ఒడిశా బిజు పట్నాయక్‌ ఇండోనేసియా 'భూమి పుత్ర' ఎలా అయ్యారు?

బిజూ పట్నాయక్

ఫొటో సోర్స్, Bijujantadalodisha/facebook

బిజయానంద్ పట్నాయక్‌ను జనం ప్రేమగా బిజూ పట్నాయక్ అని పిలుచుకుంటారు. స్వాతంత్ర సమరయోధుడుగా, సాహసాలు చేసిన పైలెట్‌గా, పెద్ద రాజకీయవేత్తగా బిజూ పట్నాయక్ గురించి అందరికీ తెలుసు.

ఆధునిక ఒడిశాకు ఆయనను రూపశిల్పిగా కూడా భావిస్తారు. అంతే కాదు పట్నాయక్‌ చేసిన ఒక సాహసం ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుడిని చేసింది. ఇండోనేసియాకు స్వతంత్రం రావడంలో బిజూ పట్నాయక్ కీలక పాత్ర పోషించారు.

భారత స్వతంత్ర పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ, బిజూ పట్నాయక్ మధ్య స్నేహం చాలా విశ్వసనీయమైనదని భావిస్తారు.

పురాతన కాలం నుంచీ భారత్, ఇండోనేసియా మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అందుకే నెహ్రూ ఇండోనేసియా స్వతంత్ర పోరాటంపై కూడా ఆసక్తి కనపరిచేవారు.

బిజూ ఇండోనేసియా
ఫొటో క్యాప్షన్, కుటుంబంతో ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో

స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ వలసవాదానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఇండోనేసియాకు డచ్ వారి నుంచి విముక్తి అందించడానికి సాయం అందించే బాధ్యతలను ఆయన బిజూ పట్నాయక్‌కు అప్పగించారు.

ఇండోనేసియా యువకులను డచ్ వారి నుంచి కాపాడాలని నెహ్రూ బిజూ పట్నాయక్‌కు చెప్పారు. దాంతో ఆయన ఒక పైలెట్‌గా 1948లో ఓల్డ్ డకోటా విమానం తీసుకుని సింగపూర్ మీదుగా జకార్తా చేరుకున్నారు.

ఇండోనేసియా స్వతంత్ర పోరాటం చేసేవారిని కాపాడేందుకు బిజూ పట్నాయక్ అక్కడకు చేరుకున్నారు. కానీ పట్నాయక్ విమానం ఇండోనేసియా గగనతలలోకి ప్రవేశించగానే డచ్ సైన్యం దానిని కూల్చేయడానికి ప్రయత్నించింది.

బిజూ ఇండోనేసియా

ఫొటో సోర్స్, BJDODISHA.ORG.IN

ఫొటో క్యాప్షన్, జవహర్ లాల్ నెహ్రూతో బిజూ పట్నాయక్

దాంతో పట్నాయక్ విమానాన్ని హడావుడిగా జకార్తా దగ్గరే దించేశారు.

అక్కడ ఆయన జపాన్ సైన్యం దగ్గర మిగిలిన ఇంధనాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత తిరుగుబాటు జరుగుతున్న చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించారు.

అక్కడ ప్రముఖ విప్లవకారులైన సుల్తాన్ షహర్యార్, సుకర్ణోలను తనతో విమానంలో తీసుకుని బిజూ పట్నాయక్ దిల్లీ చేరుకున్నారు. వారితో నెహ్రూ రహస్యంగా సమావేశం అయ్యేలా చూశారు.

బిజూ ఇండోనేసియా

ఫొటో సోర్స్, BJDODISHA.ORG.IN

ఫొటో క్యాప్షన్, ఇందిరాగాంధీతో బిజూ పట్నాయక్

ఆ తర్వాత స్వతంత్ర ఇండోనేసియాకు డాక్టర్ సుకర్ణో తొలి అధ్యక్షుడు అయ్యారు.

పట్నాయక్ సాహసకార్యానికి గౌరవంగా ఇండోనేసియా ఆయనకు తమ దేశ పౌరసత్వం అందించింది. ఆయనకు ఇండోనేసియా అత్యుత్తమ పురస్కారం 'భూమిపుత్ర' ఇచ్చి గౌరవించింది. ఈ పురస్కారం విదేశీయులకు కూడా ఇస్తారు.

బిజూ పట్నాయక్

ఫొటో సోర్స్, Bijujantadalodisha/facebook

అయితే, 1996లో ఇండోనేసియా 50వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బిజూ పట్నాయక్‌కు ఇండోనేసియా అత్యున్నత జాతీయ పురస్కారం 'బెటాంగ్ జసా ఉటమ్' కూడా ప్రకటించారు.

ఆ దేశ తొలి రాష్ట్రపతి సుకర్ణో కుమార్తెకు పేరు పెట్టింది కూడా బిజూ పట్నాయకే. ఆయనకు పాప పుట్టిన రోజు భారీ వర్షం కురుస్తోంది. మేఘాలు గర్జిస్తున్నాయి. దాంతో బిజూ పట్నాయక్ ఆమెకు మేఘావతి అనే పేరు కూడా పెట్టమని చెప్పారు.

మేఘావతి సుకర్ణోపుత్రి ఇండోనేసియాకు ఐదవ అధ్యక్షురాలుగా(2001 నుంచి 2004 వరకు) పనిచేశారు.

బిజూ పట్నాయక్

ఫొటో సోర్స్, Bijujantadalodisha/facebook

బిజూ పట్నాయక్ ఎయిర్ కనెక్టివిటీతో భారత్, టిబెట్‌ను జోడించాలని కూడా ప్రయత్నించారు.

1951లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకోక ముందే ఆయన ఆ ప్రయత్నం చేశారు. కానీ భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పూర్తి సహకారం అందకపోవడంతో విఫలం అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)