యెమెన్ యుద్ధం: 42 మంది చిన్నారుల్ని చంపేసిన వైమానిక దాడి యుద్ధ నేరం కాదా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

బస్సుదాడిలో చనిపోయిన విద్యార్థి

యెమెన్‌ ప్రభుత్వానికి మద్ధతుగా హూతీ తిరుగుబాటుదారులపై బాంబు దాడులు చేస్తున్న సౌదీ అరేబియాపై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. అయితే ఈ దాడుల్లో అమాయకులు బలవుతున్నారన్న విమర్శలను సౌదీ కొట్టిపారేస్తోంది. తమ మిలటరీ చర్యల్లో భాగంగా సామాన్యులెవ్వరిపైనా ఉద్ధేశపూర్వకంగా దాడులు చెయ్యడం లేదని చెప్పుకొస్తోంది. అయితే ఇటీవల దహియాన్‌లో జరిగిన ఓ వైమానిక దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించారు.

వాస్తవాలను పరిశీలించేందుకు ఉత్తర యెమెన్ వెళ్లిన బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యూరిన్, ప్రొడ్యూసర్ నికోలా కరీమ్.. కెమెరా మెన్ లీ డురంట్‌తో కలిసి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

యెమెన్‌ దేశంలో ఉత్తర భాగంలోని సాడా ప్రావిన్సులోని దహ్యాన్ పట్టణంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం ప్రస్తుతం హూతీ ఉద్యమకారుల ఆధీనంలో ఉంది. సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌ ప్రభుత్వానికి మద్దతుగా హూతీలపై పోరాడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: దాడిలో బతికి బయటపడ్డ పిల్లల శరీరాలపై కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని పైకి కనిపించేవి కావు

ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల్ని పక్క పక్కనే ఖననం చేశారు. ఈ స్మశానాన్ని దహియాన్ చిన్నారుల ఉద్యాన వనంగా పిలుస్తారు.

ఇక్కడ కొంతమంది పిల్లలు.. బస్సు దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచర విద్యార్థులను తలచుకుని రోదిస్తున్నారు. కొన్ని శవాలను ఇంకా గుర్తించలేక పోవడంతో స్మశానంలోని కొన్ని గుంటలు ఖాళీగా కనిపిస్తున్నాయి.

సౌదీ సంకీర్ణ దళాల బాంబు దాడిలో ధ్వంసమైన స్కూలు బస్సు దగ్గర్లోనే ఉంది. కనిపించిన కొన్ని ఆధారాలను బట్టి ఈ దాడిలో ఉపయోగించిన బాంబులు అమెరికాలో తయారైన బాంబులుగా తెలుస్తోంది. అయితే మానవహక్కుల సంఘాల కార్యకర్తలు మాత్రం సామాన్యుల్ని బలి తీసుకున్న ఈ దాడుల్లో బ్రిటన్లో తయారైన ఆయుధాలు కూడా ఉపయోగించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

హూతీకి ఆయువుపట్టైన సాడా ప్రావిన్సు నుంచే ఉద్యమకారులు సౌదీ సంకీర్ణ దళాలపై రాకెట్లు ప్రయోగిస్తారు. దాడికి గురైన బస్సును హూతీ దళాలు అధికారికంగా ఉపయోగించేవని సౌదీ సంకీర్ణ సేనలు పేర్కొన్నాయి. ఆ తరువాత అనుకోకుండా జరిగిన తప్పిదమంటూ, అవి క్షమాపణలు చెప్పాయి.

దహ్యాస్
దాడికి ముందు స్కూలు బస్సులో విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, దాడికి ముందు స్కూలు బస్సులో విద్యార్థులు.. ఈ వీడియోను యహ్యా అనే విద్యార్థి తీశాడు. అతను కూడా దాడిలో చనిపోయాడు

మహ్మద్ అల్ హరాజీ పదేళ్ల కొడుకు యహ్యా కూడా అదే బస్సులో ఉన్నాడు. నోట్లోని పళ్ల ఆధారంగా అతని మృత దేహాన్ని గుర్తించాల్సి వచ్చింది.

13 ఏళ్ల మహ్మద్ ఇబ్రహీం దాడి నుంచి బయటపడినప్పటికీ తన చాలా మంది మిత్రుల్ని కోల్పోయాడు. అంతా సర్వనాశనమైందని, జీవితంపై ఆశలేదని అతను అంటున్నాడు.

ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో దాడి జరిగింది. దుకాణాలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైనున్న బస్సుపై బాంబులు కురిశాయి. ఒకవేళ బస్సు నిండా తిరుగుబాటు దారులే ఉన్నప్పటికీ కచ్చితంగా అమాయకుల ప్రాణాలకు ముప్పుంటున్నది సుస్పష్టం. ఇది యుద్ధ నేరం కాదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దాడికి కొద్ది నిమిషాల ముందు ఒసామా అనే విద్యార్థి తీసిన వీడియోలో బస్సులోని చిన్నారులంతా ఆడుతూ.. పాడుతూ కనిపించారు. విహార యాత్రకని ఆనందంగా బయలుదేరిన ఈ పిల్లలకు పొంచి ఉన్న మృత్యువు గురించి తెలియదు.

బాంబు దాడిలో ఒసామాతో పాటు అతని తమ్ముడు అలీ కూడా మరణించాడు. ఈ వీడియో సమాధి నుంచి ఒసామా ఇస్తున్న సాక్ష్యమని అతని తండ్రి జయిద్ అలీ అల్ హమ్రాన్ చెబుతున్నారు.

దాడి నుంచి బయటపడిన పిల్లలు
ఫొటో క్యాప్షన్, పెద్దలు తాము చేసే యుద్ధాలకు ఎంతటి మూల్యం చెల్లిస్తారో దాడి నుంచి బతికి బయటపడ్డ ఈ పిల్లలు ఇప్పటికే బాగా నేర్చుకున్నారు
పాఠశాల గది
ఫొటో క్యాప్షన్, ఆయన హాజరు పట్టిలోని పేర్లను పిలుస్తున్నారు. కానీ బదులిచ్చేందుకు వారిలో ఏ ఒక్కరూ మిగల్లేదు

అల్ నజఫ్ పాఠశాలలోని కనిపిస్తున్న ప్రతి ఖాళీ బెంచీ తమ కథల్ని వినిపిస్తున్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకాలు హెడ్ మాస్టర్ అబ్దుల్‌వహబ్ అబ్దుల్లాను వెంటాడుతున్నాయి. తల్లిదండ్రులను కలిసినప్పుడు.. ‘‘మీరు ఒక్కరిని మాత్రమే పోగొట్టుకున్నారు. కానీ నేను 42 మంది పిల్లలను పోగొట్టుకున్నానని చెబుతుంటా. బస్సులోని వాళ్లంతా నా పిల్లల లాంటి వాళ్లే’’ అని ఆయన అంటున్నారు.

దాడిలో బతికి బయటపడ్డ పిల్లల శరీరాలపై కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని పైకి కనిపించేవి కావు. పెద్దలు తాము చేసే యుద్ధాలకు ఎంతటి మూల్యం చెల్లిస్తారో ఈ పిల్లలు ఇప్పటికే బాగా నేర్చుకున్నారు.

అశువులు బాసిన అమాయకుల పేర్లను ప్రపంచం గుర్తుంచుకుంటుందని అబ్దుల్లా ఆశిస్తున్నారు. ఆయన హాజరు పట్టిలోని పేర్లను పిలుస్తున్నారు. కానీ బదులిచ్చేందుకు వారిలో ఏ ఒక్కరూ మిగల్లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)