జెయింట్ గూస్: ఆస్ట్రేలియాలో భారీ పుర్రె శిలాజాన్ని కనుగొన్న పరిశోధకులు

జెనియోర్నిస్ న్యూటో

ఫొటో సోర్స్, JACOB C. BLOKLAND

ఫొటో క్యాప్షన్, జెనియోర్నిస్ న్యూటోని దాదాపు 45,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, నియా ప్రైస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలో గూస్ పక్షి జాతికి సంబంధించిన భారీ పుర్రెను పరిశోధకులు కనుగొన్నారు. ఇది 230 కిలోల బరువుండే ఒక ఎగరలేని పెద్ద పక్షి జాతికి సంబంధించినది. వేల ఏళ్ల క్రితమే ఈ పక్షి అంతరించిపోయింది. ఇది ఈము కంటే ఐదు రెట్లు పెద్దది.

ఇప్పటివరకు జెనియోర్నిస్ న్యూటోని జాతుల్లో కనుగొన్న 45,000 నుంచి 50,000 సంవత్సరాల పురాతన శిలాజాలలో పూర్తిగా దొరికిన పుర్రె ఇది. ఈ పుర్రెను చూస్తే ఆ పక్షి ఎలా ఉంటుందో అర్థమవుతుందని పరిశోధకులు తెలిపారు.

"ఇది చెక్కుచెదరని పుర్రె అని తెలిసి చాలా సంతృప్తికరంగా ఉంది" అని ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత, అడిలైడ్‌లోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫోబ్ మెక్‌ఇనెర్నీ చెప్పారు.

ఇది హిస్టారికల్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

"ఓహ్ మై గాడ్, ఇది అద్భుతంగా ఉంది, మేం నిజంగా ఒకటి కనుగొన్నాం. జెనియోర్నిస్ గురించి 128 సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, ఇప్పుడు దాని పుర్రెను పొందాం" అని ఆయన తెలిపారు.

శిలాజ నమూనా

ఫొటో సోర్స్, Jacob C. Blokland

ఫొటో క్యాప్షన్, జాకబ్ బ్లాక్‌ల్యాండ్ పక్షి నమూనాను శాస్త్రీయంగా రూపొందించారు.

బురదలో కూరుకుపోయిన జంతువులు

2019లో 32 సెం.మీ.ల పుర్రెను దక్షిణ ఆస్ట్రేలియాలోని కల్లాబొన్నమ్ సరస్సులోని పొడి ప్రదేశంలో కనుగొన్నారు. చాలా ఏళ్ల క్రితం అక్కడి బురదలో వేలాది జంతువులు కూరుకుపోయాయి. అక్కడ లభించిన పుర్రెకు వాటి ఆనవాళ్లున్నాయి.

ఈ జాతికి చెందిన ఏకైక పుర్రె, 1913లో కనుగొన్నారని రాశారు, అయితే, అది చాలావరకు విరిగిపోయింది. ఎముకలో కొద్ది భాగం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి, దాని నుంచి ఎక్కువ సమాచారం పొందలేదు.

కానీ, ఈ తాజా ఆవిష్కరణ ఈ జెయింట్ పక్షులకు ఒక భారీ కపాలము, పెద్ద ఎగువ, దిగువ దవడలు, తల పైభాగంలో హెల్మెట్ వంటి క్యాస్క్ ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాదు వాటి నోరు చాలా పెద్దది, బలంగా కరిచేలా ఉంది, నోటితో మొక్కలు, పండ్లను చూర్ణం చేయగలదు.

జెనియోర్నిస్ న్యూటోని ఆస్ట్రేలియన్ మాగ్పీ గూస్‌కి సంబంధించినది, కానీ వేరే వంశాన్ని అనుసరించి విడిగా పరిణామం చెందింది. ఇది వాస్తవానికి దక్షిణ అమెరికా స్క్రీమర్ల జాతులకు మరింత దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.

ఆస్ట్రేలియాలో శిలాజాలు

ఫొటో సోర్స్, Flinders University

ఫొటో క్యాప్షన్, పుర్రెతో డాక్టర్ ఫోబ్ మెక్‌ఇనెర్నీ, జాకబ్ బ్లాక్‌ల్యాండ్

పజిల్స్ పరిష్కరిస్తాయి

ఇతర జాతులతో దాని సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదని డాక్టర్ మెక్‌ఇనెర్నీ అంటున్నారు, అయితే ఇప్పుడు కనుగొన్నది పరిశోధకులకు సదరు పజిల్‌ను పరిష్కరించడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ జాతి ఒక పెద్ద గూస్‌ అని మాత్రం వెల్లడిస్తోంది.

డాక్టర్ మెక్‌ఇనెర్నీ ప్రకారం.. ఆస్ట్రేలియాలో బల్లులు, కంగారూల వంటి ఇతర పెద్ద జీవుల మాదిరే పెద్ద, ఎగరలేని మిహిరంగ్‌లు లేదా థండర్ బర్డ్స్ అక్కడ తిరిగాయి. మొదటగా అక్కడికి మానవులు వచ్చినపుడు (50 వేల సంవత్సరాల కిందట) అవి ఉన్నాయి. ఈ పక్షిరూపం విచిత్రం, అద్భుతంగా ఉంటుంది.

శిలాజం ఆధారంగా ఒక పక్షి నమూనాను శాస్త్రీయంగా రూపొందించిన జాకబ్ బ్లాక్‌ల్యాండ్ మాట్లాడుతూ.. "ఆధునిక పక్షులతో పోల్చడం ద్వారా ఇవి జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండేవో మనం ఊహించవచ్చు" అని అన్నారు.

అంతరించిపోవడానికి కారణాలేంటి?

ఈ జెయింట్ పక్షులు నీటిలో నివసించడానికి సహాయపడే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అవి నీటి అడుగున ఉన్నప్పుడు వాటి చెవులు, గొంతును రక్షించుకుంటాయి.

45,000 సంవత్సరాల క్రితం ఉత్తర దక్షిణ ఆస్ట్రేలియాలోని మంచినీటి వనరులు ఉప్పు సరస్సులుగా మారడం అవి అంతరించిపోయేలా చేసి ఉంటుందని వారు భావించారు.

ఈ శిలాజ పక్షి పుర్రెలు అరుదైనవని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్‌కెన్‌బర్గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని పక్షి శాస్త్రవేత్త డాక్టర్ గెరాల్డ్ మేయర్ అన్నారు. ఈ అసాధారణ అన్వేషణ అప్పట్లో ఆస్ట్రేలియన్ పర్యావరణ వ్యవస్థలో ఈ పెద్ద పక్షి ఎలాంటి పాత్ర పోషించిందనేది తెలియజేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)