యూరిన్ థెరపీ: వాళ్ల మూత్రం వాళ్లే తాగుతున్నారు. మంచిదేనా?

ఫొటో సోర్స్, iStock/BBC THREE
- రచయిత, అషితా నగేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పొద్దున లేవగానే తమ మూత్రాన్ని తామే తాగితే రోగాలు దూరమవుతాయా? మూత్రాన్ని రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుందా? వైద్యులు ఏమంటున్నారు?
భారీ భవనాలు కూలినప్పుడు, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద రోజుల తరబడి చిక్కుకుని తాగడానికి నీళ్లు దొరక్క మూత్రం తాగి బతికి బయటపడిన వారి గురించి వార్తలు వస్తుంటాయి.
కానీ, కొందరు మాత్రం తాము 'ఆరోగ్యంగా' ఉండేందుకు నిత్యం తమ మూత్రాన్ని తామే తాగుతున్నామని చెబుతున్నారు.
తన మూత్రాన్ని తానే తాగడం వల్ల పలు దీర్ఘకాలిక రుగ్మతలు మాయమయ్యాయని లండన్‌లోని కెవింగ్టన్ ప్రాంతానికి చెందిన యోగా టీచర్ 33 ఏళ్ల కేలెయ్ ఓక్లె ఇటీవల చెప్పారు.
థైరాయిడ్, దీర్ఘకాలిక నొప్పి (ఫైబ్రోమైయాల్జియా) లాంటి సమస్యుల నుంచి కూడా ఉపశమనం పొందానని ఆమె వివరించారు.
ఇలా మూత్రాన్ని తాగడాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించినట్లు ప్రెస్ అసోసియేషన్ వార్తా సంస్థతో ఆమె చెప్పారు.
"రోగ నిరోధక శక్తిని మూత్రం పునరుద్ధరించగలదని, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని, చర్మానికి కూడా మంచిదని నేను విన్నాను. అందుకే నా మూత్రాన్ని తాగడం ప్రారంభించాను" అని కేలెయ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈమె రోజూ మూత్రాన్ని సేవించడమే కాదు, దాన్ని దూదితో ముఖమంతా రాసుకుంటారు కూడా. దాంతో తన చర్మం ప్రకాశవంతంగా ఉంటోందని అంటున్నారు.
తమ మూత్రాన్ని తామే తాగడాన్ని కొందరు "యూరిన్ థెరపీ" అంటారు. "యురోఫేజియా" అని కూడా వ్యవహరిస్తారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలా మూత్రాన్ని తాగడం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయంటున్నది కేలెయ్ ఒక్కరే కాదు, ఇటీవల మరికొందరు కూడా చెప్పారు.
"నా మూత్రాన్ని నేను తాగడం వల్ల నా బరువు సగం తగ్గించుకోగలిగాను" అని కెనడాలోని అల్బెర్టాకు చెందిన 46 ఏళ్ల లీహ్ శాంప్సన్ ది సన్ పత్రికకి తెలిపారు.
గతంలో 120 కిలోల బరువుతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ తాను మూత్రం సేవించడం ద్వారా ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.
"యూరిన్ థెరపీ గురించి వివరించే ఓ యూట్యూబ్ వీడియో లింకును నా ఫ్రెండ్ పంపించారు. దాన్ని చూసిన తర్వాత బాత్‌రూంకు వెళ్లి గుప్పిట్లో మూత్రాన్ని పట్టుకుని తాగేశాను. దాంతో కొన్ని రోజుల్లోనే నాలో మార్పు కనిపించింది" అని వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రస్తుతం ఆమె మూత్రాన్ని తాగడంతో పాటు, రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకునేటప్పుడు మూత్రంతోనే గొంతును కూడా శుభ్రం చేసుకుంటారు. అంతేకాదు, మూత్రం చుక్కలను కళ్లలో కూడా వేసుకుంటున్నారు.
దోమలు కుట్టినప్పుడు నొప్పి తగ్గేందుకు తాను మూత్రం సేవిస్తానని పోర్చుగల్‌లో ఉంటున్న 39 ఏళ్ల ఫెయిత్ క్యాంటర్ అనే మరో మహిళ ఇటీవల వెల్లడించారు.
"మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ, తర్వాత అలవాటైంది. రోజూ పొద్దున్నే కొద్దిగా మూత్రం తాగుతాను. గతంతో పోల్చితే ఇప్పుడు నన్ను దోమలు చాలా తక్కువ కుడుతున్నాయి. ఒకవేళ కుట్టినా వాపు, దురద, నొప్పి రావడంలేదు" అని ఆమె చెప్పారు.
వీళ్లంతా చెబుతున్నది చదివిన తర్వాత "యూరిన్ థెరపీ"తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా! అనిపిస్తుంది. కానీ, వైద్యులు మాత్రం ఇలా మూత్రాన్ని తాగాలని ఎవరికీ సిఫార్సు చేయడంలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

"భారత మాజీ ప్రధాని కూడా మూత్రం తాగేవారా?"
ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం... భారత మాజీ ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ కూడా చాలా కాలంపాటు "యూరిన్ థెరపీ"ని అనుసరించేవారట.
1978లో అమెరికన్ జర్నలిస్టు డాన్ రాథర్‌తో మోరార్జీ దేశాయ్ ఆ వివరాలను పంచుకున్నారు.
భారత్‌లో వైద్య ఖర్చులు భరించలేని లక్షలాది మందికి యూరిన్ థెరపీ చక్కని పరిష్కారమని కూడా ఆయన అన్నారు.
చైనా యూరిన్ థెరపీ అసోసియేషన్ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, మెయిన్‌లాండ్ చైనా ప్రాంతంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా మూత్రాన్ని తాగుతారు.

ఫొటో సోర్స్, Getty Images
కుక్క మూత్రం తాగిన మహిళ
ఈ ఏడాది జూన్‌లో ఓ మహిళ తన కుక్క మూత్రాన్ని తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆమె కుక్కను పార్కుకు తీసుకెళ్లారు. అది మూత్రం పోసేటప్పుడు ఓ కప్పులో పట్టుకుని తాగేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
అయితే, ఇలా మూత్రం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
వ్యర్థాలనుతాగినట్లే
మూత్రం అనేది శరీరం నుంచి వెలువడే వ్యర్థ పదార్థం. అందులో నీటితోపాటు, శరీరం వదిలించుకునే వ్యర్థాలు ఉంటాయి.
"మూత్రపిండాల సమస్యలు లేనప్పుడు మూత్రం శుభ్రంగానే ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే, శరీరం లోపల ఉన్నప్పుడు సరే. కానీ, బయటకు రాగానే అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దాన్ని సేవించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయొచ్చు" అని డాక్టర్ జుబైర్ అహ్మద్ బీబీసీకి వివరించారు.
మూత్రం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని ఆయన అన్నారు.
"మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే మార్గాల్లో ఒకటి మూత్రం. ఆ వ్యర్థాలు ఉండే మూత్రం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నీలకు ప్రమాదకరం
మూత్రం తాగడమంటే శరీరం వదిలించుకున్న ప్రమాదకర పదార్థాలను మళ్లీ శరీరంలోకి పంపినట్లే. అది మీ ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది అని మరో వైద్యుడు ఆండ్రూ థోన్బర్ హెచ్చరించారు.
"కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను, లవణాలను తొలగిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల మూత్రంలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. మిగతా 5 శాతం శరీరం వదిలించుకునే పొటాషియం, నైట్రోజన్ లాంటి పదార్థాల ఉంటాయి. శరీరంలో వాటి స్థాయి ఎక్కువైతే కొన్ని సమస్యలకు దారితీస్తాయి. ఇప్పుడు అలా బయటకు వచ్చిన ఆ మూత్రాన్నే మళ్లీ తాగడం పేగులకు, కిడ్నీలకూ ప్రమాదమే" అని డాక్టర్ థోన్బర్ బీబీసీకి వివరించారు.
"మూత్రం తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లు తొందరగా అందుతాయని కొందరు అనుకుంటారు. అయితే, విటమిన్ల కోసం సమతుల ఆహారం తీసుకోవాలి తప్ప ఇలా ప్రమాదకర పద్ధతులు పాటించడం మంచిది కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కోక్ తాగినా, చికెన్ తిన్నా ట్రంప్ ఆరోగ్యానికి ఢోకా లేదు!
- ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
- వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- కోపం అంతగా ఎందుకొస్తుంది? దాన్ని అదుపు చేయడం ఎలా?
- హై హీల్స్ వేసుకుంటున్నారా... జాగ్రత్త
- హెచ్ఐవీ.. ఎయిడ్స్: చైనాలో 14 శాతం పెరిగిన కొత్త కేసులు
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- ట్రంప్‌కి బీపీ ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








