విద్యుత్ తీగలపై వాలినా పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు

విద్యుత్ తీగలపై పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యుత్ ప్రవహిస్తున్న కరెంటు తీగను పట్టుకుంటే అది మన ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది.

మరి హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు ఎలా నిలబడగలుగుతున్నాయి. వాటికి కరెంట్ షాక్ కొట్టదా?

దీని గురించి మనం తెలుసుకోవాలంటే ''విద్యుత్ ప్రవాహం'' గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఎలక్ట్రాన్లు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రవహించడాన్నే ఎలక్ట్రిక్ కరెంట్‌గా చెబుతారు.

ఈ ఎలక్ట్రాన్లు విద్యుత్ కేంద్రం నుంచి మెయిన్స్ ద్వారా మన ఇంటికి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత విద్యుత్ తీగల సాయంతో ఇవి ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరతాయి. మళ్లీ అదే విద్యుత్ తీగల సాయంతో మెయిన్స్‌కు అనుసంధానం అవుతాయి. ఇదంతా ఒక వలయంలా ఉంటుంది.

విద్యుత్ తీగలపై పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యుత్ ప్రవహించాలంటే ఇలాంటి క్లోజ్డ్ లూప్స్ అవసరం. అదే సమయంలో ఎలక్ట్రాన్లు ప్రవహించాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్‌లో తేడాలు ఉండాలి. మామూలుగా చెప్పాలంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ వైపు ప్రయాణిస్తాయి.

ఉదాహరణకు కొండపై నుంచి కొన్ని బంతుల్ని జారవిడిచాం అనుకోండి. ఏ అడ్డంకీ లేకపోతే, తమకు వీలైన దారిలో బంతులు ముందుకు పోతాయి. అలాగే ఎలక్ట్రాన్లు కూడా ఒక పొటెన్షియల్ నుంచి మరొక పొటెన్షియల్‌కు వెళ్తాయి.

ఈ అంశంపై మసాచుసెట్స్‌లోని ఫిలిప్స్ అకాడమీ పరిశోధకురాలు రాన్‌బెల్ సన్ లోతైన పరిశోధన చేశారు. ఆ పరిశోధనలోని వివరాల ప్రకారం.. ఇప్పుడు ఒక పక్షి విద్యుత్ వైర్‌పైన నిలబడింది అనుకుందాం. అప్పుడు దాని రెండు కాళ్లు ఒకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్‌లో ఉంటాయి. అందుకే ఎలక్ట్రాన్లు పక్షి శరీరం నుంచి ప్రవహించవు. అంటే ఎలక్ట్రాన్లు ప్రవహించకపోతే అక్కడ కరెంట్ లేనట్లే. అప్పుడు పక్షికి ఏమీకాదు.

ఒకవేళ పొరపాటున మరొక విద్యుత్ తీగను పక్షి తగిలితే, ముఖ్యంగా ఆ తీగ భిన్నమైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కలిగివుంటే, అప్పుడు ఎలక్ట్రాన్ల ప్రసరణకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా పక్షి శరీరం లోంచి విద్యుత్ ప్రవహించి, అది మరణిస్తుంది.

ఉదాహరణకు గబ్బిలాలు వంటి పెద్ద రెక్కలు గల పక్షులు విద్యుత్ తీగలపై వాలిన తరువాత అవి రెక్కలు చాస్తే పక్కనున్న తీగలను తాకి విద్యుత్ ప్రసారం జరిగి మరణిస్తాయి.

విద్యుత్ తీగలపై పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు విద్యుత్ తీగలకు ఆసరా ఇచ్చే చెక్క స్తంభాలపై పక్షులు నిలబడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ కర్రను భూమిలో పాతిపెట్టి ఉంచుతారు. కాబట్టి దానికి తక్కువ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు పక్షి ఆ పోల్ మీదకు వచ్చి, పొరపాటున ఏదైనా తీగను తాకితే, వెంటనే విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. హైవోల్టేజీ వైర్ నుంచి లోపొటెన్షియల్ కర్రకు పక్షి శరీరం ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది.

మనుషులకు కూడా కరెంట్ షాక్ ఇలానే కొడుతుంటుంది. మనం దాదాపుగా భూమిపై నిలబడి ఉంటాం. ఏదైనా ఒక వైర్‌ను పట్టుకుంటే ఆ వైర్‌లోని పొటెన్షియల్, కింద నేలపై పొటెన్షియల్ భిన్నంగా ఉంటాయి. దీంతో మన శరీరం లోంచి విద్యుత్ ప్రవహిస్తుంది. మన శరీరాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి.

అందుకే విద్యుత్ తీగలపై పనిచేసే సిబ్బంది.. రబ్బరుతో చేసిన వస్తువులను ఉపయోగిస్తారు. ఇవి విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోగలవు. కొన్నిసార్లు విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేసే సిబ్బంది హెలికాప్టర్ పైనుంచి పనిచేస్తుంటారు. భూమిపై ఎక్కడా కాలు మోపకుండా వారు జాగ్రత్త పడతారు. ఒకసారి ఒక విద్యుత్ వైర్‌ను మాత్రమే తాకేలా జాగ్రత్త వహిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)