వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్‌బుక్‌లో వెతుకుతున్న మహిళ

సంతానం, చిన్నారి, పాప

ఫొటో సోర్స్, BERNIE_PHOTO

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమందా కాష్మోరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు వీర్య దాత కోసం ఓ మహిళ ఫేస్‌బుక్‌లో అన్వేషిస్తున్నారు.

బ్రిటన్‌లోని వేల్స్‌కు చెందిన సోఫీ(పేరు మార్చాం) గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉండేవారు. అయితే, ఓ బిడ్డ పుట్టిన తర్వాత అతడు సోఫీని వదిలివెళ్లిపోయాడు.

అప్పటి నుంచి సోఫీ తన బిడ్డను పోషించుకుంటూ ఒంటరిగానే ఉంటున్నారు.

అయితే, ఇంట్లో తన బిడ్డ ఒంటరిగా ఉండలేకపోతోందని, తనకు కనీసం ఒక్కరైనా తోబుట్టువు ఉంటే బాగుంటుందని సోఫీ ఆలోచించారు.

దాంతో మరో బిడ్డకు జన్మనివ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ, ఏ పురుషుడితో శారీరకంగా కలవకూడదన్న షరతు పెట్టుకున్నారు సోఫీ. దాతల నుంచి వీర్యం తీసుకుని కృత్రిమ గర్భధారణ పొందే వీలుందన్న ఆలోచన ఆమెకు వచ్చింది.

కృత్రిమ గర్భధారణ కోసం ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల విభాగానికి వెళ్లొచ్చు. అయితే, అలా వెళ్తే గర్భం దాల్చాలంటే ఆరు నెలల పాటు వేచిచూడాల్సి ఉంటుంది.

కానీ, తాను అంతకాలం వేచి ఉండలేనంటూ స్వయంగా వీర్య దాతల కోసం ఫేస్‌బుక్‌లో వెతకడం ప్రారంభించారు సోఫీ.

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న మహిళ

ఫొటో సోర్స్, OATAWA

మాటలతో నమ్మించి సెక్స్ కావాలన్నాడు

ఈ క్రమంలో ఓ ఫేస్‌బుక్ గ్రూపును ఆమె గుర్తించారు. ఆ గ్రూపులో ఉన్న పురుషులు ఉచితంగా తమ వీర్యాన్ని ఇస్తామని అంటున్నారు.

అందులోని ఒక వ్యక్తితో ఆమె మాట్లాడారు. అతడు లైంగికంగా ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించారు. అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. అతని నుంచి వీర్యం సేకరించేందుకు ఆమె ఏర్పాట్లు చేయించారు.

అయితే, ఇదంతా జరిగిన తర్వాత అతడు తాను వీర్యం తీసి ఇవ్వనని, శృంగారంలో పాల్గొనాల్సిందేనంటూ బలవంతం చేయడంతో ఆతనితో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సోఫీ తెలిపారు.

తర్వాత అదే గ్రూపులోని మరో వ్యక్తితో ఆమె మాట్లాడారు. అతడు ఉచితంగా వీర్యం ఇచ్చాడు.

సోఫీ తనే స్వయంగా తన గర్బాశయంలోకి ఆ వీర్యాన్ని ప్రవేశపెట్టారు. కానీ, అది విజయవంతం కాలేదు.

ఇప్పుడు ఆమె మరోసారి ప్రయత్నించాలని అనుకుంటున్నారు.

చిన్నారి కాళ్లు, పసిపాప, చిన్నారి

ఫొటో సోర్స్, YAKOBCHUKOLENA

ఇది ప్రమాదకరం

"గతంలో నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే ఇక ఎవరితోనూ శారీరకంగా కలవకూడదని నిర్ణయించుకున్నాను. ఇలా వీర్య దాతల సాయంతో కృత్రిమంగా గర్భం దాల్చడంలో తప్పేమీ లేదనిపిస్తోంది. ఎందుకంటే, వీర్యం ఇచ్చే వ్యక్తికి సుఖవ్యాధులేమీ లేవంటూ పరీక్షల్లో తేలిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇలా చేయడం సురక్షితమే. దంపతులు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ గర్భం రాదు. ఇది కూడా అంతే. నాకు మొదటిసారి రాలేదు, మరోసారి ప్రయత్నిస్తాను" అని సోఫీ చెప్పుకొచ్చారు.

అయితే, వీర్య దాతలను వెతకడం కోసం మహిళలు ఫేస్‌బుక్‌ను వినియోగించడం ఏమాత్రం మంచిది కాదని వేల్స్‌లోని ఫర్టిలిటీ నెట్‌వర్క్ సమన్వయకర్త అలైస్ మాథ్యూస్ అన్నారు.

ఇలా ముక్కూ ముఖం చూడకుండా అపరిచిత వ్యక్తుల నుంచి వీర్యాన్ని తీసుకోవడం "ప్రమాదకరం" అని లండన్‌లోని మహిళా వైద్యశాల డైరెక్టర్ డాక్టర్. పీటర్ బోవెన్ హెచ్చరించారు.

గర్భనిరోధకాలు

ఫొటో సోర్స్, Thinkstock

'నా వీర్యంతో ఎనిమిది మంది పుట్టారు'

తన వీర్యంతో ఇప్పటి వరకు ఎనిమిది మంది పుట్టారని ఫేస్‌బుక్‌లో వీర్య దాతల గ్రూపు ప్రారంభించిన జాన్ తెలిపారు. త్వరలో మరో ముగ్గురు పుట్టే అవకాశం ఉందన్నారు.

"తల్లి అవ్వాలనే ఒక మహిళ కల నిజమవ్వడంలో సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది" అని ఆయన చెప్పారు.

అయితే, "వీర్య దానం పేరుతో మాయమాటలు చెప్పి మహిళలను సెక్స్ కోసం బలవంతం చేసేవారు కూడా కొందరు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్లకు కావాల్సింది సెక్స్ మాత్రమే. సాయం చేయాలని చూడరు. అలాంటి వారివల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది. నా నుంచి వీర్యం తీసుకున్నవాళ్లంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

" కృత్రిమ గర్భధారణ కోసం ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. సంతానం కోసం అనుభవమున్న వైద్యులను, సంతాన సాఫల్య కేంద్రాలను మాత్రమే సంప్రదించాలి" అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)