తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?

ఫొటో సోర్స్, facebook
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలుంటే ఇందులో 67 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 46 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. ఈ విషయాలను 2014 నాటి ఎన్నికల అఫిడవిట్‌లలో వారే స్వయంగా పేర్కొన్నారు.
ఆ అఫిడవిట్‌ల ఆధారంగా తెలంగాణ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను రూపొందించాయి.
2014 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొందరు ప్రజాప్రతినిధులు హత్య, కిడ్నాప్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే, ప్రస్తుతం కేసుల విచారణ ఏ స్థాయిలో ఉందనేది వెల్లడించలేదు.
అలాగే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన చాలా కేసులను ఎత్తివేసింది. వాటి వివరాలను అందులో ప్రస్తావించలేదు. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు పేర్కొన్న అంశాల ఆధారంగానే ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది.

ఫొటో సోర్స్, Trs/facebook
అధికార పార్టీలో అత్యధికం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ నుంచి గెలిచిన 41 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
కాంగ్రెస్ నుంచి 21 మంది ఎన్నికవగా వారిలో ఏడుగురిపై, టీడీపీ నుంచి 15 మంది గెలుపొందగా వారిలో 9 మందిపై, ఎంఐఎం నుంచి ఏడుగురు గెలిస్తే వారిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులున్నాయి.
బీజేపీ నుంచి ఐదుగురు గెలిస్తే ఒకరిపై క్రిమినల్ కేసు ఉంది. మరో స్వతంత్ర అభ్యర్థిపైనా క్రిమినల్ కేసు నమోదై ఉంది.
హత్యా నేరం కింద తనపై క్రిమినల్ కేసు నమోదైందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు.
మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ (టీఆర్ఎస్) కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Rajasingh/facebook
హత్యాయత్నం కేసులో...
హత్యాయత్నం కింద ఐదుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. గోషామహల్ శాసన సభ్యుడు రాజాసింగ్(బీజేపీ) , టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్ కుమార్‌లపై వివిధ సెక్షన్‌ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
10 మంది మంత్రులపై నేరాభియోగాలు
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఉన్న 10 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది.
మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, గుండ్లకండ్ల జగదీశ్ రెడ్డిలపై హత్యాయత్నం అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి.
జూపల్లి కృష్ణారావు, కేటీఆర్, టి.పద్మారావు, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, సి. లక్ష్మారెడ్డి, పరిగె శ్రీనివాస్ రెడ్డిలపై క్రిమినల్ కేసులున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు కేసులు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనపై రెండు కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లు పేర్కొన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ప్రభుత్వ అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా సమావేశాలు నిర్వహించడం, ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర అభియోగాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.
వెయ్యి మంది అభ్యర్థులు... 225 మందిపై క్రిమినల్ కేసులు
గత శాసన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి దాదాపు వెయ్యి మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఇందులో 225 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నినేదికలో తెలిపింది. 141 మందిపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది.

ఫొటో సోర్స్, uttamkumarreddy/facebook
ఏ పార్టీలో ఎంతమందిపై..?
- 2014లో కాంగ్రెస్ నుంచి 113 మంది పోటీ చేయగా ఇందులో 34 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
- బీజేపీ నుంచి 45 మంది పోటీ చేయగా వీరిలో 15 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- టీడీపీ నుంచి 72 మంది పోటీ చేయగా ఇందులో 28 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
- వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 92 మంది ఎన్నికల్లో పోటీ చేయగా వీరిలో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
- టీఆర్ఎస్ నుంచి 119 మంది పోటీ చేయగా ఇందులో 62 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

ఫొటో సోర్స్, G kishore kumar/fb
గాదరి కిషోర్ కుమార్‌పై 54 కేసులు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మీద అత్యధికంగా 54 కేసులున్నాయి. ఇందులో హత్యయత్నం కింద ఏడు కేసులున్నాయి. తర్వాత స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఉన్నారు. ఈయనపై 19 కేసులున్నాయి.
వంటేరు ప్రతాప్ రెడ్డిపై 15 కేసులున్నాయి. 2014లో టీడీపీ తరఫున గజ్వెల్‌లో పోటీ చేసిన వంటేరు.. కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై 10 కేసులున్నాయి.
అయితే, తనపై ఉన్న కేసుల గురించి గాదరి కిషోర్ బీబీసీతో మాట్లాడుతూ, ‘2014 ఎన్నికల సమయంలో ఆ కేసులున్నాయని.. ప్రస్తుతం తన మీద ఏ కేసు లేదు’’ అని స్పష్టం చేశారు.
‘‘విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నాపై 100కు పైగా కేసులున్నాయి. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో అప్పటి వరకు నాపై ఉన్న కేసులను కూడా ప్రస్తావించాను. నాతో పాటు మా సహచర ఎమ్మెల్యేలు చాలా మందిపై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందువల్లే కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది. ’’ అని కిషోర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Revanthreddy/facebook
మారణాయుధాల కేసులో రేవంత్ ...
గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డిపై రెండు క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
హత్యాయత్నం, ఫోర్జరీ, మరణాయుధాలతో సంచరించారనే అభియోగాల కింద పలు సెక్షన్‌లపై కేసులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. నర్సంపేట్ టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌పై నాలుగు కేసులున్నాయి.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖపై మూడు కేసులున్నాయి. మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగెట్టేలా ప్రవర్తించారనే అభియోగంతో ఐపీసీ సెక్షన్ 153ఏ కింద నమోదై ఉంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ 2014లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈయనపై నాలుగు కేసులున్నాయి. ఇందులో ఒకటి హత్యాయత్నంనకు సంబంధించిన క్రిమినల్ కేసు.
ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులుగా పరిగణించేవి ఏమిటంటే..
ఐదేళ్లు అంతకుమించి శిక్ష పడే కేసులు, బెయిల్ రాని కేసులు, ఐపీసీ సెక్షన్ 171(ఈ) కింద నమోదయ్యే ఎన్నికల నేరాల కింద వచ్చే కేసులు, మహిళలపై నేరానికి పాల్పడిన కేసులు, అవినీతి, హత్య, కిడ్నాప్, అత్యాచారానికి సంబంధించిన కేసులను ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులుగా పరిగణిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ప్రజాప్రతినిధులపై కేసులు ఉంటే వాటిని సత్వరమే విచారించాలని ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై కేంద్రానికి సూచించింది.
సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర హోం శాఖ 24 జూన్ 2014న రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ లేఖ కూడా రాసింది.
‘ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు’
అన్ని పార్టీల్లో నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారని, దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ,‘‘ ప్రస్తుత రాజకీయాల్లో నేరప్రవృత్తి, డబ్బు, కులం, మతం ప్రధానాంశాలుగా మారాయి. ఇవన్నీ ఉంటేనే పార్టీలు టికెట్లు ఇచ్చే పరిస్థితి నెలకొంది. చట్టం చేసే ప్రజాప్రతినిధులే ఆ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు పేరుకే పరిమితమయ్యాయి. నేరమయ రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









