‘హాంగ్‌కాంగ్ విషయంలో జోక్యం చేసుకోవద్దు‘: బ్రిటన్‌కు చైనా హెచ్చరిక

హాంగ్‌కాంగ్‌లో నిరసనకారుని అరెస్ట్

ఫొటో సోర్స్, Reuters

హాంగ్‌కాంగ్‌లో కొత్త భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చిన చైనా.. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్‌కు చైనా హెచ్చరించింది.

మరోవైపు.. హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుడు ఒకరు తమకు అంతర్జాతీయ మద్దుతు అందించాలని ప్రాధేయపడ్డారు.

హాంగ్‌కాంగ్ పౌరులు 30 లక్షల మంది వరకూ బ్రిటన్ పౌరసత్వం అందిస్తామంటూ యూకే చేసిన ప్రకటన.. ''తీవ్రంగా జోక్యం చేసుకోవటమే''నని చైనా రాయబారి లీయు షిజామింగ్ పేర్కొన్నారు.

చైనా వివాదాస్పదమైన కొత్త చట్టం అమలులోకి తెచ్చినపుడు బ్రిటన్ ఈ పౌరసత్వ ప్రకటన చేసింది.

పాక్షిక స్వయంపత్రిపత్తి ప్రాంతంగా హాంగ్‌కాంగ్‌కు గల స్వాతంత్ర్యాలను చైనా విధించిన కొత్త చట్టం తుడిచిపెడుతుందని ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ విషయంలో తమకు మరింత ఎక్కువ మద్దతు కావాలని.. చైనాకు లొంగిపోవద్దని హాంగ్‌కాంగ్ వాసులతో పాటు, ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య ఉద్యమకారుడు జాషువా వాంగ్ ఇంతకుముందు పిలుపునిచ్చారు.

బ్రిటన్ పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, Reuters

అయితే.. హాంగ్‌కాంగ్ పౌరులకు పౌరసత్వం కల్పిస్తామన్న ప్రతిపాదనను బ్రిటన్ పునఃపరిశీలిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చైనా రాయబారి లియూ చెప్పారు.

''హాంగ్‌కాంగ్ వ్యవహారాలపై బ్రిటన్ ప్రభుత్వం బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది'' అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత.. దీనిపై ఖచ్చితంగా ఎలా స్పందించాలనే అంశంపై చైనా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

హాంగ్‌కాంగ్ ప్రాంతాన్ని చైనాకు తిరిగి అప్పగించే సమయంలో.. ఆ ప్రాంతానికి 50 ఏళ్ల పాటు నిర్దిష్ట స్వాతంత్ర్యాలు అందించేలా 1997లో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలని చైనాకు బ్రిటన్ విజ్ఞప్తి చేసింది.

హాంగ్‌కాంగ్‌లో కొత్త చట్టం విధించటం పట్ల అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

గత వారంలో అమలులోకి తెచ్చిన ఈ చట్టం.. హాంగ్‌కాంగ్ భూభాగంలో 'వేర్పాటు, విద్రోహం, ఉగ్రవాదాలు' లక్ష్యంగా చేసుకుంది. ఆ నేరాలకు గాను గరిష్టంగా జీవితఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది.

జాషువా వాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జాషువా వాంగ్ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు

ఈ చట్టం వాస్తవానికి వాక్‌స్వాతంత్ర్యాన్ని కాలరాస్తుందని వాంగ్ వంటి వ్యతిరేకులు అంటున్నారు. అలాంటిదేమీ జరగదని చైనా తిరస్కరిస్తోంది.

జాషువా వాంగ్‌తో పాటు మరో ఇద్దరిని సోమవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిపై అక్రమ సమావేశం అభియోగాలు మోపారు. ఈ చట్టం ఇప్పటికే భయానకమైన ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

హాంగ్‌కాంగ్‌లోని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి ప్రజాస్వామ్య అనుకూలురు రాసిన పుస్తకాలను గత వారాంతంలో తొలగించారు.

అయితే పోరాటం కొనసాగించాలని జాషువా వాంగ్ కృతనిశ్చయంతో ఉన్నారు.

''ఇది చాలా కష్టతరమైన పోరాటమని మాకు తెలుసు. కానీ ఏదేమైనా అంతర్జాతీయ సమాజంలో మా మిత్రులు తమ అంతర్జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తారు'' అని ఆయన కోర్టు వెలుపల విలేకరులతో చెప్పారు.

''ఈ వారాంతంలో జరుగనున్న ప్రైమరీ ఎన్నికలో హాంగ్‌కాంగ్ ప్రజలు ఓటువేయాలని మేం ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హాంగ్‌కాంగ్‌లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ మరింత ఎక్కువ మంది.. చైనాకు లొంగిపోవటం జరగదని ఆ దేశానికి తెలిసేలా చేయాలని మేం కోరుతున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ చట్టం?

చైనా అమలులోకి తెచ్చిన కొత్త చట్టం.. హాంగ్‌కాంగ్ మీద గతంలో చైనాకు లేని విస్తృత అధికారాలు ఆ దేశానికి లభిస్తాయి. ఈ చట్టం ప్రకారం.. చైనా కేంద్ర ప్రభుత్వం మీద, హాంగ్‌కాంగ్ ప్రాంతీయ ప్రభుత్వం మీద ద్వేషాన్ని ప్రేరేపించటం నేరం అవుతుంది.

వేర్పాటు చర్య, కేంద్ర ప్రభుత్వం పట్ల విద్రోహం, ఉగ్రవాదం, విదేశీ లేదా బయటి శక్తులతో కుమ్మక్కు వంటి పనులన్నీ నేరాలు అవుతాయి.

నిందితుల మీద రహస్య విచారణలకు, అనుమానితుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేయటానికి, వారిని చైనా ప్రధాన భూభాగంలో విచారించటానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది.

జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను పరిష్కరించటానికి హాంగ్ కాంగ్‌లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కార్యాలయం.. హాంగ్‌కాంగ్ స్కూళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన విద్య తదితర అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది.

నిరసనల్లో ఆస్తులను ధ్వంసం చేయటం వంటి వాటిని ఉగ్రవాదంగా పరిగణించవచ్చు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్ల వివరాలను పోలీసులు అడిగినప్పుడు అందించాల్సి రావచ్చు.

ఈ చట్టాలను అమలు చేయటం కోసం హాంగ్ కాంగ్ నగరం సొంతంగా జాతీయ భద్రత కమిషన్‌ను కూడా ఏఱ్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి చైనా ఒక సలహాదారును నియమిస్తుంది.

జాతీయ భద్రత కేసులను విచారించే న్యాయమూర్తులను నియమించే అధికారం హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు ఉంటుంది. ఈ చర్య కారణంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద భయాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా.. ఈ చట్టానికి ఎలా భాష్యం చెప్పాలనే అంశం మీద చైనాకే అధికారం ఉంటుంది. ఈ చట్టంలోని ఏవైనా అంశాలకు హాంగ్ కాంగ్‌లోని ఏవైనా చట్టాలకు మధ్య తేడాలు ఉన్నట్లయితే చైనా చట్టానికే ప్రాధాన్యత లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)