వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?

వికాస్ దుబే

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్ పోలీసుల బందీగా వికాస్ దుబే
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ హిందీ కోసం

కాన్పూర్‌లో 8 మంది పోలీసుల హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని చెబుతున్నారు. ఈ మొత్తం ఘటనాక్రమంలో పోలీసుల పాత్ర నుంచి, వికాస్ దుబే రాజకీయ పరిచయాల వరకూ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి.

వికాస్ దుబే కోసం కొన్ని డజన్ల బృందాలతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నేపాల్ వరకూ యూపీ పోలీసులు వల పన్నారు. కానీ ఘటన జరిగి వారం అయినా అతడిని పట్టుకోలేకపోయారు. గురువారం ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో వికాస్ దుబే తనకు తానుగా లొంగిపోయాడని చెబుతుంటే, మధ్యప్రదేశ్ పోలీసులు మాత్రం తాము అరెస్టు చేశామని చెబుతున్నారు. కానీ ఈ అరెస్ట్ వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయి.

వికాస్ దుబే మొదట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడని, తర్వాత కాన్పూర్ హైలెట్ ఆస్పత్రిలో చనిపోయాడని శుక్రవారం ఉదయం వార్తలు వచ్చాయి. అతడిని ఆ సమయంలో ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకొస్తున్నామని యూపీ ఎస్టీఎఫ్ సమాచారం ఇచ్చింది.

“కాన్పూర్ దగ్గర ఒక పోలీసు వాహనం హఠాత్తుగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వికాస్ దుబే ఆయుధం లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది” అని చెప్పింది.

అతడి సహచరులు కూడా ఎన్‌కౌంటర్లోనే చనిపోయారు

కానీ, ఈ ఘటనల క్రమం ఎంత కృతకంగా ఉందంటే, జనం అసలు దీన్ని నమ్మలేకపోతున్నారు. నిజానికి, వికాస్ దుబేను ఉజ్జయినిలో అరెస్టు చేసినప్పటి నుంచే అతడికి అలాగే జరుగుతుందని సోషల్ మీడియాలో చాలా మంది అనుకుంటూ వచ్చారు.

దానికి కారణం, ఒక రోజు ముందు యూపీ ఎస్టీఎఫ్ వికాస్ దుబే సహచరులు ఇద్దరిని హరియాణా ఫరీదాబాద్‌లో అరెస్టు చేసింది. యూపీ సరిహద్దుల్లోకి రాగానే ఇప్పుడు వికాస్ దుబే విషయంలో మాదిరిగానే, దాదాపు ఇదే విధంగా, ఇవే పరిస్థితుల్లోనే కాల్చి చంపారు.

వీడియో క్యాప్షన్, వికాస్ దుబే ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది?

ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు

ఎన్‌కౌంటర్ అనే వాదనపై ప్రశ్నలు వెల్లువెత్తేలా ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు సుమారు 1200 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వస్తుంటే ఏ సమస్యా రాలేదు. కానీ కాన్పూర్ దగ్గరకు రాగానే, సరిగ్గా వికాస్ దుబే ఉన్న వాహనం హఠాత్తుగా యాక్సిడెంట్ అయ్యింది. అలా ఎలా జరిగింది?

అంతే కాదు, ఆ వాహనంలోని పోలీసులు గాయపడ్డారు. కానీ, అదే సమయంలోనే గాయపడ్డ పోలీసుల దగ్గర ఆయుధాలు లాక్కున్న వికాస్ దుబే బోల్తా కొట్టిన వాహనం తప్పించుకుని పారిపోతాడు. ఎలా?

కొంతమంది పోలీసులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. కానీ, ఎంతమంది గాయపడ్డారు, వారికి ఎక్కడ, ఎలాంటి గాయాలు అయ్యాయి అనే విషయం గురించి ఇప్పటివరకూ వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. వికాస్ దుబే ఆయుధం లాక్కుని పారిపోతున్నప్పుడు, బుల్లెట్ అతడి గుండెల్లో ఎలా తగిలింది అని అడిగింది.

“బుల్లెట్ వీపులో తగలాలి. వికాస్ దుబే కాల్లో రాడ్ ఉంది. తను సరిగా కొంత దూరం కూడా నడవలేడు. అలాంటిది, అతడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని ఎలా పారిపోయాడు” అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు.

చార్టెడ్ విమానంలో వికాస్ దుబేను తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు, 1200 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ఎందుకు ప్రయాణించాలి. కారులో తీసుకువస్తున్నప్పుడు అతడి చేతులకు సంకెళ్లు ఎందుకు వేయలేదు? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

వికాస్ దుబే

ఫొటో సోర్స్, Reuters

అంతా కాకతాళీయమేనా?

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కాస్త ముందే చెకింగ్ కోసం జర్నలిస్టుల వాహనాలను నిలిపేయడం, రోడ్డు పక్కన డివైడర్ కూడా లేని ప్రాంతంలో వికాస్ దుబేను తీసుకెళ్తున్న వాహనం పల్టీ కొట్టడం కూడా కాకతాళీయమే అనిపిస్తోంది.

పల్టీ కొట్టిన వాహనం చుట్టుపక్కల రోడ్డు మీద ఆ ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించకోవడం, రోడ్డుపై అన్ని వాహనాలు వెళ్తున్నా, ఆ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేకపోవడం కూడా యాదృచ్చికంగానే జరిగింది.

ఉజ్జయిని మహాకాల్ ఆలయం దగ్గర ఏ ఆయుధాలూ లేని గార్డులు వికాస్ దుబేను పట్టుకోగలిగారు. కానీ, యూపీ ఎస్టీఎఫ్ శిక్షణ పొందిన పోలీసు అధికారుల పట్టు నుంచి అతడు పారిపోయాడు. వికాస్‌ను సజీవంగా పట్టుకోకుండా, కాల్చి చంపడమే మంచిదని పోలీసులు కూడా అనుకున్నారు. అన్నీ అలా జరిగిపోయాయి.

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పోలీసుల దగ్గర ప్రస్తుతం సమాధానాలు లేవు లేదంటే వాళ్లు చెప్పాలని అనుకోవడం లేదు. కాన్పూర్ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ అధికారులను మేం ఇదే ప్రశ్నలు అడిగాం. కానీ ఇప్పటివరకూ వాటికి ఎలాంటి సమాధానం రాలేదు.

ఎన్‌కౌంటర్ల గురించి యూపీ ప్రభుత్వాన్ని గతంలో కూడా ప్రశ్నలు చుట్టుముట్టాయి.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 2 వేల ఎన్‌కౌంటర్లు జరిగాయి, వాటిలో వంద మందికి పైగా చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది.

కొన్ని కేసుల్లో మానవ హక్కుల కమిషన్ లాంటి సంస్థల నుంచి యూపీ సర్కారు నోటీసులు కూడా అందుకుంది. కానీ ఎన్‌కౌంటర్ల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

వికాస్ దుబే

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం, పోలీసులకు భయం లేదా?

నకిలీ ఎన్‌కౌంటర్లుగా చెబుతున్న వీటిపై ప్రభుత్వానికి, అధికారులకు న్యాయస్థానం లేదా ఇతర రాజ్యాంగ సంస్థలంటే భయం కూడా ఉండదా? ఈ ప్రశ్నకు సీనియర్ జర్నలిస్ట్ సుభాష్ మిశ్రా సమాధానం ఇచ్చారు.

“ఇన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకూ ఎవరిమీదా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మానవ హక్కుల కమిషన్ లాంటి సంస్థలు, కోర్టుల నుంచి ప్రభుత్వం, పోలీసులను భయపెట్టేలా ఎలాంటి నోటీసులు రాలేదు”

“అలాంటప్పుడు.. ఏం కాదులే అని పోలీసుల్లో కూడా ధైర్యం పెరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే, ఇంతకు ముందు ప్రభుత్వాల సమయంలో వంద ఎన్‌కౌంటర్లు కూడా జరగలేదు. ఎన్‌కౌంటర్ ఇప్పుడు స్టేట్ పాలసీగా మారిపోయింది. దానివల్ల పోలీసులకు మరింత బలం వస్తుంది. ‘ఠోకో(ఢీకొనే) విధానంలో వెళ్లండి’ అని ముఖ్యమంత్రి ప్రతి వేదిక మీదా చెబుతున్నారు”

“యూపీ పోలీసులకు ఒక మంచి అవకాశం దొరికింది. పోలీసులు దానిని సద్వినియోగం చేసుకుని ఉంటే, చాలా రహస్యాలు బయటపడి ఉండేవి. మాఫియా-పోలీసులు-నేతలు ఎంత కుమ్మక్కయ్యారో ప్రజల ముందుకు వచ్చేది. వికాస్‌కు ఎవరెవరు ఆశ్రయం ఇచ్చారు, అతడితో పోలీసులకు ఎలాంటి కనెక్షన్లు ఉన్నాయి తెలిసేది. ఆ తర్వాత అతడికి శిక్ష పడేలా చేసుండచ్చు. అలా, ఈ సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభించకపోయినా, కొంతవరకూ కచ్చితంగా దొరికేది” అని సుభాష్ మిశ్రా చెప్పారు.

“హైదరాబాద్ ఘటన లాగే తమకు కూడా హీరోలయ్యే అవకాశం వచ్చిందని పోలీసులకు అనిపించింది. జనం కూడా ఇలాంటి ఘటనల తర్వాత పోలీసులను నెత్తికెక్కించుకుని హీరోలుగా మార్చేస్తున్నారు” అన్నారు.

మరోవైపు “పోలీసులు వినిపిస్తున్న కథలో చాలా డ్రామా ఉంది. సమాధానాలు ఇస్తున్నకొద్దీ, అంతకు మించి ప్రశ్నలు వస్తున్నాయి. వికాస్ దుబేను తీసుకెళ్తున్న దారిలోనే చంపేస్తారని మీడియా మొన్నటి నుంచే చెబుతోంది. అదే జరిగింది. యూపీ పోలీసులు తమ పరువు కాపాడుకోడానికి, నిస్పక్షపాతంగా ఏదైనా ఏజెన్సీతో దీనిపై దర్యాప్తు చేయించాలి. అప్పుడే ఇది ఫేక్ ఎన్‌కౌంటరా, అసలైన ఎన్‌కౌంటరా బయటపడుతుంది” అని మాజీ పోలీస్ అధికారి విభూతి నారాయణ్ రాయ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)