ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ‘ఆవు’

ఫొటో సోర్స్, Getty Images
అక్కడ.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'ఆవుల చిత్రాలు' ఉన్నాయి. అవి ఆసియా జాతి పశువుల చిత్రాలు. వీటికి కనీసం 40వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఆ పక్కనే కొన్ని అరచేతి చిత్రాలూ ఉన్నాయి. ఇవి కూడా ప్రాచీనమైనవే.. ఐదు వేళ్లున్న ఆ చేతులకు ఎన్ని వేల ఏళ్లు?
ఇండోనేసియాలోని ఒక సున్నపురాయి గుహలో వీటిని కనుగొన్నారు.
వేల సంవత్సరాలుగా నీటి తాకిడికి.. ఈ చిత్రాలు వెలిసిపోయాయి. అలా నీటితో పాటు ఈ చిత్రాలపై చేరిన కొన్ని రసాయనాల సాయంతో వీటి వయసు కనిపెట్టగలిగారు.
ఇండోనేసియా, ఆస్ట్రేలియాలకు చెందిన సంయుక్త బృందం దట్టమైన అడవి గుండా ప్రయాణించింది.
ఈస్ట్ బోర్నియోలోని ఈస్ట్ కాలిమన్టన్‌లో ఉన్న ఈ గుహను చేరి, ఆ గుహలో ఉన్న ఈ చిత్రాలను గుర్తించింది. ఇవి ఇప్పటివరకూ బయటపడ్డ వాటిలో.. మనిషి చిత్రించిన అత్యంత ప్రాచీన చిత్రాలుగా నిపుణులు గుర్తించారు.
మానవ సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఆవిష్కరణల్లో ఒకటైన గుహ చిత్రకళ యూరప్‌లో ఆరంభమయిందని ఇప్పటివరకూ చాలా మంది శాస్త్రవేత్తలు భావించేవారు.
ఆ భావన సరికాదని.. ఆగ్నేయాసియాలో చివరి మంచు యుగంలో ఇది మొదలైందని తాజాగా వెలుగుచూసిన ఈ చిత్రాలు సూచిస్తున్నాయి.
ఈ పురాతన చిత్రకళ.. ఈస్ట్ కాలిమాంటన్ ప్రావిన్స్‌లో మారుమూలన గల పర్వతాలలోని సున్నపురాయి గుహల గోడల మీద కనిపించింది.
ఈ చిత్రాల గురించి పరిశోధకులకు 1994 నుంచే తెలుసు. కానీ వీటిని ఎప్పుడు గీశారన్నది ఇప్పుడే తెలుసుకున్నారు.
ఇందులో ఉన్న జంతువు చిత్రం.. బోర్నియో అడవుల్లో సంచరించిన నాటి అడవి ఆవు జాతి అయివుంటుందని.. ఈ చిత్రం 40,000 సంవత్సరాల కిందటిదని దీనిపై పరిశోధనలు చేసిన మాక్సిమ్ ఆబర్ట్ పేర్కొన్నారు.
ఆయన ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీలో ఆర్కియాలజిస్ట్, జియోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు.
ఇంతకుముందు.. అతి పురాతన జంతువు చిత్రంగా సుమారు 35,400 సంవత్సరాల కిందటి బబీరుసా అనే జంతువుదని.. పంది వంటి జింకను పోలిన ఆ చిత్రం ఇండొనేసియా దీవి సులావెసిలో ఉందని ఆయన తెలిపారు.

‘‘మానవులు మొదట భారీ జంతువుల ఆకారాలను చిత్రీకరించారు. ఆ తర్వాత మానవ ప్రపంచాన్ని వర్ణించటం ఆరంభించారు’’ అని ఆయన చెప్పారు.
ఈ గుహలో కనిపించే మనిషి చేతుల ముద్రలు కూడా 52,000 నుంచి 40,000 సంవత్సరాల కిందటివన్నారు.
అయితే.. సుమారు 20,000 సంవత్సరాల కిందట ఈ గుహ చిత్రకళలో మార్పు వచ్చిందని.. ఆ కాలపు చిత్రకారులు ముదురు ఆకుపచ్చ రంగులో మానవులను పోలిన ఆకారాలను, వివిధ పనుల్లో నిమగ్నమైన సంకేతాలను చిత్రీకరించారని వివరించారు.
ఈ చిత్రకారుల గురించి మరింతగా తెలుసుకోవటం కోసం ఈ గుహల్లో తవ్వకాలు జరపాలని యోచిస్తున్నట్లు ఆబర్ట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- హర్మన్‌ప్రీత్ కౌర్: టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన కేరళ బామ్మ
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- తెలంగాణ ఎన్నికలు.. బీబీసీ ప్రత్యేక కథనాలు
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









