జైషే మహమ్మద్ క్యాంప్‌పై దాడి శాటిలైట్ చిత్రాల్లో వాస్తవం ఎంత: Fact Check

ఫొటో సోర్స్, GOOGLE/ZOOM EARTH
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత వైమానిక దళం దాడులతో ధ్వంసమైన జైషే మహమ్మద్ మిలిటెంట్ క్యాంప్‌కు సంబంధించిన ఫొటోలు అంటూ ప్రముఖ న్యూస్ ఛానల్ చెబుతున్న వీడియోను మోదీ ప్రభుత్వ మంత్రి గిరిరాజ్ సింగ్ షేర్ చేశారు.
గిరిరాజ్ సింగ్ తన ట్వీట్‌లో "భారత వైమానిక దళం దాడుల్లో పాకిస్తాన్‌లోని మిలిటెంట్ శిక్షణ శిబిరాలు ధ్వంసం అయ్యాయని ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోందని" రాశారు.
ఈ వీడియోలో రెండు శాటిలైట్ ఫొటోలు కనిపిస్తున్నాయి. అందులో ఒక ఫొటోను దాడికి ముందు( ఫిబ్రవరి 23న) తీశారని, రెండో ఫొటోను దాడి తర్వాత( ఫిబ్రవరి 26న) తీశారని చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER
సోషల్ మీడియాలో వైరల్
ఈ వైరల్ వీడియోను కొన్ని వేల మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత వైమానిక దాడుల్లో జైషే క్యాంపులు ధ్వంసం అయ్యాయనడానికి ఇదే ఆధారం అంటూ చాలా మంది ఈ శాటిలైట్ ఫొటోలను షేర్ చాట్, వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు.
జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ క్యాంపులపై దాడులు చేసింది.
భారత వైమానిక దళం చీఫ్ వీఎస్ ధనోవా కూడా తమకు ఇచ్చిన వాటిలో వైమానికదళం చాలా లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసిందన్నారు. కానీ ఈ దాడిలో ఎంతమంది చనిపోయారనేది చెప్పడం తమ పని కాదన్నారు.
భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షాతోపాటు చాలా మంది బీజేపీ నేతలు కూడా ఈ దాడుల్లో 200 మందికి పైగా మిలిటెంట్లు మృతిచెందారని చెబుతున్నారు. జైషే క్యాంపుల్లో భారీ నష్టం జరిగిందని అంటున్నారు.
కానీ, దీన్ని నిజం అని నిరూపించడానికి మితవాద వైఖరి ఉన్న చాలా గ్రూపులు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ షేర్ చేసిన ఈ రెండు శాటిలైట్ ఫొటోల్లో ఉన్న వాదన నిజం కాదు.
ఈ రెండు శాటిలైట్ ఫొటోలకు రాయిటర్స్ బుధవారం విడుదల చేసిన ఫొటోలతో కూడా పోలిక లేదు. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జరిగిన నష్టం అంటూ చూపించడానికి భారత మీడియా వాటిని మరోసారి ఉపయోగించింది.

ఫొటో సోర్స్, BING MAPS/ZOOM EARTH
అయితే ఈ ఫొటోలు ఎక్కడివి?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మేం కొందరు ఫేస్‌బుక్, ట్విటర్ యూజర్స్ దగ్గరికి చేరాం. వారు ఈ శాటిలైట్ ఫొటోల 'లైవ్ కోఆర్డినేట్స్' కూడా షేర్ చేశారు. అంటే మ్యాప్‌లో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో వాటి ద్వారా తెలుస్తుంది.
గూగుల్ మ్యాప్స్ వెతికినప్పుడు ఇది న్యూ బాలాకోట్ దగ్గర ఉన్న జాబాలోని ఒక భవనం శాటిలైట్ ఫొటో అని మాకు తెలిసింది.
భారత వైమానిక దళం దాడి తర్వాత భారత ఇంటర్‌నెట్ యూజర్స్ కొంతమంది ఈ భవనానికి కొత్త పేరు ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ లొకేషన్‌పై 'జైషే మదరసా', 'జైషే ట్రైనింగ్ స్కూల్' అని కూడా రాసి ఉండడం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, TWITTER
ఈ ఫొటోలు ఎప్పటివి?
గిరిరాజ్ సింగ్ ట్వీట్‌లో ఒక వీడియో ఉంది. అందులో టీవీ ఛానల్ గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్న ఒక శాటిలైట్ ఫొటోను దాడికి ముందు ఫిబ్రవరి 23న తీశారని, ఇంకొక ఫొటోను దాడి తర్వాత తీశారని చెబుతోంది. కానీ ఈ రెండు వాదనలూ నిజం కాదు.
మా పరిశోధనలో రెండో ఫొటో 'జూమ్ ఎర్త్' వెబ్‌సైట్ నుంచి తీసుకున్నట్టు తేలింది. అది నాసా, మైక్రోసాఫ్ట్ బింగ్ మ్యాప్స్ సాయంతో శాటిలైట్ ఫొటోలు చూపిస్తుందని తెలిసింది.
ఈ వెబ్‌సైట్ వ్యవస్థాపకులు పాల్ నీవ్ లండన్‌లో ఉంటారు. ఆయన బీబీసీ ప్రతినిధి ప్రశాంత్ చాహల్‌తో మాట్లాడారు. ఈ ఫొటోల గురించి కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER
ఎన్నో ఏళ్ల క్రితం ఫొటో
వైమానిక దాడుల తర్వాత ధ్వంసమైన బిల్డింగ్ చూపిస్తున్న ఫొటో, పాతది అని పాల్ చెప్పారు. "కేవలం నాసా మాత్రమే రోజూ కొత్త ఫొటోలను అప్‌డేట్ చేస్తుంది. బింగ్ మ్యాప్స్ ఫొటోలు రోజూ అప్‌డేట్ కావు. అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని శాటిలైట్ ఫొటోలను అప్‌డేట్ చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది" అన్నారు.
కానీ ఈ వైరల్ ఫొటో ఎంత పాతదయ్యుంటుంది. దీనికి సమాధానంగా పాల్ "నేను ఒకటి మాత్రమే చెప్పగలను. ఇది కొన్ని రోజులదో, నెలలదో కాదు. ఇది కొన్నేళ్ల క్రితం ఫొటో అయ్యుంటుంది. నాకు తెలిసి ఈ శాటిలైట్ ఫొటోలో కనిపించే భవనం నిర్మాణంలో ఉండి ఉంటుంది" అన్నారు.
'జూమ్ ఎర్త్' వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు పాల్ నీవ్ బహిరంగంగా ఒక ట్వీట్ చేసి కూడా ఈ ఫొటోలకు ఎయిర్ స్ట్రైక్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

మరో ఫొటోపై ప్రశ్నలు
ఇప్పుడు మొదటి ఫొటో విషయానికి వద్దాం. ఇది 'గూగుల్ మ్యాప్స్' నుంచి తీసుకున్న ఒక శాటిలైట్ ఫొటో.
ఇది పాకిస్తాన్ జాబాలో ఉన్న అదే ప్రాంతానికి సంబంధించింది. కానీ భవనం పరిస్థితి చూస్తే ఇది కాస్త ఇటీవలి ఫొటోలాగే ఉంది.
టీవీ చానల్ ఈ శాటిలైట్ ఫొటోను వైమానికదాడులకు ముందు(ఫిబ్రవరి 23న) తీసిందని చెప్పింది.
అయితే, ఈ ఫొటో ఫిబ్రవరి 23న తీసింది అయితే, ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో ఈ భవనం స్టేటస్ ఎందుకు మారలేదు అని చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు.
వీటిలో కొన్ని ప్రశ్నలు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వాదనకు కూడా క్వశ్చన్ మార్క్ పెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- #BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది?
- ఇండియన్ ఆర్మీ: ‘‘కశ్మీర్ తల్లులారా... ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే వాళ్లు చనిపోతారు’’
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








