కరోనావైరస్‌‌‌కు పుట్టిన కవలపిల్లలు: పేదరికం - పొదుపు.. కలిసి పెరుగుతున్నాయిలా...

బ్రెజిల్‌లో తల్లీకొడుకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ పిలుపునిస్తున్నాయి

కరోనావైరస్ మహమ్మారి సమయంలో మీరు ఇంటి దగ్గరే ఉంటూ మీ ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉంటే (వర్క్ ఫ్రమ్ హోమ్) ఓ రకంగా మీ ఖర్చులు బాగానే తగ్గి ఉంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లి తినడం, రెస్టారెంట్లపై పెట్టే ఖర్చు తగ్గి బాగానే తగ్గుతుంది. అంటే ఎంతో కొంత మీరు ఆదా చేస్తున్నట్టే.

అదే సమయంలో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు కూడా. ఫలితంగా వారి సంపాదన పూర్తిగా పడిపోయింది.

ప్రస్తుతం మహమ్మారి చాలా విచిత్రమైన పరిస్థితుల్ని సృష్టించిందని, ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఇది గృహ ఆర్థిక వ్యవవహారాల విషయంలో స్పష్టమైన విభజనను తీసుకొచ్చిందని కాపిటల్ ఎకనమిక్స్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా ఉన్న నీల్ షేరింగ్ అభిప్రాయపడ్డారు.

జనాభాలో ఒక వర్గం పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయింది. ఉన్న ఉపాధిని ఏ క్షణమైనా కోల్పోయే పరిస్థితి మరి కొందరిది. అదే సమయంలో మరో వర్గం ప్రజలు మాత్రం అనుకోకుండానే పొదుపు చేయడం ఎక్కువయ్యింది.

అమెరికాలో ఓ డొమెస్టిక్ వర్కర్

ఫొటో సోర్స్, NDWA

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ లాక్‌డౌన్ వల్ల అమెరికాలో ఇంటి పనులు చేసే కార్మికులు వంటి వ‌ృత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి

ఆశ్చర్యకరమైన రీతిలో అధిక పొదుపు

“ప్రజల ఆర్థిక వాస్తవ స్థితి గతులు ప్రస్తుతం చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. కొంత మంది విషయంలో చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో నా లాంటి వృత్తి నిపుణుల విషయంలో మాత్రం అనుహ్యంగా ఖర్చులు తగ్గి డబ్బును వెనకేయగల్గుతున్నారు" అని రెబకా ఓ కానర్ బీబీసీతో అన్నారు.

ఆమె రాయల్ లండన్‌లో పర్సనల్ ఫైనాన్స్ స్పెషలిస్ట్. అలాగే గుడ్ విత్ మనీ వెబ్ సైట్ వ్యవస్థాపకులు కూడా.

నెల నెలా పిల్లల్ని స్కూలుకు కారులో దిగబెట్టేందుకు అయ్యే పెట్రోలు ఖర్చు ప్రస్తుతం లేదు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థలో రోజూ రెండు గంటలకు పైగా ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు కూడా ఇప్పుడు లేదు. ఫలితంగా ఆమె నెలకు సుమారు 450 డాలర్లు (సుమారు 34,000 రూపాయలు) పొదుపు చేయగల్గుతున్నారు.

అలాగే కాఫీలకు, మధ్యాహ్న భోజనానికి, అప్పుడప్పుడు మద్యానికి అయ్యే మరో 100 డాలర్లు (రూ. 7,500) కూడా ఇప్పుడు ప్రతి నెలా మిగులుతున్నాయి. ఇలా లెక్కేస్తూ పోతే ఫ్రెండ్స్‌తో పార్టీలు, వారాంతాల్లో బయటకు వెళ్లడాలు ఇవేవీ ఇప్పుడు లేవు. అంటే ఆ ఖర్చు కూడా మిగిలినట్టే.

అయితే ఆమె లాంటి కేసులు చాలా అరుదు. బ్రిటన్‌లో ఊహించని విధంగా వచ్చిపడ్డ లాక్‌డౌన్‌తో పొదుపు చేస్తున్న కొంతమంది తమ కలల్ని నిజం చేసుకునేందుకు అంటే ఘనంగా పెళ్లి చేసుకునేందుకు లేదా ఆసియా ఖండమంతా చుట్టి వచ్చేందుకు ఖర్చు పెడతామంటున్నారు.

తాజాగా బ్రిటన్‌కు చెందిన రిజల్యూషన్ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధిక ఆదాయం ఉన్న ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబం అధికంగా పొదుపు చేస్తోందని తేలింది. అదే సమయంలో ప్రతి ఐదు కుటుంబాలలో ఒక కుటుంబం చేసే పొదుపు తగ్గుతూ వస్తోందని స్పష్టమయ్యింది.

ఇక తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల విషయానికి వస్తే.. కేవలం 10% మంది మాత్రమే తమ పొదుపు పెరిగిందని, 29% మంది తగ్గిందని చెప్పుకొచ్చారు.

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వ్యక్తులు ఇప్పటికే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నారు. అందుకే వాళ్లు ఎంతో కొంత వెనకేసుకోగల్గుతున్నారు.

మరోవైపు 20 శాతం అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఈ మహమ్మారి కారణంగా తమ అప్పులు మరింత పెరిగాయని చెబుతున్నారు. ఎక్కువగా క్రెడిట్ కార్డులపై, ఓవర్ డ్రాఫ్టులపై ఆధారపడాల్సి వస్తోందన్నది వారి ఆవేదన.

అయితే అదనంగా పొదుపు చేసిన వాళ్లు ఆ ఆదాయాన్ని ఖర్చు పెట్టాలన్న ఆలోచన మానుకోవాలని రెబకా హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా తొలగిపోలేదని కానర్ అభిప్రాయపడ్డారు.

“అదనంగా ఉన్న డబ్బును ఎక్కడో ఒక చోట అవసరం వచ్చినప్పుడు తీసుకునేందుకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం ఉత్తమం” అని అన్నారు.

లండన్ ఫైనాన్షియల్ సెంటర్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, లండన్ ఫైనాన్షియల్ సెంటర్‌లో చాలా ఆపీసులు, బ్యాంకులు మూతపడ్డాయి.. కానీ చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు

సంక్షోభం... దాని ప్రభావం

“గతంలో మనం చూసిన సంక్షోభాలతో పోల్చితే ఇది వాటికి పూర్తిగా భిన్నమైన ఆర్థిక సంక్షోభం. లేబర్ మార్కెట్‌పై దీని ప్రభావం నేరుగా పడుతోంది” అని అంతర్జాతీయ కార్మిక సంఘానికి (ఐఎల్ఓ) చెందిన పరిశోధకులు స్టివెన్ కాప్సెస్ బీబీసీతో అన్నారు.

ఆర్థికంగా అన్ని రంగాలు మూతబడ్డాయి. వాటితో పోల్చితే మిగిలిన విభాగాలకు చెందిన ఉద్యోగులపై ప్రభావం తక్కువగా ఉంది. రిటైల్, మార్కెటింగ్, ఉత్పత్తి రంగం, స్థిరాస్థి, ఆతిథ్యం, ఆహార రంగాలకు చెందిన ఉద్యోగాలపై లాక్‌డౌన్ ప్రభావం బలంగా పడిందని ఐఎల్ఓ పేర్కొంది.

“ఈ రంగాలతో పాటు అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు లాక్‌డౌన్ ఆంక్షలకు ముందు పని చేసినట్టు ఇప్పుడు చేయలేకపోతున్నారు” అని కాప్సోస్ వ్యాఖ్యానించారు.

అలాంటి వారిలో ల్యుసిమరా రోడ్రిగస్ ఒకరు. బ్రెజిల్‌కి చెందిన 35 ఏళ్ల రోడ్రిగస్ బోస్టన్ ప్రాంతంలో క్లీనర్‌గా పని చేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు.

డబ్బున్న వాళ్ల ఇళ్లలో పని చేయడం వల్ల తనకు నెలకు 3,500 డాలర్లు (సుమారు రూ. 2.5 లక్షలు) నుంచి 4,000 డాలర్ల (సుమారు రూ. 3 లక్షలు) ఆదాయం వచ్చేదని రోడ్రిగస్ బీబీసీతో చెప్పారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు ఆమె ఉపాధి కోల్పోయారు.

“మేం (క్లీనర్లం) ఊహించని విధంగా దెబ్బతిన్నాం. ఇలా రెండు నెలల పాటు ఏ పని లేకుండా ఖాళీగా ఎప్పుడూ కూర్చోలేదు” అని ఆమె అన్నారు.

రోడ్రిగస్ భర్త బిల్డర్‌గా పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆయన చేసే పని కూడా నిలిచిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు ఆరేళ్లు కాగా మరొకరి వయసు 14 ఏళ్లు.

అయితే యజమానుల్లో కొందరు దయార్ధ్రులు తాను పని చేయకపోయినా జీతం ఇస్తున్నారని ఆమె చెప్పారు.

ఇప్పుడు ఆ కుటుంబం తమ నిత్యావసరాలపై పెట్టే ఖర్చును తగ్గించేసింది. పెట్రోల్ విషయంలో కూడా పొదుపు పాటిస్తున్నారు. రోజు రోజుకీ తమ సేవింగ్స్ కరిగిపోతున్నాయని ఆమె ఆందోళన చెందుతున్నారు.

వర్కింగ్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇంటి నుంచి పనిచేయగలుగుతున్న ప్రొఫెషనల్స్‌కి ఖర్చు తగ్గింది

ఎవరి మానాన వాళ్లను వదిలేశారు

అమెరికాలోని ఇళ్లల్లో పని చేసే వాళ్లలో చాలా మంది నల్లజాతీయులు అలాగే లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వారు. ఈ మహమ్మారి సమయంలో వాళ్ల మానాన వాళ్లని వదిలేశారని నేషనల్ డొమస్టిక్ వర్కర్స్ ఎలియన్స్ (NDWA)కు చెందిన సీనియర్ పాలసీ డైరక్టర్ హెయంగ్ యూన్ వ్యాఖ్యానించారు.

అట్టడుగు వర్గాలకు సాయం అందించే సంస్థలు లాక్‌డౌన్ బాధితులకు ఒక్కొక్కరికీ 400 డాలర్లు (రూ. 30 వేలు) చొప్పున సుమారు పది వేల మందికి సాయాన్ని అందించాయి.

డొమెస్టిక్ వర్కర్లకు పెయిడ్ లీవ్, సిక్ లీవ్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలేవీ ఉండవు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో నల్లజాతికి చెందిన డొమెస్టిక్ వర్కర్లలో 70 శాతం మంది లాక్‌డౌన్ కారణంగా వారి ఉద్యోగాలను కోల్పోవడమో లేదా వేతనాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని తేలింది. వారిలో మూడింట రెండొంతుల మంది తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారనో లేదా తగిన ఆదాయం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలను కోల్పోవలసి వస్తుందేమోనని భయపడుతున్నారు.

అధ్యక్షుడు ట్రంప్ మార్చి నెలలోనే 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకంటించినా చాలా మందికి అది అందే పరిస్థితి లేదు. కారణం వలసదారులను, తగిన పత్రాలు లేని వారిని ఆ ప్యాకేజీ నుంచి మినహాయించడమే.

“వైరస్ ఎలాంటి వివక్ష చూపలేదని వాళ్లు అన్నారు. కానీ దేశాన్ని ఏలే విధాన నిర్ణేతలకు వలసదారులు, జాతి, స్త్రీ-పురుషుల పేరిట వివక్ష చూపే అవకాశం ఉందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు” అని యూన్ బీబీసీతో అన్నారు.

టర్కీలో ఓ రెస్టారెంట్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆతిథ్య రంగంలో కార్మికులకు పెద్ద దెబ్బతగిలింది.. రెస్టారెంట్లు తెరిచినా సామాజిక దూరం నిబంధనలతో కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది

పెరగనున్న అసమానతలు

కోవిడ్ -19 వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది.

మరోవైపు ఇప్పటికే పెరిగిపోయిన అసమానతలు మరింత పెరిగి పోకుండా అడ్డుకునేందుకు సంఘటిత విధానాలను అమలు చేయాలని అంతర్జాతీయ ద్రవ నిధి (ఐఎంఎఫ్) పిలుపునిచ్చింది.

వివిధ దేశాల ప్రభుత్వాలు కుప్పకూలిన ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు సుమారు పది ట్రిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నాయి. అయితే పేదల్ని ఆదుకునేందుకు వారికి ఆహారం, నిత్యావసరాలతో పాటు డబ్బు కూడా పంచాల్సినవసరం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది.

ప్రస్తుతానికి తానేమీ నిరాశ చెందడం లేదని రోడ్రిగస్ చెబుతున్నారు. బ్రెజిల్‌లో ఉన్న తల్లి అనారోగ్యానికి చికిత్స చేయించేందుకు దాచుకున్న డబ్బును ప్రస్తుతం ఆమె ఉపయోగించుకుంటున్నారు. అయితే అవి కూడా త్వరగా ఖర్చయిపోతున్నాయి. మళ్లీ ఎప్పుడు తాను సంపాదించే రోజులు వస్తాయో తనకు తెలియదని ఆమె చెప్పారు.

“నాలాగే డబ్బు దాచుకున్న కొంత మంది స్నేహితులు కూడా తమ సేవింగ్స్ అన్నీ కరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఇక ఎప్పుడు ఇదంతా ముగుస్తుందని నన్ను ప్రశ్నిస్తే.. నాకు తెలియదనే నేను సమాధానం చెబుతాను” అని రోడ్రిగస్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)