సౌదీ దిగ్బంధంతో కరవు గుప్పిట్లో లక్షలాది మంది యెమెన్ ప్రజలు

ఫొటో సోర్స్, Reuters
యుద్ధంతో దెబ్బతిన్న యెమెన్ మరో సంక్షోభంలో చిక్కుకుంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక సంకీర్ణం ఆ దేశాన్ని దిగ్బంధించడంతో తీవ్రమైన కరవు ముంచుకొస్తోంది. తక్షణం సౌదీఅరేబియా ఈ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల చీఫ్ మార్క్ లోకాక్ బుధవారం దీనిపై స్పందిస్తూ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని కోరారు. లేని పక్షంలో భయంకరమైన కరవు వచ్చి లక్షలాది మంది ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఐరాస భద్రతామండలికి కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఇంతకు ముందు ఈ వారం ప్రారంభంలోనే రెడ్‌క్రాస్ కూడా ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణాలు నిలబెట్టే ఎన్నో వస్తువుల సరఫరా ఆగిపోతే యెమెన్‌లోని లక్షలాది మంది మృత్యువు గుప్పిట్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
9 లక్షల మందికి పైగా కలరాతో బాధపడుతున్నారని, దిగ్బంధం కారణంగా వారి వైద్యానికి కావాల్సిన క్లోరిన్ మాత్రల సరఫరా కూడా ఆగిపోయిందని రెడ్‌క్రాస్ తెలిపింది.
కాగా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు అన్నిటికీ బయటి ప్రపంచంపైనే ఆధారపడే 70 లక్షల మంది యెమెన్ ప్రజలు ఇప్పుడు కరవు ముంగిట్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
‘ఇరాన్ నుంచి ఆయుధాలొస్తున్నాయ్’
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి ప్రయోగించిన తరువాత సోమవారం సౌదీ సంకీర్ణం యెమెన్‌కు వెళ్లే భూ, సముద్ర, వాయు మార్గాలను దిగ్బంధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
తిరుగుబాటుదారులకు ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయని, ఆ ఆయుధ సరఫరా ఆగాలంటే దిగ్బంధం తప్పనిసరని సౌదీఅరేబియా అంటోంది. మరోవైపు ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
కాగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు 2015 నుంచి పోరాటం చేస్తున్నారు. యెమెన్ అంతర్యుద్ధంలో సౌదీ సంకీర్ణం 2015 మార్చిలో జోక్యం చేసుకున్నప్పటి నుంచి 8,670 మంది మృతి చెందారు. వారిలో 60 శాతం మంది సాధారణ పౌరులే. సుమారు 50 వేల మంది గాయపడ్డారని ఐరాస గణాంకాలు చెప్తున్నాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








