చైనా బ్యుబోనిక్ ప్లేగ్: మంగోలియాలో మొదటి కేసు.. అప్రమత్తమైన అధికారులు

బబోనిక్ ప్లేగ్

ఫొటో సోర్స్, Getty Images

మంగోలియా అటానమస్‌ రీజియన్‌లో ఓ వ్యక్తిలో ప్లేగువ్యాధి లక్షణాలు బైటపడటంతో చైనా అధికారులు రంగంలోకి దిగారు. బయన్నూర్‌ పట్టణంలో వ్యాధిగ్రస్తుడైన ఒక గొర్రెల కాపరిని క్వారంటైన్‌లో ఉంచామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

వ్యాధి నేపథ్యంలో అధికారులు మూడో నెంబర్‌ ప్రమాద సూచికను జారీ చేశారు. ఈ బ్యుబోనిక్‌ ప్లేగు( బొబ్బల రోగం) బ్యాక్టీరియా వల్ల వస్తుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుందని చెబుతున్నారు. అయితే యాంటీ బ్యాక్టీరియాతో దీనికి చికిత్స చేయవచ్చు. బయన్నూర్‌ సిటీలోని ఉరాద్ మిడిల్‌ బ్యానర్‌ ఆసుపత్రిలో శనివారంనాడు ఈ వ్యాధిని గుర్తించారు.

అయితే, పేషెంట్‌కు ఈ వ్యాధి ఎప్పుడు, ఎలా సోకిందో మాత్రం ఇంకా కనుక్కోలేకపోయారు. మూడో నెంబర్‌ ప్రమాద సూచిక జారీ చేసినప్పుడు వేట, మాంసం తినడం నిషేధం విధిస్తారు. ఎక్కడ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే అధికారులకు తెలియజేయాలని స్థానిక ప్రజలకు సూచనలు అందాయి.

ప్రాణాంతకమే.....కానీ చికిత్స ఉంది.

ఈ బ్యుబోనిక్‌ ప్లేగు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల తరచూ బైటపడుతోంది. 2017 సంవత్సరంలో మడగాస్కర్‌లో 300కేసులు బైటపడ్డాయి. మంగోలియా ప్రాంతంలో గత ఏడాది ఈ ప్లేగు వ్యాధి కారణంగా ఇద్దరు చనిపోయారు. ఎలుక జాతికి చెందిన మార్మూట్‌ అనే జంతువు పచ్చిమాంసం తిన్నాకే వీరిద్దరూ ఆ వ్యాధిబారిన పడ్డారని గుర్తించారు.

మంచి ఆరోగ్యానికి మార్మూట్‌ పచ్చి మాంసం, కిడ్నీ ఉపయోగపడుతుందని స్థానికులు నమ్ముతారని మంగోలియా రాజధాని ఉలన్‌బాటర్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

ఎలుకలు ప్లేగు వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాకు వాహకాలుగా పని చేస్తాయని, తరచూ దేశంలో ప్లేగు వ్యాధికి ఎలుకలే కారణమని భావిస్తున్నారు. మార్మూట్‌లను వేటాడటం మంగోలియాలో చట్టవిరుద్ధం.

చంకల్లో గడ్డల రూపంలో ఈ ప్లేగు వ్యాధి బైటపడుతుంది. తొలి రోజుల్లో ఈ వ్యాధిని గుర్తించడం కష్టం. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మూడు, నాలుగు నుంచి వారం రోజుల తర్వాత జ్వరం లక్షణాలు బైటపపడతాయి.

ఈ ప్లేగువ్యాధికే బ్లాక్‌డెత్‌ అనే పేరు కూడా ఉంది. ఇది మహమ్మారిగా పరిణమిస్తుంది. "14వ శతాబ్దంలో మాదిరి కాకుండా, ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పుడు మనం గుర్తించగలుగుతున్నాం'' అన్నారు డాక్టర్‌ శాంతి కప్పగోడ. స్టాన్‌ఫోర్డ్ హెల్త్‌ కేర్‌లో పనిచేస్తున్న ఆమె హీత్‌లైన్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడారు. "దీన్ని ఎలా కంట్రోల్‌ చేయాలో మనకు తెలుసు. యాంటిబయాటిక్స్‌ సాయంతో వ్యాధిబారిన పడిన వాళ్లకు చికిత్స చేయగలుగుతున్నాం'' అని ఆమె అన్నారు.

14వ శతాబ్దంలో బ్లాక్‌డెత్‌గా పేరున్న ఈ వ్యాధికి ఆఫ్రికా ఆసియా, యూరప్‌ ఖండాల్లో దాదాపు ఐదుకోట్లమంది ప్రజలు మరణించారు. 1665 సంవత్సరంలో ఈ వ్యాధి లండన్‌లో ఘోరకలిని సృష్టించింది. ఆ రోజుల్లో నగరంలో నివసిస్తున్న ఐదింట ఒకవంతుమందిని చంపేసింది. 19 శతాబ్దంలో భారత్‌, చైనా దేశాలలో ఈ వ్యాధి విజృంభించడంతో సుమారు కోటీ 20 లక్షలమంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)