూ. 95,444 కోట్లు కాగా కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సి పరిహారం మొత్తం రూ. 1,65,000 కోట్లు.

ఫొటో సోర్స్, REUTERS
అంటే, 2020 మార్చి అనంతర కాలంలోని కోవిడ్ మహమ్మారి దాడి ఫలితంగా లాక్‌డౌన్లు, ఆర్థిక పరిస్థితిలోని కనీవినీ ఎరుగని పరిస్థితులకు ముందే 2019 ఆగస్టు నుంచి 2020 తొలి నెలల వరకూ ఆర్థిక మాంద్య స్థితి మెల్లగా ముదిరింది.
ఆ కారణంగానే కేంద్రం, రాష్ట్రాల ఆదాయాలలో లోటు ఏర్పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార సెస్ బకాయిలతోపాటు ఇతర పంచాల్సిన పన్నులు, తదితర ఆదాయాల వాటాలను కూడా కేంద్రం సక్రమంగా చెల్లించలేని స్థితిలో పడింది.
దీనికితోడు, కోవిడ్ దెబ్బకు కేంద్ర పన్ను ఆదాయం, దానికి మించి రాష్ట్రాల పన్ను ఆదాయాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి.
అనేక రాష్ట్రాలు ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయి. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కోవిడ్ సమస్య తెచ్చిపెట్టిన అదనపు ఖర్చుల భారం మరింత. అదేసమయంలో వసూలు కావల్సిన పన్నుల ఆదాయం దారుణంగా పడిపోయింది.
దీంతో వివిధ రాష్ట్రాలు వనరుల కోసమై కేంద్రంపై ఒత్తిడిని పెంచసాగాయి.
దీనికోసమే, కేంద్రం ‘హెలికాప్టర్ మనీ’ రూపంలో(డబ్బును అదనంగా ముద్రించి, ఆర్థికంగా చితికిపోయిన ప్రజల చేతికి దానిని చేర్చి వారి కొనుగోలు శక్తిని కాపాడే చర్య) ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు కోరాయి.
అంతేకాదు, పలువురు ఆర్థిక వేత్తలు, పరిస్థితి తాలూకు తీవ్రతను అర్థం చేసుకున్న మేధావులు, అందరూ ప్రజల చేతిలోకి డబ్బును చేర్చే భారీ ఉద్దీపన అవసరాన్ని వక్కాణించారు.
చివరకు రాష్ట్రాలు ఉద్దీపన ఇవ్వకపోయినా కనీనం తాము అప్పులు తీసుకునే అవకాశాన్ని పెంచాలని కోరాయి. ఇందుకోసం రాష్ట్రాల అప్పులు వాటి వార్షిక స్థూల ఉత్పత్తిలో 3 శాతం దాటరాదని నిర్దేశించే ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని సడలించి, రుణాలు తీసుకునే పరిమితిని 5 శాతానికి పెంచమని కేంద్రాన్ని కోరాయి.
దానికి కూడా నెలలపాటు తాత్సారం చేసిన కేంద్రం చివరకు, విద్యుత్ వంటి రంగాలలోనూ, నగరపాలక సంస్థల్లోనూ ప్రజలపై భారాలను పెంచే చర్యలను షరతుగా విధిస్తూ ఈ ఎఫ్ఆర్బీఎం పరిమితిని 5 శాతానికి పెంచింది. దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసన వచ్చింది.

ఫొటో సోర్స్, PTI
ప్రస్తుతం జీఎస్టీ పరిహారం చెల్లింపులు, ముందుగానే జీఎస్టీ నిబంధనలలో నిర్దేశించుకున్నమేరకు సక్రమంగా జరగాలంటూ రాష్ట్రాలు ఒత్తిడి పెంచే అంకం నడుస్తోంది. గత వారం చివర్లో జీఎస్టీ కౌన్సిల్ 41వ దఫా సమావేశంలో ఈ అంశమే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.
ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్, కేంద్రం ఎదుట రాష్ట్రాల డిమాండును పరిష్కరించేందుకు మూడు మార్గాలు ఉన్నాయి.
ఒకటి-కేంద్రం అప్పు చేసి, ఆ డబ్బుతో రాష్ట్రాలకు రావల్సిన పరిహారం మొత్తాన్ని తగిన మేర చెల్లించడం.
రెండు-రాష్ట్రాలే స్వయంగా రుణాలు తెచ్చుకోవడం.
మూడు- జీఎస్టీ కౌన్సిల్ నిధిని సమీకరించి రాష్ట్రాలకు ఇవ్వడం.
ఈ మార్గాల్లో రెండో దానిని అంగీకరించేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవు. పరిహార సెస్ తాలూకు లోటు భర్తీకి తమనే రుణాలు తెచ్చుకోమని చెప్పడం అన్యాయం అని, అన్ని రాష్ట్రాలతోపాటూ బీజేపీ పాలిత కర్ణాటక కూడా అభ్యంతరం తెలిపింది.
కానీ, అంతిమంగా ఈ పరిష్కారాన్నే కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఎదుట ఉంచింది.
ఈ మార్గాంతరాల ప్రస్తావనకు ముందు, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ముందుకు తీసుకొచ్చిన వాదనలు చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మంత్రి వ్యాఖ్యల ప్రకారం జీఎస్టీ పరిహార నిధిలో లోటుకు రెండు కారణాలు ఉన్నాయి.
1. జీఎస్టీ అమలుదల తాలూకూ లోటుపాట్ల వల్ల పరిహార సెస్ నిధి సమీకరణలోని లోటు.
2.’విధి వక్రించడం’ వల్ల ఏర్పడిన లోటు.
అంటే, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, పర్యవసానంగా ఆర్థిక పతనాలు ముందుగా ఎవరూ ఊహించలేనివి కాబట్టి ఈ విధంగా జరిగిన ఆదాయ పతనానికి కేంద్రం తప్పిదం ఏమీ లేదన్నది ఆమె వాదన. అంటే, నిర్మాలాసీతారామన్ ‘నష్ట పరిహార చట్టం’ (Tort Act) అనే న్యాయ శాస్త్రంలోని చట్టాన్ని ప్రభుత్వ విధి విధానాలకు తెచ్చి, ఆ మేరకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదనే వాదన చేర్చారు.
పైగా అంతకు ముందే, అటార్నీ జనరల్ నష్టపరిహార సెస్ కింద ఆదాయ సమీకరణ తగినంత మేరకు లేకుంటే దానికి కేంద్రం పూచీకత్తు ఉండదని సెలవిచ్చారు. అంటే, రాష్ట్రాలు ఈ లోటు భర్తీకి అప్పులు సమీకరించుకోవాలన్నది ఆయన వాదన.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ విధంగా ముందుకు తెచ్చిన తర్కంతో నిధుల సమీకరణకు, వనరుల లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వాల ముందు కేంద్రం రెండు మార్గాలను ఉంచింది.
దానిలో ఒకటి జీఎస్టీ చట్టం తాలూకూ లోపాల వలన ఏర్పడిన లోటు 97 వేల కోట్ల రూపాయల మేరగా అంచనా వేసుకుని, ఆ మేరకు రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు. ఈ రకమైన అప్పును రాష్ట్రాలు తీర్చనవసరం లేదని నిర్మాలా సీతారామన్ చెప్పారు.
రెండో మార్గంగా రాష్ట్రాలే స్వయంగా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకుంటే 2 లక్షల 35 వేల కోట్ల రూపాయల మేరకు తమ సొంత బాధ్యతతో సేకరించుకోవచ్చు అని ఆమె చెప్పారు.
కాగా, ప్రస్తుతం నడుస్తోన్న 2020-21 ఆర్థిక సంవత్సర కాలానికి రాష్ట్రాలకు ఏర్పడే నష్టపరిహార సెస్ తాలూకు లోటు 3 లక్షల కోట్ల మేరకు ఉంటుందని అంచనా. అదీ కథ.
అంటే, స్థూలంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టం తెచ్చిన నాటి తన వాగ్దానాలను తుంగలో తొక్కి, నైతిక బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్రాలను మరింత అప్పులతో కుంగిపొమ్మని సెలవిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక, తానిచ్చిన ఈ ప్రత్యామ్నాయాలలో ఒకదానిని ఎంచుకునేందుకు రాష్ట్రాలకు వారం రోజుల గడువు ఇచ్చింది.
కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వాదనతో తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఆ మేరకు ఆగస్టు 31న పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం అయ్యారు. వారి వాదన ప్రకారం కేంద్రమే స్వయానా నిధులు సమీకరించడం సులువు. ఎందుకంటే రాష్ట్రాలకు సొంతంగా ఆదాయం సమకూర్చుకునే మార్గాలేవీ లేవు. కేంద్రానికి మాత్రం ఈ విషయంలో విచక్షణాధికారాలు, నిర్ణయాధికారాలు ఉన్నాయి.
ఉదాహరణకు కేంద్రం తానే స్వయంగా ఆర్బీఐ నుంచి నిధులు సమీకరించి రాష్ట్రాలకు పరిహార సెస్ పూర్తి స్థాయిలో అందిస్తే, ఆ డబ్బును కేంద్రం మానిటరైజ్ చేసి అవకాశం ఉంది. అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆ డబ్బును ముద్రించి కేంద్రానికి అందిస్తుంది. దీనివలన కేంద్రం తాలూకు ద్రవ్యలోటులో పెరుగుదల కూడా ఉండదు.
అలా కాకుండా, రాష్ట్రాలే స్వయంగా అప్పులు చేసుకుంటే దానివలన వాటి ఎఫ్ఆర్బీఎం పరిమితి అంచులకు చేరుతుంది. కేంద్రమే అప్పు చేసి రాష్ట్రాలకు నిధులు అందిస్తే, దానివలన ఆ అప్పుల తాలూకు వడ్డీ భారం 2 శాతం మేరకు తక్కువ ఉండే అవకాశం ఉంది.
ఈ విధంగా కేంద్రం స్వయంగా అప్పు చేయడం, దాని బాధ్యత ప్లస్ అందరికీ వెసులుబాటుగా ఉండే మార్గం కూడా అని రాష్ట్రాల వాదిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక చివరగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికే వస్తే, తెలంగాణలో లాక్‌డౌన్ సమయంలో ఒక నెలలో(ఏప్రిల్) ఆదాయం కేవలం 500 కోట్ల రూపాయలే ఉంది. కాగా, నిజానికి సాధారణ స్థితిలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 5 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఇలా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.
కోవిడ్ అనంతర కాలంలో కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడింది లేదు. లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలు పడిపోయాయి. నేటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెద్దగా కోలుకుందేమీ లేదు.
ఏపీ విషయానికి వస్తే గతంలో చాలాకాలం నుంచి కేంద్రం నుంచి రావల్సిన నిధులు రావడం లేదనేది ఆ రాష్ట్రం ఆరోపణ.
దీంతోపాటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు ఆ రాష్ట్రం అప్పులపాలై ఉంది.
తర్వాత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు తెచ్చిన అప్పులు కూడా తోడై, ప్రస్తుతం ఆ రాష్ట్రం అప్పుల భారం 3 లక్షల కోట్లు దాటిపోయింది. దాంతో ఏపీ ఆర్థిక పరిస్థితి దినగండం నూరేళ్లాయుష్షుగా మారింది.
మరోవైపు రాష్ట్రంలో ఆదాయ సమీకరణ మార్గాలు కూడా తక్కువే. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ స్థూల ఉత్పత్తిలో 34 శాతం వాటా వ్యవసాయానిదే. ఈ రంగం నుంచి ప్రభుత్వానికి ఏ పన్నుల ఆదాయమూ రాదు. మరోవైపు సరకు ఉత్పత్తి రంగం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 20 శాతానికి కాస్త పైనుంది. అంటే ఈ రంగం నుంచి కూడా పెద్దగా పన్నుల వసూళ్లు ఉండదు. ఇక మూడోది సేవారంగం. రాష్ట్రంలో ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది.
విభజనలో హైదరాబాద్‌ను కోల్పోయిన అనంతరం ఏపీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి ఈ స్థితిలో ఆ రాష్ట్రాన్ని ఆదుకునే భారం, దాన్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత కేంద్రంపై చాలా ఉంది. కానీ ఆ దిశగా కేంద్రం పెద్దగా సహకరిస్తున్న దాఖలాలు లేవు.

ఫొటో సోర్స్, Reuters
చివరగా, ఇవాళ విడుదలైన స్థూల జాతీయోత్పత్తి గణాంకాలు మన వృద్ధిరేటు మైనస్ 23 శాతానికి పడిపోయిందని చెబుతున్నాయి. అంటే ఇది ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్, మెకన్జీ సంస్థ, ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ అంచనాలను కూడా మించిపోయింది.
ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలలో నిరుద్యోగం కూడా నేడు తీవ్రంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలోని నగరాలు పూర్తి సంక్షోభంలో ఉండగా, గ్రామీణ ప్రాంతాలు మాత్రం కొంతమేరకు మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ నడుస్తోంది. దీనివల్ల రైతులకు ఆదాయంతోపాటూ, కూలీలకు పని దొరుకుతోంది. వీటికి అదనంగా కేంద్రం బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులకు కేటాయించిన రూ. 61 వేలకోట్లకు అదనంగా, ఇటీవల మరో రూ. 40 వేల కోట్లను ఇవ్వడం గ్రామీణ కూలీలకు అనుకూలించింది. కాబట్టి ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయి.
కానీ, ఈ పరిస్థితి ఎంతకాలం నిలబడగలదు అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే త్వరలో వ్యవసాయ సీజన్ ముగియనుంది. అంతేకాదు, వరి, చెరకు పంటలను మినహాయిస్తే మిగతా పంటలకు ప్రస్తుతం పెద్దగా గిట్టుబాటు ధర లభించడం లేదు. పైగా దేశంలో ఉత్పత్తి భారీగా పెరగడం వల్ల సరఫరా పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనివలన రైతులు గిట్టుబాటు ధరలు దొరక్క నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
అలాగే, జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన మొత్తం నిధుల్లో 70 శాతం మేరకు జులై నెల నాటికి ఖర్చయిపోయాయి. ఇక ఈ ఏడాది మిగిలిన ఐదారు నెలలకు 30 శాతం నిధులు మాత్రమే మిగిలాయి. కాబట్టి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించకుండా ఈ పథకం ప్రభావవంతంగా అమలుచేసే అవకాశాలు లేవు.
ఏదైమైనా, కరోనాకు ముందే దేశంలో మొదలైన ఆర్థిక మాంద్య స్థితి, ఇప్పుడు కోవిడ్ దెబ్బకు అధఃపాతాళానికి దిగజారిపోయింది. ఈపరిస్థితి ఇప్పటికిప్పుడే మారదని, దానిక చాలా కాలం పడుతుందనేది రిజర్వ్ బ్యాంక్ సహా , ఆక్స్ ఫర్డ్ లాంటి సంస్థలు, ఇతరత్రా పరిశీలకులు కూడా చెబుతున్నదే.
అంటే, రానున్న కాలం మనదేశానికి, మన దేశంలోని సామాన్యులకు కనీవినీ ఎరుగని గడ్డుకాలమే. ఈ స్థితిలో ప్రభుత్వం ప్రజలను ఆదుకునే దిశగా(ద్రవ్యలోటు వంటి వాటిని పట్టించుకోకుండా) తక్షణ చర్యలు తీసుకోకుంటే, ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ-సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్న విధంగా వాటి ఆర్థిక స్థితిని జీఎస్టీ నిధుల రూపంతో సహా, ఇతరత్రా కూడా కేంద్రం ఆదుకోవాలి.
(ఈ వ్యాసంలో అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్కు పుట్టిన కవలపిల్లలు: పేదరికం - పొదుపు.. కలిసి పెరుగుతున్నాయిలా...
- పీజీలూ, పీహెచ్‌డీలూ, టీచర్లూ, లెక్చరర్లనూ ఉపాధి హామీ కూలీలుగా మార్చేసిన కరోనా మహమ్మారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








