బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది

చైనాలో బయటపడిన 3,000 ఏళ్ల నాటి పురాతన కళాకండం
ఫొటో క్యాప్షన్, చైనాలో బయటపడిన 3,000 ఏళ్ల నాటి పురాతన కళాకండం

చైనాలోని సిచువాన్ ప్రాంతంలో 3,000 ఏళ్ల నాటి పురాతన మాస్క్ లభ్యమైంది. ముఖానికి పెట్టుకునే ఈ తొడుగుపై సోషల్ మీడియాలో అనూహ్య రీతిలో కార్టూన్లు, మీమ్స్ వెల్లువెత్తాయి.

శాంసింగ్డూయీ పురావస్తు ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో క్రీస్తు పూర్వం 500 నాటి ఈ కళాఖండం లభ్యమైంది.

క్రీ.పూ. 316కు ముందు సిచువాన్ ప్రాంతాన్ని పాలించిన పురాతన 'షు' పాలన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ మాస్క్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా, సగం మాత్రమే ఉన్న ఈ మాస్క్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలు హోరెత్తుతున్నాయి.

బంగారపు మాస్క్‌తో 'హలో కిట్టీ'
ఫొటో క్యాప్షన్, బంగారపు మాస్క్‌తో 'హలో కిట్టీ'

శాంసింగ్డూయీ తవ్వకాల్లో లభ్యమైన వస్తువుల జాబితాను శనివారం విడుదల చేశారు.

వెంటనే చైనాలోని పాపులర్ సోషల్ మీడియా వీబోలో రకరకాల కార్టూన్లు, మీమ్స్ చక్కర్లు కొట్టాయి.

ఈ మాస్క్‌ను వివిధ కార్టూన్ పాత్రల ముఖాలకు తగిలించి పోస్ట్ చేశారు.

నెటిజన్లు తమ ఎడిటింగ్ ప్రావీణ్యాన్ని అంతా రంగరించి మాస్క్‌కు వివిధ రూపాలు అద్దారు.

"శాంసింగ్డూయీ గోల్డ్ మాస్క్ ఫొటో ఎడిటింగ్ కాంపిటీషన్" అనే హ్యాష్‌ట్యాగ్ ప్రారంభించారు. దీనికి సుమారు 40 లక్షల హ్యాష్‌ట్యాగ్ వ్యూస్ వచ్చాయి.

ఈ కళాఖండం అందాన్ని ప్రశంసిస్తూ అనేకమంది పోస్టులు పెట్టారు.

శాంసింగ్డూయీ పురావస్తు మ్యూజియం అధికారులు కూడా ఈ సరదాలో పాలుపంచుకున్నారు. వాళ్లు తయారుచేసిన మీమ్‌ను వీబోలో పోస్ట్ చేశారు.

మాస్క్‌తో సహా ఈ తవ్వకాల్లో లభ్యమైన ఇతర వస్తువులతో కూడిన ప్రత్యేక యానిమేషన్ వీడియోను ఈ మ్యుజియం విడుదల చేసింది.

ఈ వస్తువుల అందాన్ని వర్ణిస్తూ, పురాతన నాగరికతను ప్రశంసిస్తూ ఒక టీవీ వ్యాఖ్యాత సృష్టించిన ర్యాప్ సాంగ్ వైరల్ అయ్యింది.

పాండాకు కూడా మాస్క్ తొడిగారు
ఫొటో క్యాప్షన్, పాండాకు కూడా మాస్క్ తొడిగారు

అయితే, చైనాలో ఇలా పురాతన వస్తువులపై మీమ్స్ సృష్టించడం ఇదే తొలిసారి కాదు.

యాంగ్రీ బర్డ్స్ గేమ్‌లో వచ్చే పిగ్ పాత్రను పోలి ఉన్న అవశేషం గత ఆగస్ట్‌లో జరిపిన తవ్వకాల్లో లభ్యమైంది. దాని మీద కూడా పలు రకాల మీమ్స్ వచ్చాయి.

శాంసింగ్డూయీలో బంగారపు మాస్క్‌తో పాటు కాంస్య అవశేషాలు, బంగారపు ముక్కలు, దంతాలు, పచ్చలు, పట్టుతో చేసిన కళాఖండాలు బయటపడ్డాయి.

బలుల కోసం తవ్విన గుంతలలో ఈ వస్తువులన్నీ లభ్యమైనట్టు చైనా నేషనల్ కల్చరల్ హెరిటేజ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

షు నాగరికతలో అభివృద్ధి, శాంతిని కోరుతూ బలులు ఇచ్చేవారు. అందుకోసం గుంతలు తవ్వేవారు.

శాంసింగ్డూయీ శిథిలాలను మొట్టమొదటిసారిగా 1929లో కనుగొన్నారు. ఇప్పటివరకు 50,000లకు పైగా కళాఖండాలను వెలికి తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)