'జమాల్ ఖషోగ్జీ హత్యకు... యువరాజుకు ఏ సంబంధం లేదు' - సౌదీ అరేబియా

ఖషోగ్జీది హత్యే

ఫొటో సోర్స్, Getty Images

జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీని హత్య చేశారని సౌదీ అరేబియా చెప్పింది. దీని వెనక క్రౌన్ ప్రిన్స్ పాత్ర లేదని తెలిపింది.

సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబెయిర్ ఈ హత్య ఒక 'దారుణ తప్పిదం' అని ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్జీ హత్యకు ఆదేశించారనే వాదనలను ఖండించారు.

మొదట ఖషోగ్జీ బతికే ఉన్నాడని చెప్పిన సౌదీ అరేబియా, తర్వాత ఏం జరిగిందో వివరించడానికి ఒత్తిడికి గురైంది.

ఖషోగ్జీ చివరిసారి అక్టోబర్ 2న ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్‌ లోపలికి వెళ్తూ కనిపించారు.

ఖషోగ్జీ సౌదీ ప్రభుత్వం మీద విమర్శనాత్మక కథనాలు రాసేవారని, సౌదీ ఏజెంట్ల బృందం ఆయనను ఆ భవనంలోనే హత్య చేసిందని టర్కీ అధికారులు భావిస్తున్నారు.

మొదట ఆయన కాన్సులేట్ భవనం నుంచి క్షేమంగా వెళ్లారని సౌదీ అరేబియా చెప్పింది. కానీ శుక్రవారం మొదటిసారి ఆయన మరణించారని అంగీకరించింది. భవనంలో జరిగిన ఒక గొడవలో ఆయన హత్యకు గురయ్యారని చెప్పింది.

ఈ వాదనపై సందేహాలు తలెత్తుతున్నాయి.

ఖషోగ్జీది హత్యే

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఖషోగ్దీ మృతదేహం కోసం బెల్‌గ్రాడ్ అడవుల్లో గాలిస్తున్నారు

సౌదీ కొత్తగా ఏం చెబుతోంది?

సౌదీ మంత్రి అల్-జుబెయిర్ ఖషోగ్జీది హత్య అని చెప్పారు.

"మేం వాస్తవాలన్నీ బయటకు తీయాలని, ఈ హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిశ్చయించాం" అన్నారు.

"ఈ హత్య చేసిన వారు, తమ అధికార పరిధికి బయట అలా చేశారు. ఇది కచ్చితంగా 'దారుణ తప్పిదం'. చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించి వాళ్లు ఇంకా పెద్ద తప్పు చేశారు" అన్నారు.

"ఖషోగ్జీ మృతదేహం ఎక్కడ ఉందో కూడా మాకు తెలీదు. ఈ హత్య క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో జరిగింది కాదు" అన్నారు.

"మా నిఘా విభాగంలోని ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం తెలీదు. ఇది కుట్రపూరిత ఆపరేషన్" అని జుబెయిర్ చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి 18 మందిని అరెస్టు చేశామని సౌదీ అరేబియా చెబుతోంది. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు అనుచరులను తొలగించామని అంటోంది.

నిఘా సంస్థను మరింత మెరుగుపరిచేందుకు క్రౌన్ ప్రిన్స్ నేతృత్వంలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామంది.

ఖషోగ్జీది హత్యే

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ స్పందన

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో "సౌదీ అరేబియా వివరణలో మోసం, అవాస్తవాలు ఉన్నాయని" అన్నారు. అంతకు ముందు ఆయనే "వారు చెబుతున్నది నమ్మదగినదే" అని భావించారు.

"క్రౌన్ ప్రిన్స్ ఈ హత్యకు బాధ్యుడు కాకపోతే అది మంచిదే" అని ట్రంప్ అన్నారు.

"కానీ సౌదీ అరేబియాపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. "ఆయుధాల ఒప్పందాన్ని ఆపివేయడం వల్ల వారి కంటే మాకే ఎక్కువ నష్టం" అని ట్రంప్ చెప్పారు.

ఖషోగ్జీ హత్యపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆయన మృతిపై పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. "ఈ హత్య సమర్థనీయం కాదు, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ప్రకటించాయి.

ఖషోగ్జీది హత్యే

ఫొటో సోర్స్, Getty Images

ఇటు, సౌదీ అరేబియాకు, పొరుగు దేశాలన్నీ అండగా నిలుస్తున్నాయి. కింగ్ సల్మాన్ ఈ కేసును హాండిల్ చేస్తున్న తీరుపై కువైత్ ప్రశంసలు కురిపించింది. ఈజిఫ్ట్, బహ్రెయిన్, యూఏఈ కూడా అలాంటి స్పందనలే వ్యక్తం చేశాయి.

ఈ హత్యపై మంగళవారం పార్లమెంటులో నగ్నసత్యాలు బయటపెడతానని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగన్ ఆదివారం అన్నారు.

టర్కీ సౌదీ అరేబియాపై అధికారిక ఆరోపణలు చేయడం ఆపివేసినా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు మాత్రం తమ దగ్గర సౌదీ ఏజెంట్లు కాన్సులేట్‌లో హత్య చేసినట్టు ఆడియో,వీడియో ఉన్నాయని చెబుతున్నారు.

సౌదీ అధికారులు మాత్రం ఆ సమయంలో "తప్పుడు సమాచారం అందడం వల్లే ఇప్పుడు తమ ప్రకటనను మార్చాల్సి వచ్చిందని" చెబుతున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)