GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశానికి సంబంధించి 2020 జులై - సెప్టెంబర్ త్రైమాసికం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.
ఆర్థిక వృద్ధి గత కొన్నేళ్లుగా మందగిస్తోందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి ఏప్రిల్ - జూన్ నెలల్లో లాక్‌డౌన్ అమలు చేయటంతో.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రమైమాసికంలో జీడీపీ భారీగా పతనమైంది.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ 24 శాతం సంకోచిందింది. గత 40 ఏళ్లల్లో భారతదేశం ఇంత ఆర్థిక పతనాన్ని చూడలేదు. జీ20 దేశాలలో అథమ స్థాయిలో ఉన్న దేశం కూడా ఇదే.
తాజాగా విడుదల చేసిన రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం.. జీడీపీ 7.5 శాతం కుచించుకుపోయింది. అంటే.. మొదటి త్రైమాసికం కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగు పడినా ప్రతికూల వృద్ధి కొనసాగింది.
ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
''జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద''ని రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ కేర్ రేటింగ్స్‌కు చెందిన ఆర్థికవేత్త సుశాంత్ హెగ్డే అభివర్ణిస్తారు.
ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని.
భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రతి ఏటా నాలుగు సార్లు జీడీపీని లెక్కిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు.
అలాగే ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సీఎస్ఓ విడుదల చేస్తుంది.
భారత్ వంటి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలు.. పెరుగుతున్న జనాభా అవసరాలు తీరటానికి ప్రతి ఏటా అధిక జీడీపీ సాధించటం ముఖ్యమని భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
జీడీపీని లెక్కించాలంటే నాలుగు విస్తృత అంశాలను కూడాలి.
మొదటిది ''వినిమయ వ్యయం'' - అంటే దేశ జనాభా వస్తువులు, సేవలను కొనుగోలు చేయటానికి చేసిన మొత్తం ఖర్చు.
రెండోది ''ప్రభుత్వ వ్యయం''. మూడోది ''పెట్టుబడి వ్యయం'' - అంటే ఒక ఫ్యాక్టరీ లేదా సముద్రం మీద వంతెన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేసిన వ్యయం.
నాలుగోది.. చివరిది నికర ఎగుమతుల విలువ - అంటే ఎగుమతులు - దిగుమతుల మధ్య తేడా మొత్తం.
జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు.
నామినల్ జీడీపీలో.. అన్ని వస్తువులు, సేవల విలువను ప్రస్తుత ధరలతో (జీడీపీని లెక్కించిన సంవత్సరపు ధరలతో) లెక్కిస్తారు.
బేస్ ఇయర్ (పోల్చటానికి ఉపయోగించిన సంవత్సరం) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదలను) సవరించినపుడు రియల్ జీడీపీ - అంటే నిజ జీడీపీ లభిస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి గురించి మనం మాట్లాడుకునేటపుడు ఈ రియల్ జీడీపీ గురించే మాట్లాడతాం.
జీడీపీ గణాంకాలను ఎనిమిది రంగాల నుంచి సేకరిస్తారు. అవి:
- వ్యవసాయ రంగం
- తయారీ రంగం
- విద్యుత్, గ్యాస్ పంపిణీ
- గనుల తవ్వకం, అడవులు, చేపల వేట
- హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు
- బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా
- వాణిజ్య సేవలు
- సామాజిక, ప్రజా సేవలు

ఫొటో సోర్స్, Getty Images
జీడీపీ ఎందుకంత ముఖ్యం?
ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి.
జీడీపీ వృద్ధి చెందుతున్నదంటే దానర్థం ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని. ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని. అవి సరైన దిశలో పయనిస్తున్నాయని.
జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి జారిపోవటం జరుగుతున్నదంటే దానర్ధం.. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని.
ప్రభుత్వమే కాకుండా వ్యాపారవేత్తలు, స్టాక్ మార్కెట్ మదుపుదారులు, వివిధ విధాన నిర్ణేతలు కూడా నిర్ణయాలు తీసుకోవటానికి జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటారు.
ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లయితే వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా డబ్బు పెట్టుబడులుగా పెట్టి ఉత్పత్తి పెంచుతారు. దానివల్ల భవిష్యత్తు మరింత ఆశావహంగా కనిపిస్తుంది.
కానీ.. జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ తమ డబ్బులను జాగ్రత్త చేసుకుంటారు. ఖర్చు తగ్గిస్తారు, పెట్టుబడులు తగ్గిస్తారు. దానివల్ల ఆర్థిక వృద్ధి మరింత మందగిస్తుంది. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలకు, వ్యక్తులకు సహాయ పథకాలు ప్రకటించటం ద్వారా ప్రభుత్వం మరింత ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టాలని భావిస్తారు. దానివల్ల సదరు వ్యాపార సంస్థలు, వ్యక్తులు మరింత ఎక్కువగా ఖర్చు పెట్టటం జరిగి.. దేశ ఆర్థిక వ్యవస్థకు చలనం వస్తుందని ఆశిస్తారు.
అలాగే.. ఆర్థికవ్యవస్థకు సాయపడటానికి అవసరమైన విధానాలను రూపొందించటానికి విధానకర్తలు జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించటానికి ఒక కొలమానంగా జీడీపీ గణాంకాలు ఉపయోగపడతాయి.

జీడీపీతో పూర్తి చిత్రం కనిపించదు
మన దేశంలో వృద్ధిని లెక్కించటానికి జీడీపీలో అనేక రంగాలను పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ.. అన్ని రంగాలూ లెక్కలోకి రావటం లేదు.
అసంఘటిత రంగంలోని పరిస్థితి జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించదని నిపుణులు నమ్ముతారు.
''భారతదేశ ఉపాధిలో 94 శాతంగా ఉన్న అసంఘటిత రంగాన్ని జీడీపీ గణాంకాలు లెక్కలోకి తీసుకోవు'' అని సీనియర్ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
''జీడీపీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నట్లయితే.. సంఘటిత రంగాల కన్నా అసంఘటి రంగం పరిస్థితి మరింత దారుణంగా ఉందని అర్థం'' అంటారాయన.
అంటే.. ఒకవేళ జీడీపీ మైనస్ పది శాతం నుంచి మైనస్ 15 శాతంగా ఉందంటే.. అసంఘటిత రంగం పరిస్థితి మైనస్ 20 శాతం నుంచి మైనస్ 30 శాతానికి దిగజారిందని అర్థంచేసుకోవాలి.
స్పష్టంగా చెప్తే.. సంఘటిత రంగం ఎలా పనిచేస్తోందనేది జీడీపీ గణాంకాలు ప్రతిఫలిస్తాయి. కానీ దేశంలో పేద ప్రజలు ప్రధానంగా ఉండే అసంఘటిత రంగాన్ని పూర్తిగా విస్మరిస్తాయి.
సంఘటిత రంగం ఇబ్బందుల్లో ఉన్నట్లయితే.. అసంఘటిత రంగంలోని తీవ్ర పరిస్థితులను గుర్తించటం చాలా కష్టం.

ఫొటో సోర్స్, Getty Images
రాబోయే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 4 శాతం నుంచి 15 శాతం వరకూ కుదించుకుపోతుందని వివిధ ఆర్థిక సంస్థలు, నిపుణులు చెప్తున్నారు.
ఆర్థికవ్యవస్థ తిరోగమన పరిస్థితుల్లోకి జారిపోతుందని భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా చెప్పారు. అయితే జీడీపీ ఎంతమేరకు కుదించుకుపోతుందనేది ఆర్‌బీఐ చెప్పలేదు.
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే గత నాలుగేళ్లుగా మందగమనంలో ఉందనేది గమనంలో ఉంచుకోవాలి.
2016-17లో జీడీపీ వృద్ధిరేటు 8.3 శాతంగా టే.. 2017-18లో అది 7 శాతానికి తగ్గిపోయింది. 2018-19లో అది మరింతగా దిగజారి 6.1 శాతానికి పడిపోయింది. ఇక 2019-20లో ఏకంగా 4.2 శాతానికి పతనమైంది.
''ఈ సవాలును కోవిడ్ సంక్షోభం ద్విగుణీకృతం చేస్తోంది. ఆర్థికవృద్ధిని ఉత్తేజపరిచే అత్యవసర చర్యలు లేకపోవటం వల్ల.. భారతదేశం దశాబ్ద కాలం పాటు ఆదాయాలు, జీవి తనాణ్యతలో స్తబ్దతను ఎదుర్కొనే ముప్పు ఉంది'' అని మెకిన్సీ ఇటీవలి నివేదిక చెప్తోంది.
కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత దిగజారిందని.. భారతదేశం కోలుకోవటానికి ఇతర ఆసియా దేశాలకన్నా మరింత ఎక్కువ కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








