మూడు కూనలు పుట్టాక తన తోడును చంపేసిన ఆడ సింహం

ఫొటో సోర్స్, Facebook/Indianapolis Zoo
అమెరికాలోని ఇండియానాపొలిస్ జంతుప్రదర్శనశాలలో ఒక మగ సింహాన్ని ఆడ సింహం చంపేసింది. మూడేళ్ల క్రితం ఈ రెండు సింహాలూ కలిసి మూడు కూనలకు జన్మనిచ్చాయి.
ఎనిమిదేళ్లుగా ఈ రెండూ ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంటున్నాయి.
పదేళ్ల మగ సింహం న్యాక్‌పై 12 ఏళ్ల ఆడసింహం జ్యురీ దాడి చేసింది. న్యాక్ మెడను గట్టిగా పట్టుకొంది. న్యాక్ కదలికలు ఆగిపోయే వరకు మెడను అలా పట్టుకొనే ఉంది. ఊపిరాడక న్యాక్ చనిపోయింది.
సింహాల ఎన్‌క్లోజర్ నుంచి అసాధారణ స్థాయిలో గర్జనలు వినిపించడంతో అప్రమత్తమై తాము అక్కడకు చేరుకున్నామని జూ సిబ్బంది తెలిపారు. న్యాక్ మెడను జ్యురీ పట్టుకొందని చెప్పారు. రెండు సింహాలనూ విడిపించేందుకు తాము ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వారు విచారం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Reuters
న్యాక్, జ్యురీ మధ్య ఇంతకుముందు పెద్ద గొడవలేవీ జరగలేదని జూ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాక్ లేని లోటు తమను వెంటాడుతుందని వారు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టులో చెప్పారు.
జూలోని జంతువులతో తమకు గట్టి అనుబంధం ఏర్పడుతుందని, ఏదైనా జంతువు చనిపోతే తమకు చాలా బాధ కలుగుతుందని ఇండియానాపొలిస్ జంతుప్రదర్శనశాల సంరక్షకుడు డేవిడ్ హాగన్ రాయిటర్స్ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు. తమలో చాలా మందికి న్యాక్ ఇంట్లో మనిషిలాంటిదని చెప్పారు.
న్యాక్ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరుపుతామని జూ నిర్వాహకులు తెలిపారు. జ్యురీ, మరో మూడు సింహాలు క్షేమంగా ఉన్నాయని చెప్పారు. జూలో జంతువుల బాగోగులను చూసుకొనే విధానాన్ని మార్చే ఆలోచనేదీ ప్రస్తుతం లేదన్నారు.
ఇండియానాపొలిస్ జంతు ప్రదర్శనశాలకు ఏటా 10 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారు.
ఇవి కూడా చదవండి:
- జంతువులను ఎక్స్‌రే తీస్తే ఎలా కనిపిస్తాయి?
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట
- 'జమాల్ ఖషోగ్జీ హత్యకు... యువరాజుకు ఏ సంబంధం లేదు' - సౌదీ అరేబియా
- అభిప్రాయం: #Metooతో మహిళలు ఏం సాధించారంటే...
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- పాశ్చాత్య దేశాలకు సౌదీ అరేబియా ఎందుకంత అవసరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








