జమాల్ ఖషోగ్జీ ఎలా మరణించారు?

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ నుంచి మాయమై ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయింది.
ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం కాన్సులేట్ లోపల తమ అధికారులతో జరిగిన ఘర్షణల్లో ఖషోగ్జీ మరణించారని అంగీకరించింది.
అయితే సౌదీ ఏజెంట్లు ఆయనను హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు.
ఖషోగ్జీ ఉదంతంలో ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన విషయాలు..

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ జమాల్ ఖషోగ్జీ?
జమాల్ ఖషోగ్జీ సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు. అఫ్గానిస్తాన్‌లో సోవియట్ జోక్యంతో పాటు ఒసామా బిన్ లాడెన్ ఎలా క్రమక్రమంగా ఎదిగారో వివరిస్తూ ఖషోగ్జీ అనేక కథనాలు రాశారు.
మొదట్లో సౌదీ రాజకుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. ఒకప్పుడు సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగా కూడా ఉన్నారు.
సౌదీ అరేబియా వ్యవహారాలపై గట్టి పట్టున్న ఖషోగ్జీ 2017లో అమెరికాకు వెళ్లారు. అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిపై సౌదీ యువరాజు సల్మాన్ ఆదేశాల మేర జరుగుతున్న అణచివేత నుంచి బయటపడేందుకు దేశం నుంచి తనను తానే వెలి వేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. నాటి నుంచి ఆయన అమెరికాలోనే ఉంటున్నారు.
మాయం కావడానికి మూడు రోజుల ముందు బీబీసీ న్యూస్ అవర్‌లో మాట్లాడుతూ ''స్వతంత్ర భావాలు కలిగి ఉంటే చాలు.. అందరినీ అరెస్టు చేస్తున్నారు'' అని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ కాన్సులేట్‌కు ఖషోగ్జీ ఎందుకు వెళ్లారు?
ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు ఖషోగ్జీ మొదట సెప్టెంబర్ 28న వెళ్లారు. తన మాజీ భార్యకు విడాకులు ఇచ్చాననడానికి సాక్ష్యంగా కొన్ని పత్రాల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. టర్కీకి చెందిన హటీస్ చెంగిజ్‌ను వివాహం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఆ పత్రాల కోసం అక్టోబర్ 2న రావాలని సౌదీ అధికారులు ఆయనకు చెప్పారు.
అక్టోబర్ 2న మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆయన అపాయింట్‌మెంట్ ఉండగా, ఆయన ఒంటి గంటా 14 నిమిషాలకే కాన్సులేట్ చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది.
కాన్సులేట్ లోపలికి వెళ్లడానికి ముందు ఆయన తాను వివాహం చేసుకోవాలని భావిస్తున్న చెంగిజ్‌కు రెండు మొబైల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి, ఒకవేళ తాను తిరిగి రాని పక్షంలో టర్కీ అధ్యక్షుడి సలహాదారునికి తెలపాలని కోరారు.
ఖషోగ్జీ కోసం ఆమె 10 గంటల పాటు కాన్సులేట్ బయటే వేచి చూశారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా కాన్సులేట్ వద్దకు వచ్చినా ఖషోగ్జీ మాత్రం బయటకు రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా ఏమంటోంది?
మొదట ఖషోగ్జీ అదృశ్యం గురించి తమకేమీ తెలీదన్న సౌదీ అరేబియా తర్వాత ఒక ప్రకటనలో కాన్సులేట్‌లో జరిగిన ఘర్షణలో ఆయన మరణించారని తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి 18 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది.
ఖషోగ్జీ మరణానికి బాధ్యుల్ని చేస్తూ సౌదీ నిఘా విభాగం ఉప సారథి (డిప్యూటీ చీఫ్) అహ్మద్ అల్-అసీరి, సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారు సౌద్ అల్-ఖతానీలను డిస్మిస్ చేశారు.
మరి టర్కీ?
సౌదీ కాన్సులేట్‌లో ఖషోగ్జీ హత్యను నిరూపించే ఆడియో, వీడియో సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని టర్కీ అధికారులు చెబుతున్నారు. ఖషోగ్జీని హత్య చేసి, ఆయన శరీరాన్ని అక్కడి నుంచి తొలగించారని వారు ఆరోపిస్తున్నారు.
ఖషోగ్జీని విచారిస్తున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు రికార్డయిన మాటలు, ఆర్తనాదాల ఆడియో తమకు లభించిందని చెబుతూ కొన్ని టర్కీ వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని టర్కీ సీనియర్ అధికారి ఒకరు, ఖషోగ్జీ కాన్సులేట్‌కు వచ్చిన రెండు గంటలలోనే ఆయనను చంపి, శరీరాన్ని ముక్కలు చేశారని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ ఏజెంట్లు ఎవరు?
ఖషోగ్జీ మాయమైన రోజే 15 మంది సభ్యుల సౌదీ ఏజెంట్ల టీమ్ ఇస్తాంబుల్‌కు వచ్చి, అదే రోజు వెళ్లిపోయిందని టర్కిష్ మీడియా చెబుతోంది. వారిలో నలుగురికి సౌదీ యువరాజుతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సౌదీ ఏజెంట్లు తమతో పాటు ఒక రంపాన్ని కూడా తీసుకువచ్చారని, కాన్సులేట్‌కు వచ్చిన సౌదీ బృందంలో పోస్ట్‌మార్టంలో నిష్ణాతుడైన ఒక డాక్టర్ కూడా ఉన్నారని టర్కీ అధికారులు చెబుతున్నారు.
సౌదీ బృందంలో తొమ్మిది మంది ఉదయం 3 గంటల సమయంలో ఒక ప్రైవేట్ జెట్‌లో సౌదీ రాజధాని రియాద్‌కు వచ్చారు.
మిగిలిన సౌదీ ఏజెంట్లు మరో ప్రైవేట్ జెట్ లేదా విమానాల్లో వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఆ తర్వాత వీరంతా కలిసి రెండు ప్రైవేట్ విమానాలలో కైరో, దుబాయ్ గుండా రియాద్ తిరిగి వెళ్లినట్లు టర్కీ అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టర్కిష్ మీడియా కథనాల ప్రకారం అక్టోబర్ 2 నాటి సంఘటనా క్రమం:
- 03.28: అనుమానిత సౌదీ ఏజెంట్లతో మొదటి ప్రైవేట్ జెట్ ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుకు వచ్చింది.
- 05.05: సౌదీ కాన్సులేట్‌కు దగ్గరలో ఉన్న రెండు హోటళ్లలో వీరంతా దిగారు.
- 12.13: అనేక దౌత్య వాహనాలు కాన్సులేట్ వద్దకు వచ్చాయి. వాటిలో సౌదీ ఏజెంట్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
- 13.14: కాన్సులేట్‌లో ప్రవేశించిన ఖషోగ్జీ
- 15.08: కాన్సులేట్ నుంచి బయటికి వచ్చిన వాహనాలు. అవి దగ్గరలో ఉన్న సౌదీ కాన్సుల్ ఇంటికి వెళ్లాయి.
- 17.18: ఇస్తాంబుల్ చేరుకున్న రెండో ప్రైవేట్ జెట్.
- 17.33: ఖషోగ్జీ పెళ్లి చేసుకోవాలని భావించిన హటీస్ చెంగిజ్ కాన్సులేట్ బయట వేచి ఉండడం సీసీటీవీలో కనిపించింది.
- 18.20: రెండు ప్రైవేట్ జెట్‌లలో ఒకటి ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి పోయింది. మరో జెట్ రాత్రి 9 గంటల సమయంలో వెళ్లిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీ విచారణ ఎలా సాగుతోంది?
అక్టోబర్ 15న టర్కీ పోలీసులను సౌదీ కాన్సులేట్‌లోనికి అనుమతించారు.
సౌదీ అధికారులు, కొంతమంది క్లీనర్లు కాన్సులేట్ భవనంలోకి వెళ్లిన తర్వాత వాళ్లు అక్కడికి వెళ్లారు.
టర్కిష్ పోలీసులు కాన్సులేట్‌ను, దగ్గరలో ఉన్న కాన్సుల్ నివాసాన్ని పరిశీలించి, కొన్ని డీఎన్‌ఏ నమూనాలను తమ వెంట తీసుకెళ్లారు. దగ్గరలో ఉన్న బెల్‌గ్రాడ్ అడవుల్లోను, యాలావో అనే వ్యవసాయ క్షేత్రంలోనూ వెదికారు. ఖషోగ్జీ మాయమైన రోజు రెండు వాహనాలు అదే దారిలో వెళ్లాయి.
ఖషోగ్జీ మృతదేహాన్ని అక్కడే పాతి పెట్టి ఉండవచ్చని టర్కీ అధికారులు అనుమానిస్తున్నారు.
సౌదీ కాన్సులేట్‌లో పని చేస్తున్న 15 మంది టర్కీ జాతీయులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- యెమెన్ యుద్ధం: 42 మంది చిన్నారుల్ని చంపేసిన వైమానిక దాడి యుద్ధ నేరం కాదా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఫేక్ మూన్: చైనా చంద్రుడు వెలుగులు పంచగలడా?
- అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?
- శబరిమల: అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు ఎందుకు వెళ్తారు?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








