భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో మోదీకి లాభమా? - అభిప్రాయం

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప, ప్రధాని మోదీ
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఒక రాజకీయనాయకుడు చేసే అతి పెద్ద తప్పు... నిజం చెప్పడం" - అని అమెరికన్ పొలిటికల్ జర్నలిస్ట్ మైకేల్ కిన్స్‌లే ఓసారి అన్నారు.

బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత గతవారం ఇలాంటి తప్పే ఒకటి చేశారు.

"సరిహద్దుల్లో భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రానున్న సాధారణ ఎన్నికల్లో మా పార్టీకి డజన్ల కొద్దీ సీట్లు తెచ్చేందుకు తోడ్పడతాయి" అని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు వెంటనే తమ విమర్శలకు పదునుపెట్టాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను నరేంద్ర మోదీ, బీజేపీ.. మరో నెలలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించాయి.

మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అయితే యడ్యూరప్ప చేసిన ఈ వ్యాఖ్య వల్ల బీజేపీ కూడా ఇబ్బంది పడిందని అనిపిస్తోంది. దీనిపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందించారు. "దేశాన్ని రక్షించడం, పౌరుల భద్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకే ఈ దాడులు చేసింది కానీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవడానికి కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ది కోసం యుద్ధాన్ని తలపించే ఉద్రిక్తతలను సృష్టించామని చెప్పడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయదు.

భారత్, పాక్‌ల మధ్య ఉన్న నియంత్రణ రేఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్, పాక్‌ల మధ్య ఉన్న నియంత్రణ రేఖ

గత వారం జరిగిన వైమానిక దాడులతో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచినప్పటికీ ఎప్పటిలానే మోదీ తన పనుల్లో తాను మునిగిపోయారు. భారత్ దాడి చేసిన కొన్ని గంటల తర్వాత ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... "భారత్ పూర్తిగా సురక్షిత హస్తాల్లో ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఏమాత్రం నిస్సహాయంగా లేదు" అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజు ఉదయం పాకిస్తాన్ ప్రతి దాడి చేసింది, ఓ భారత యుద్ధ విమానం పైలట్‌ను అరెస్టు చేసింది. రెండు రోజుల తర్వాత ఆ పైలట్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది.

"ఇప్పుడు జరిగిన వైమానిక దాడి కేవలం ఓ ప్రయోగం, ఇలాంటివి మరిన్ని జరగబోతున్నాయి" అని శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ప్రకటించారు. మరోచోట, బాలాకోట్ దాడిలో 250 మందికి పైగా మిలిటెంట్లను భారత్ హతమార్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కానీ రక్షణ శాఖలోని సీనియర్ అధికారులు ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారో తెలియదంటున్నారు.

భారత్ - పాక్ సరిహద్దు

ఫొటో సోర్స్, Getty Images

సైనికులు వెంట నడుస్తుండగా, యుద్ధ విమానాలు ఎగురుతుండగా, బాంబు పేలుళ్లు మధ్య మోదీ తుపాకులు పట్టుకుని నిల్చున్న పోస్టర్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వెలిశాయి.

"ఎన్నికల ప్రచార పోస్టర్లు, వేదికలపై సైనికుల ఫొటోలు ఉంచడం అసౌకర్యంగానే ఉంటుంది. దీన్ని నిషేధించాలి. యూనిఫాం చూపించి ఓట్లు అడగడమనేది దారుణం" అని సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్ ట్వీట్ చేశారు.

ప్రస్తుత ఉద్రిక్తతలపై రాజకీయం చేయొద్దని మోదీ ప్రతిపక్షాలను కోరారు. కానీ మోదీ తనమాటను తానే నిలబెట్టుకోకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టకూడదని ప్రతిపక్షాలు గతవారం ఓ ప్రకటన విడుదల చేశాయి.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ ప్రయోజనాలే పరమావధి

అయితే, ఈ పరిస్థితి మోదీకి ఓట్లు తెచ్చిపెడుతుందా? మరోమాటలో చెప్పాలంటే, దేశ భద్రత ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతుందా?

ఈ అంశాన్నే మోదీ తన ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తారని చాలామంది భావిస్తున్నారు. కశ్మీర్లో గత నెల్లో జైషే మహమ్మద్ చేసినట్లుగా చెబుతున్న ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా పారామిలిటరీ సిబ్బంది మరణించడంతో మోదీకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇటీవల మూడు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి, వ్యవసాయ రంగంలో సంక్షోభం, నిరుద్యోగం... ఇవన్నీ కలసి బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తాయేమోనని ఆ పార్టీ భయపడుతోంది.

"కానీ ఇప్పుడు, దేశ భద్రతను కాపాడే యోధుడిగా తనను తాను చూపించుకోవడంతో మోదీకి అవకాశాలు మెరుగయ్యాయని కొందరు భావిస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం యుద్ధాన్ని ఉపయోగించుకోవడం, రాజకీయ లబ్దికోసం దేశ భద్రతను ఆయుధంగా మార్చుకోవడం చాలా దారుణం. అయితే దీనివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను" అని రాజకీయ నాయకుడు, సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు.

భారత పార్లమెంటుపై దాడి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత పార్లమెంటుపై దాడి

దేశ భద్రత అనే అంశం మన దేశంలో ఎన్నికలు గెలవడానికి ఎంతవరకూ ఉపయోగపడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయని బ్రౌన్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ అశుతోష్ వర్షనీ అన్నారు. గతంలో తలెత్తిన జాతీయ భద్రతా సమస్యలన్నీ ఎన్నికలకు ఎంతో కాలం ముందు జరిగాయని ఆయన తెలిపారు.

1962లో చైనాతో యుద్ధం, 1965, 1971లలో పాకిస్తాన్తో యుద్ధాలు అప్పట్లో సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగాయి. యుద్ధానికి ఎన్నికలకు మధ్య సమయం నెలల నుంచి రెండేళ్ల వరకూ ఉంది. 2001లో మరోసారి భారత్-పాక్లు యుద్ధం అంచుకు తీసుకెళ్లిన భారత పార్లమెంటుపై దాడి ఘటన కూడా ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత జరిగింది. 2008లో జరిగిన ముంబయి దాడులు 2009 సాధారణ ఎన్నికలకు ఐదు నెలల ముందు జరిగాయి. అయితే దీన్నేమీ ప్రచారంలో ఉపయోగించుకోకుండానే అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించింది.

కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. గత నెలలో కశ్మీర్లో జరిగిన ఆత్మాహుతి దాడి, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎన్నికల పరంగా గతంలోని భద్రతాపరమైన సమస్యలకన్నా ఎంతో ప్రముఖమైనవి అని వర్షనీ అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఇది జరిగింది. పట్టణ మధ్యతరగతి వేగంగా పెరుగుతోంది. అంటే భద్రతాపరమైన అంశాలకు ఆ వర్గంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా, దిల్లీలో ఎలాంటి ప్రభుత్వం ఉంది? అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. హిందూ జాతీయవాదులు దేశభద్రతపై కాంగ్రెస్ కన్నా చాలా ధృఢంగా ఉంటారు. కొన్ని ప్రత్యేక మినహాయింపుల్లో తప్పించి, ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలకు దేశ భద్రత ఎప్పుడూ అంతగా ప్రయోజనాన్నివ్వదు. అవి ఎప్పుడూ కులం, మతం ఆధారంగానే ముందుకుసాగుతుంటాయి" అని ప్రొఫెసర్ వర్షనీ అభిప్రాయపడ్డారు.

భారత్-పాక్ సరిహద్దు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-పాక్ సరిహద్దు

బలమైన విదేశీ విధానాలు, ఇతర దేశాల నేతలను కలుసుకోవడానికి తరచూ విదేశీ పర్యటనలు కొన్ని వర్గాల ఓటర్లపై ప్రభావం చూపించవచ్చని బ్రౌన్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రవేత్త భాను జోషి తెలిపారు. "విదేశాల్లో భారత ప్రతిష్ట పెరిగిందంటూ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తరచుగా మాట్లాడుకోవడాన్ని నేను అక్కడ పనిచేస్తుండగా పరిశీలించాను. ఇలాంటి భావాలకు బాలాకోట్ దాడులు మరింత బలాన్ని చేకూరుస్తాయి. వాటిని అభిప్రాయాలుగా మారుస్తాయి. భారత్-పాకిస్తాన్‌ల మధ్య ద్విముఖ పోరు వంటి ఇలాంటి అంశాలు ప్రత్యేకించి ఈశాన్య భారతంలో ఎంతో ప్రభావం చూపిస్తాయనుకుంటున్నా" అని జోషి అభిప్రాయపడ్డారు.

పుల్వామా దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుల్వామా దాడి

సీనియర్ ఫెలో, కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ సౌత్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. "భారత అంతర్గత విధానాల్లో విదేశీ విధానం అంత పెద్ద అంశమేమీ కానప్పటికీ, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తలెత్తిన ఈ ఉద్రిక్తతలు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, సమర్థంగా ఎదుర్కొంటూన్నామంటూ వాటిని తనకు అనుకూలంగా మార్చుకోగల మోదీ, ఇవన్నీ ప్రచారంలో ప్రముఖంగా మారతాయనుకుంటున్నా" అని అన్నారు.

అయితే, ఇవేవీ కూడా ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగంలో నెలకొన్న అసంతృప్తిని, ముఖ్యంగా పల్లె ప్రాంతాల నుంచి పక్కకు నెట్టలేవని డాక్టర్ వైష్ణవ్ నమ్ముతున్నారు. "ఈ అంశంతో పట్టణ ప్రాంతాల్లోని తటస్థ ఓటర్ల నుంచి బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 2019లో తటస్థులు ఎటువైపు మొగ్గుతారనేదాన్ని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఈ భావోద్వేగ పరిస్థితి వారిని ప్రస్తుత నాయకత్వంవైపే మొగ్గుచూపేలా చేయవచ్చు" అని వైష్ణవ్ అంటున్నారు.

జాతీయ భద్రత ఆధారంగా తన ఎన్నికల అజెండాను మోదీ రూపొందించుకోవడాన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఈశాన్య భారతంలో బీజేపీకి అవకాశాలను మెరుగు పరుస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంచెం తగ్గినా, అది పార్టీని విజయపథంలోకి తీసుకురావడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే రాజకీయాల్లో పరిస్థితులు మారడానికి ఒక్కవారం చాలు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)