ఆ ద్వీపంలో ‘నవ్వుతున్న గులకరాయి’లా కనిపించే ఆ ఆకారాలు ఏంటి, అవి ఎలా వచ్చాయి?

శిలాజాలు, చరిత్ర

ఫొటో సోర్స్, Tony Jolliffe/BBC

ఫొటో క్యాప్షన్, నార్తంబర్‌లాండ్‌లోని ది హోలీ ఐలాండ్ ఆఫ్ లిండిస్‌ఫార్న్‌లో ఈ శిలాజాన్ని కనుగొన్నారు.
    • రచయిత, ఎస్మీ స్టల్లార్డ్
    • హోదా, క్లైమేట్ అండ్ సైన్స్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
  • చదివే సమయం: 4 నిమిషాలు

నార్తంబర్‌లాండ్‌లోని హోలీ ఐలాండ్‌లో, బాక్సింగ్ డే వాకింగ్‌లో భాగంగా శిలాజాల కోసం వెతుకుతూ.. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 64 ఏళ్ల క్రిస్టీన్ క్లార్క్‌ను ఒక విషయం అమితంగా ఆకర్షించింది.

అదో చిన్న గులకరాయి.

‘‘నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. ఎవరిదో నకిలీ దంతాల సెట్‌లా అనిపించింది’’అని ఆమె అన్నారు.

దానిని ఇంటికి తీసుకెళ్లిన క్రిస్టీన్.. శిలాజాలను గురించే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. అది నిజానికి ఒక పురాతన సముద్ర జీవి అయి ఉండొచ్చన్న ఆమె అనుమానాన్ని మిగతా వాళ్లు ధ్రువీకరించినట్లు అనిపించింది.

క్రిస్టీన్ ఏటా తన భర్త గెరార్డ్‌తో కలిసి సెలవులు గడిపేందుకు నార్తంబర్‌లాండ్‌కు వెళ్తుంటారు. అక్కడ హోలీ ఐలాండ్‌‌లో కడ్డీ బీడ్స్ (కడ్డీ పూసల)ను వెతికేందుకు క్రమం తప్పకుండా వెళ్తామని ఆమె చెప్పారు.

ఆ ఐలాండ్‌లో కేవలం 150 మంది మాత్రమే ఉంటున్నారు.

సముద్రం కారణంగా రోజుకు రెండుసార్లు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ఈ ప్రాంతాన్ని ప్రారంభ ఆంగ్ల క్రైస్తవ మతానికి పుట్టినిల్లుగా పరిగణిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శిలాజాలు, చరిత్ర

ఫొటో సోర్స్, Tony Jolliffe/BBC

ఫొటో క్యాప్షన్, హారాలు తయారుచేసే చిన్నచిన్న క్రినోయిడ్ శిలాజ భాగాల కోసం క్రిస్టీన్ వెతుకుతూ ఉంటారు.

ఈ కడ్డీ పూసలు క్రినోయిడ్ అనే సముద్ర జీవి కాండం నుంచి ఏర్పడిన శిలాజ భాగాలు. వీటిని సెయింట్ కత్బర్ట్ బీడ్స్‌గా కూడా పిలుస్తారు. ఉత్తర ఇంగ్లండ్ పరిరక్షకుడిగా భావించే సెయింట్ కత్బర్ట్ నుంచి వీటికి ఈ పేరు వచ్చింది.

"ఆయన 670లలో సన్యాసిగా ఈ ఐలాండ్‌కు వచ్చారు. ఆయన్ను ఇక్కడే ఖననం చేశారు. ఆయన సమాధి వద్ద అద్భుతాలు జరిగాయి" అని ఇంగ్లిష్ హెరిటేజ్ నార్త్ ఈస్ట్ కలెక్షన్స్ క్యూరేటర్ డాక్టర్ ఫ్రాన్సిస్ మెకింతోష్ చెప్పారు.

వందల ఏళ్ల తర్వాత, 1300లలో ఈ చిన్న చిన్న శిలాజాలను ప్రజలు గుర్తించారు.

"కానీ, అవేంటో వారికి తెలియదు. కత్బర్ట్ వాటిని తయారుచేస్తున్నారని, ఆయన ఆధ్యాత్మిక ప్రక్రియలో అవి భాగమని, వాటిని సేకరించడం ద్వారా ఆధ్యాత్మికత భావనకు మరింత దగ్గరవుతామని వారు భావించారు" అని ఆమె చెప్పారు.

అలా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. గత ఏడాది బాక్సింగ్ డే రోజున పూసల కోసం క్లార్క్ వెతుకుతున్నారు. అయితే బీచ్‌లోని గులకరాళ్ల మధ్య విభిన్నంగా కనిపిస్తున్న శిలాజాన్ని ఆమె చూశారు.

"అది నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది, ఇది నేను కనుగొన్న మొదటి దంతాల సెట్" అని ఆమె సరదాగా అన్నారు.

శిలాజాలు, చరిత్ర

ఫొటో సోర్స్, Tony Jolliffe/BBC

ఫొటో క్యాప్షన్, ఆ శిలాజాన్ని కొంటామంటూ చాలామంది క్రిస్టీన్‌ను సంప్రదించారు.

ఈ శిలాజాన్ని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే (బీజీఎస్) ద్వారా బీబీసీ వెరిఫై చేసింది. ఇది క్రినోయిడ్ అనే సముద్ర జీవి శరీరంలోని ఒక భాగంగా వారు నిర్ధరించారు.

క్రినోయిడ్లు సముద్ర జంతువులు. ఇవి మొదట క్యాంబ్రియన్ కాలంలో, అంటే దాదాపు 50 కోట్ల ఏళ్ల కిందట కనిపించాయి. అందువల్ల ఇవి భూమిపై ఉన్న అత్యంత పురాతన సంక్లిష్ట జీవుల్లో ఒకటి. ఇప్పటికీ వీటి జాతులు మనుగడలో ఉన్నాయి.

ఇవి తేలికగా అటూ ఇటూ కదిలే కాండంతో ఉంటాయి. ఆ కాండం సముద్రపు అడుగు భాగాన్ని అంటుకుని ఉంటుంది. కాండం పైభాగంలో శరీరాన్ని చుట్టేసిన కొమ్మల్లా చేతులు ఉంటాయి. ఇది జీవరాశే అయినప్పటికీ, వీటి ప్రత్యేకమైన ఆకృతి కారణంగా "సీ లిల్లీస్" అని కూడా పిలుస్తారు.

"ఈ జీవి కాండం చక్రాల మాదిరిగా ఉండే చిన్నచిన్న భాగాలతో ఉంటుంది. వీటిని ఒసికల్స్‌ అని అంటారు. క్రిస్టీన్ దగ్గరున్న శిలాజం ఇలాంటి ఒసికల్స్ కలిసివున్న ఓ భాగం. దీనిని కాలమ్నల్‌గా వ్యవహరిస్తారు" అని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే‌లో సీనియర్ పాలియోంటాలజిస్ట్ డాక్టర్ జాన్ హెన్నిసెన్ చెప్పారు.

ఈ కాండం పొడవుగా చీలిపోయి, వంకర తిరగడం వల్ల విచిత్రమైన "నోటి ఆకారం"లా కనిపిస్తోంది.

"ఇది నలుపు రంగు సున్నపురాయి ఆల్ట్సన్ ఫార్మేషన్ నుంచి ఉద్భవించి ఉండొచ్చు. ఈ రాయి సుమారు 35 కోట్ల ఏళ్ల నాటిది" అని డాక్టర్ హెన్నిసెన్ చెప్పారు.

క్రినోయిడ్లు ఫైలమ్ ఎకినోడెర్మటా అనే సమూహానికి చెందినవి. సముద్రపు ఉసిరి, సముద్రపు కీరదోస కూడా ఇదే సమూహంలోకి వస్తాయి.

పూర్తి స్థాయి క్రినోయిడ్ దొరకడం చాలా అరుదు. సాధారణంగా, కాండంలో ఉండే చక్రాల్లాంటి (మధ్యలో రంధ్రం ఉండే) భాగాలు మాత్రమే దొరకుతాయి. ఇవి దాదాపుగా పోలో మింట్ ఆకారంలో కనిపిస్తాయి.

శిలాజాలు, చరిత్ర

ఫొటో సోర్స్, Tony Jolliffe/BBC

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ జియోలాజికల్ సర్వే ప్రకారం, పూర్తి స్థాయి క్రినోయిడ్ దొరకడం చాలా అరుదు. కేవలం దాని కాండం నుంచి వచ్చిన ఒసికల్స్ మాత్రమే దొరుకుతుంటాయి.

నార్తంబర్‌లాండ్ తీరంలో ఎక్కువగా దొరికే శిలాజాల్లో క్రినోయిడ్ శిలాజాలు కూడా ఒకటి. అక్కడ దొరికింది క్రినోయిడ్ శిలాజమా లేక మరొకటా అనేది సులభంగానే గుర్తించవచ్చని డాక్టర్ హెన్నిసెన్ అన్నారు.

"సాధారణంగా, రాయితో కలిసిపోయి కనిపించే ఈ శిలాజపు అసలు ఆకారం చాలా భిన్నంగా ఉండొచ్చు. దాని రంగు, నిర్మాణం కూడా వేరుగా ఉండొచ్చు" అని ఆయన అన్నారు.

తనకు దొరికిన శిలాజాన్ని కొంటామంటూ వచ్చిన ఆఫర్లను క్రిస్టీన్ తిరస్కరించారు. ప్రస్తుతం దానిని తన వద్దే ఉంచుకోవాలని ఆమె అనుకుంటున్నారు.

"ఇది చాలామందికి సంతోషం కలిగించిది" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)