'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్థ్ హెన్రీ
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

అగ్నిపర్వతం రౌద్ర రూపం చూపినపుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనం ఇల్లూవాకిలీ వదిలి దూర ప్రాంతాలకు తరలిపోతుంటారు.

కానీ ఇండోనేసియాలోని కావా ఈజెన్ అనే అగ్నిపర్వతం పేలినపుడు మాత్రం దాన్ని చూడ్డానికి సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. ఎందుకంటే ఈ అగ్నిపర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది.

విస్ఫోటనం సమయంలో దీనిలోంచి వచ్చే భగభగమండే మంటలు ఎర్రగా ఉండవు. ఆ జ్వాలలు నీలంగా ఉంటాయి. ఈ అగ్నిపర్వతం నుంచి సల్ఫర్ వస్తుందని స్థానికులు చెబుతారు. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని అంటారు.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

సల్ఫర్ చాలా ఖరీదైన రసాయన మూలకం. దీన్ని చాలా వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. జావా, ఇండోనేసియా పరిశ్రమలకు దీనిని లైఫ్‌లైన్‌గా భావిస్తున్నారు.

అగ్నిపర్వతంలో ప్రత్యేక లోహంతో తయారు చేసిన పైపుల్ని బిగించారు. వాటి ద్వారా ఆ సల్ఫర్ బయటకు వస్తుంటుంది. అది తర్వాత చల్లబడి బంగారు రంగులోకి మారుతుంది.

ఈ గనుల్లో పనిచేసే వారు దీన్ని 'డెవిల్స్ గోల్డ్' అంటారు. ఇక్కడున్న చాలా మంది దీన్ని తీసే పని ద్వారా పొట్టపోసుకుంటున్నారు. కానీ దీన్ని బయటకు తీసుకురావడానికి కార్మికులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

'డెవిల్స్ గోల్డ్' సేకరించడానికి ఇక్కడి కార్మికులు అర్థరాత్రి నుంచే ప్రయాణం ప్రారంభిస్తారు. మోటార్ సైకిళ్లలో అగ్నిపర్వతం దగ్గరికి చేరుకుంటారు.

తర్వాత అక్కడి నుంచి సుమారు 2800 మీటర్ల ఎత్తుకు వెళ్లి అక్కడ గడ్డకట్టిన సల్ఫర్ ముక్కలను విరగ్గొడతారు. వాటిని వెదురు బుట్టల్లో నింపి భుజాలపై పెట్టుకుని కిందికి తీసుకొస్తారు.

ప్రపంచంలోని సల్ఫర్ తవ్వకాలు జరిగే కొన్ని అగ్నిపర్వతాల్లో కావా ఈజెన్ ఒకటి. కానీ ఇప్పటికీ ఈ పనిని చేతులతోనే చేస్తున్నారు.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

పర్వతంపైకి ఎక్కిన తర్వాత సల్ఫర్ ముక్కలను విరగ్గొట్టడం ఎంత కష్టమో, వాటిని తీసుకుని కిందకు దిగడం ఇంకా కష్టంగా ఉంటుంది.

కార్మికులు భుజాలపై తమ శరీరం కంటే ఎక్కువ బరువు మోస్తుంటారు. ఈ బరువు వల్ల భారం వారి భుజాలపై మాత్రమే ఉండదు. వారి కాళ్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

దాంతోపాటు గాలి, నీళ్లతో సల్ఫర్ రియాక్ట్ అయినప్పుడు, దాని నుంచి విషపూరిత వాయువులు విడుదలవుతాయి. అవి గాలిలో కలిసిపోయి చాలా ప్రమాదంగా మారుతుంది.

అందుకే, కూలీలు అగ్నిపర్వతంపై పనిచేసినంతసేపూ వారి కళ్ల నుంచి నీళ్లు ధారగా కారుతూనే ఉంటాయి.

ఇక్కడ పనిచేసేవారిలో ఎక్కువ మందికి శ్వాస కోస సమస్యలు ఎదురవుతుంటాయి. చాలా మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. కార్మికులు ఎప్పుడూ దగ్గుతూనే ఉంటారు. వారి గొంతు పూర్తిగా పాడైపోతుంది.

చాలా బరువున్న సల్ఫర్‌ను మోయడంతో వారి భుజాలు చెక్కుకు పోతాయి. మచ్చలు వస్తాయి. చాలా గనుల్లో కార్మికులు సమయానికి ముందే పని పక్కన పెట్టి ఆస్పత్రుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కార్మికుల్లో చాలా మంది పేదరికం వల్ల ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకోలేకపోతున్నారు.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

కానీ ఈ కార్మికులు తమ ఆరోగ్యాన్నే పణంగా పెట్టినా వారికి పనికి తగినంత కూలీ కూడా దొరకడం లేదు. ప్రతి కార్మికుడికి రోజుకు 10 నుంచి 15 డాలర్లు అందుతాయి.

జావాలో దూర ప్రాంతాల వరకూ ఉద్యోగవకాశాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ పనిచేయడం తప్ప వీరికి వేరే దారి లేకుండాపోయింది.

మొదట్లో వీరంతా అక్కడ వ్యవసాయ పనులకు వెళ్లేవారు. దాన్లో వచ్చే కూలీ కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్రాణాలను పణంగా పెట్టి గనుల్లో పనిచేయడమే మంచిదని భావించారు.

డెవిల్స్ గోల్డ్

ఫొటో సోర్స్, AURELIE MARRIER D'UN​IENVILLE/INSTITUTE

ప్రపంచంలో అగ్నిపర్వతాలు ఉన్న చాలా ప్రాంతాల్లో సల్ఫర్ తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ అక్కడంతా ఈ పనులు మెషీన్లతో చేస్తున్నారు.

దానితోపాటూ అక్కడ కార్మికుల కోసం రక్షణ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ ఈజెన్ అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి ఏర్పాట్లు లేవు.

తమ వారసులు ఈ గనుల్లో పనిచేయకూడదనే ఇప్పుడు ఇంత కష్టానికి సిద్ధమయ్యామని ఇక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)