కరోనా-జీడీపీ: మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
    • రచయిత, తారేంద్ర కిశోర్
    • హోదా, బీబీసీ కోసం

“కోవిడ్-19 రూపంలో సంభవించిన ఒక దైవ ఘటన (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని” ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని ప్రభావం కనిపిస్తుందని ఆమె తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

2020 ఏప్రిల్ నుంచీ జూన్ వరకూ, త్రైమాసిక వృద్ధి రేటు గణాంకాలను కేంద్రం సోమవారం విడుదల చేయనుంది. ఈ వృద్ధి రేటు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి సూచించారు.

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేసారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మాజీ మంత్రి పీ చిదంబరం తన ట్వీట్లో "ఇది దేవుని చర్యే అయితే 2017-18, 2018-19, 2019-10లలో కరోనా మహమ్మారికి ముందు జరిగిన ఆర్థికవ్యవస్థ దుర్వినియోగాన్ని ఏమని వర్ణించాలి? దేవుని దూతగా ఆర్థిక మంత్రి జవాబు చెబుతారా?" అన్నారు.

ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి

ఆర్థిక వ్యవస్థ కుదేలు

కరోనావైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. భారతదేశంతో సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్ ప్రకారం ఇప్పటివరకూ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న తీవ్ర మందగమనం ఈ ఏడాదంతా కొనసాగుతుందని తేలింది.

ఈ పోల్ ప్రకారం, కోవిడ్ 19 కేసులు పెరుగుతూనే ఉండడంతో ఆర్థిక వ్యవహారాలు ఇంకా పుంజుకోలేదు.

ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత త్రైమాసికంలో 8.1 శాతం, వచ్చే త్రైమాసికంలో 1.0 శాతం సంకోచిస్తుందని అంచనా.

ఈ గణాంకాలు జూలై 29 న నిర్వహించిన పోల్ కన్నా తక్కువగా ఉన్నాయని అది పేర్కొంది. ఈ త్రైమాసికంలో 6.0 శాతం, వచ్చే త్రైమాసికంలో 0.3 శాతం సంకోచిస్తుందని ఈ పోల్‌లో అంచనా వేసారు.

లాక్‌డౌన్ కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది.

ఇందులో భాగంగా 5.94 లక్షల కోట్ల రూపాయలను చిన్న వ్యాపారులకు రుణాలు అందించడానికి, నాన్-బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు సాయం అందించడానికి కేటాయించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, వలస కూలీలకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి, రైతులకు రుణాలు ఇవ్వడానికి 3.10 లక్షల కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు తెలిపారు. అలాగే 1.5 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ సంబంధిత రంగాలపై ఖర్చుపెట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్యాకేజీ ప్రకటించినప్పటి నుంచీ మూడు నెలలు గడిచాయి. చాలా చోట్ల వ్యాపారాలు తెరిచారు. మార్చి నుంచి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బ్యాంకు నుంచీ తీసుకున్న రుణాలకు సంబంధించి పలు ఉపశమన చర్యలను కూడా ప్రకటించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PMO INDIA

ప్రభుత్వ విధానాలు పనిచెయ్యడం లేదు...

ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.2.35 లక్షల కోట్లు తగ్గనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

మార్కెట్లు తెరుచుకున్న తరువాత కూడా డిమాండ్ అంతగా పెరగట్లేదని, అందుకే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“లాక్‌డౌన్ విధించిన తరువాత దాదాపు రెండున్నర నెలలకు ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించడమే కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు” అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు సంతోష్ మెహ్రోత్రా అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉపశమన ప్యాకేజీలో లోపాలను కూడా ఆయన ఎత్తిచూపారు.

"ప్యాకేజీలో చిన్న, మధ్యతరహా ఉద్యోగులకు బాకీ ఉన్న సొమ్మును చెల్లిస్తామని చెప్పారు. వారికి రావల్సిన డబ్బే వారికి ఇస్తున్నారు. దీన్ని ఆర్థిక ప్యాకేజీలో చేర్చడం ఏమిటి? ఇది కాకుండా, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే అదనపు డబ్బును కూడా ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. ఇది ప్రజల డబ్బును తిరిగి ప్రజలకు ఇవ్వడం. ఇదేం ప్యాకేజీ?" అని ఆయన విమర్శించారు.

కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

మార్కెట్లో డిమాండ్ ఎందుకు పెరగట్లేదు?

దీనికి సమాధానంగా "ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల వద్ద తప్ప ప్రజల దగ్గర డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 30 నుంచీ 25 శాతానికి తగ్గించింది. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల కోట్ల నష్టం చేకూరుతుంది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు తమ పెట్టుబడిగానీ, ఖర్చులుగానీ పెంచలేదు. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది" అని సంతోష్ మెహ్రోతా తెలిపారు.

జీడీపీ గణాంకాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు పొదుపు చెయ్యడం మొదలుపెడతారు. తక్కువగా ఖర్చు చేస్తారు. వినియోగం తగ్గిపోయి, పెట్టుబడి తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాలి. వివిధ పథకాల ద్వారా వ్యాపారులకు, ప్రజలకు డబ్బు అందే మార్గం చూడాలి. తద్వారా డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇలాంటి సహాయాన్ని ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించాలి.

ఆర్థిక ఉద్దీపనం అంటే పన్నులు తగ్గించడం, వినియోగం పెంచడం అని సంతోష్ మెహ్రోతా వివరించారు.

వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను..రెండింటినీ ప్రభుత్వం తగ్గించింది. 2019 ఎన్నికలకు ముందే ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని 2.5 లక్షల నుండి 5 లక్షలకు పెంచింది. ఫలితంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 1.5 కోట్లకు తగ్గింది.

ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, NURPHOTO

డిమాండ్ పెరుగుదలకు విధానాలు…

మార్కెట్లో కొనుగోళ్ళు పెంచడాన్ని ప్రోత్సహించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దీనికోసం ప్రభుత్వం అధిక సంఖ్యలో రుణాలు తీసుకుని అవి నేరుగా ప్రజల చేతికి అందేలా విధానాలు రూపొందించాలని సంతోష్ మెహ్రోతా అన్నారు.

"కేంద్ర ప్రభుత్వం అర్బన్ మన్రేగా ప్రారంభించవలసి ఉంటుంది. దీనివల్ల కార్మికులు తిరిగి పట్టణాలకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన్రేగా భారం తగ్గుతుంది. ఇంకా ప్రభుత్వం కిసాన్ యోజనాలాంటి పథకాలను రూపొందించాలి. ప్రజలకు ప్రత్యక్ష నగదు రూపంలో డబ్బును అందించడం ద్వారా వినియోగాన్ని పెంచవచ్చు" అని ఆయన అన్నారు.

ఆరోగ్య వ్యవస్థను కూడా మెరుగుపరచాలి. కోవిడ్ 19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. లేకపోతే ఆర్థిక నష్టం మరింత పెరుగుతుంది అని సంతోష్ మెహ్రోతా అభిప్రాయపడ్డారు.

కేంద్రం రుణాలు తీసుకోవడానికి భయపడనక్కర్లేదు, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే పన్నుల రూపంలో ఆదాయం తిరిగి వస్తుంది...స్థూల ఆర్థికశాస్త్రంలో ఇదొక చక్రమని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)