పాకిస్తాన్‌లో భారత టీవీ షోలు, సినిమాలను నిషేధిస్తే ఎవరికి లాభం?

ఫొటో సోర్స్, SC OF PAK
- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
పాకిస్తాన్‌లోని టీవీ చానళ్లలో భారత్‌కు చెందిన కార్యక్రమాలను, చిత్రాలను ప్రసారం చేయవద్దంటూ అక్కడి సుప్రీం కోర్టు గతంలో విధించిన నిషేధాన్ని మరోసారి పునరుద్ధరించింది. పాకిస్తాన్ సినిమా హాళ్లలో బాలీవుడ్ సినిమాలను నిషేధిస్తూ ఇప్పటికే ఆ దేశంలోని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు భారత్ కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది.
ఈ అంశంపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పీఈఎంఆర్ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై అక్కడి సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణ జరిగే వరకూ నిషేధం కొనసాగుతుందని కోర్టు తెలిపింది.
పీఈఎంఆర్ఏ 2006 విధాననిర్ణయాల ప్రకారం - స్థానిక టీవీ చానళ్లు తమ కార్యక్రమాల్లో 10 శాతం వరకూ విదేశీ (భారత్‌తో సహా) సమాచారాన్ని ప్రసారం చేయవచ్చు. అయితే, ఈ నిబంధన అమలు భారత్ ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది.
2016లో పఠాన్‌కోట్ దాడి తర్వాత భారత కార్యక్రమాలపై పీఈఎంఆర్ఏ పూర్తి నిషేధం విధించింది. దీన్ని లాహార్ హైకోర్టులో సవాల్ చేయగా, కోర్టు ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ నిషేధం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చిచెప్పింది. దీనిపై పీఈఎంఆర్ఏ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాత్కాలికంగా నిషేధాన్ని విధిస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

పుల్వామాదాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందంటూ భారత్ చేస్తున్న ఆరోపణల కారణంగా ఓ భారత మేనేజ్‌మెంట్ కంపెనీ పాకిస్తాన్ టీ-20 అధికారిక ప్రొడ్యూసర్ హోదా నుంచి తప్పుకుంది. అంతేకాదు, ఈ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదని పీఈఎంఆర్ఏ ప్రతినిధి ఫకరుద్దీన్ మౌగల్ వ్యాఖ్యానించారు.
"ఈ పిటిషన్ గతంలో ఎప్పుడో దాఖలైంది. ఇప్పుడు సుప్రీం కోర్టు నిర్ణయం కారణంగా స్థానిక చానళ్లకు భారత కార్యక్రమాలను ఒక్క శాతం కూడా ప్రసారం చేసేందుకు అనుమతి లేదు" అని ఆయనన్నారు.
"సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి భారత్ వస్తూంటే, భారత కార్యక్రమాలను చూడాలని ఎవరు కోరుకుంటారు" అని ముగ్గురు సభ్యుల బృందంలోని ఓ జడ్జి వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు.
ఇరుదేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్త వాతావరణ ప్రభావమే ఈ నిర్ణయానికి కారణం కావచ్చని హసన్ జైదీ అనే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. కానీ, ఇది మరింత సంక్లిష్టమైన అంశమని ఆయనన్నారు.
"ఈ నిషేధం వెనక ఉద్దేశం ఇంకా స్పష్టం కాలేదు. పీఈఎంఆర్ఏ విధానంలోని 10 శాతం విదేశీ కార్యక్రమాల నిబంధన నుంచి భారత్‌ను మాత్రమే తొలగించడం ఎందుకు? దీనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యుద్ధాన్ని తలపించే ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై మాట్లాడటం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. పరిస్థితులు కుదుటపడితే ప్రజలే ఈ అంశాన్ని లేవనెత్తుతారు" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, ప్రస్తుత నిషేధం కేవలం టీవీ చానళ్లకే పరిమితం కాలేదు.
"భారత సినిమాలను పాకిస్తాన్‌లో విడుదల చేయం" అని ఫిబ్రవరి 26న పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్విటర్లో ప్రకటించారు.
"సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భారత సినిమాలను నిషేధించింది. పాకిస్తాన్‌లో భారత సినిమాలు విడుదల కావు. 'మేడ్ ఇన్ ఇండియా' ప్రకటనలపై కూడా చర్యలు తీసుకోవాలని పీఈఎంఆర్ఏను ఆదేశించాం. పాకిస్తాన్ సిద్ధంగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, ఇది స్వయంగా విధించుకున్న నిషేధం. దీన్ని ఎప్పుడైనా ఎత్తేయవచ్చు. భారత స్పందనకు ఇది ప్రతిస్పందన అని పాకిస్తాన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది. పాకిస్తానీ గాయకులు, నటులపై నిషేధం విధిస్తూ అఖిల భారత సినీ ఉద్యోగుల సంఘం నిర్ణయించాక పాకిస్తాన్ ఈ విధంగా స్పందించిందని పాకిస్తాన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది.
"దేశం ముఖ్యం, మేం మా దేశంతో పాటే ఉంటాం" అని భారత సినీ ఉద్యోగులసంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏ సంస్థ అయినా పాకిస్తానీ కళాకారులు, నటులతో పనిచేస్తే తీవ్రచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
"రెండు వైపులా ఉద్వేగాలు తారస్థాయిలో ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ కూడా ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. అయితే, ఇది తాత్కాలికమే కావచ్చు. రెండు అణ్వస్త్ర దేశాల్లో ఎవరి ఆలోచనలు సరైనవైతే వారే గెలుస్తారు. రెండు దేశాల్లోని కళాకారులు, నటుల మధ్య మంచి సంబంధాలుంటే అది ఇద్దరికీ మంచిది. ఒకరికొకరు పోటీపడేకన్నా ఒకరి సామర్థ్యం నుంచి మరొకరు ప్రయోజనం పొందడం మంచిది" అని చిత్ర నిర్మాత, పాకిస్తాన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నదీం మాండ్వివాలా అభిప్రాయపడ్డారు.
"బాలీవుడ్ సినిమాలపై పాకిస్తాన్‌లో నిషేధం సరికాదు. పాకిస్తాన్ సినీ పరిశ్రమ ఆదాయంలో 70శాతం భారత్ సినిమాల నుంచే వస్తోంది. బాలీవుడ్ చిత్రాలు లేకపోతే దానికి మనుగడే ఉండదు" అని హసన్ జైదీ వ్యాఖ్యానించారు.
భారత టీవీ చానళ్లపై నిషేధం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమా అనే అంశంపై సుప్రీం కోర్టు తదుపరి విచారణలో సమీక్షించనుంది. తదుపరి విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








