హాథ్‌రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిపై ఫిర్యాదు చేసిన ఓ తండ్రిని ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు.
‘‘పొలంలో పని చేసుకుంటున్నఅమ్రిశ్ శర్మ అనే రైతును కొంతమంది దుండగులు కాల్చి చంపారు. తన కూతురిని వేధించారని అమ్రిశ్ శర్మ 2018లో కొందరు వ్యక్తులపై కేసు పెట్టారు. ఆయన్ను చంపినవారిలో ఆ కేసు నిందితుడు కూడా ఉన్నారు’’ అని హాథ్‌రస్ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్ వెల్లడించారు.
"అమ్రిశ్ శర్మ కుమార్తె ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. లలిత్ శర్మ అనే నిందితుడిని అరెస్టు చేశాం. మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తాం’’ అని జైస్వాల్ తెలిపారు.
సోమవారం హత్య జరిగిన సమయంలో తన తండ్రి పొలంలో పని చేస్తున్నారని మృతుడు అమ్రిశ్ శర్మ కుమార్తె బీబీసీకి తెలిపారు.
‘‘నిందితుడిపై ఇంతకుముందు మేం వేధింపుల కేసు పెట్టాం. దాంతో కక్ష పెట్టుకున్నారు. చాలాసార్లు మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు కూడా చెప్పాం. కానీ వారు పట్టించుకోలేదు. చివరకు మా నాన్నను చంపారు’’ అని మృతుడి కుమార్తె వెల్లడించారు.
‘‘అమ్మ, నేను నాన్నకు భోజనం తీసుకుని పొలం దగ్గరకు వెళ్లాం. దుండగులు తెల్ల రంగు కారులో వచ్చి నాన్నపై కాల్పులు జరిపారు. నాన్న కిందపడిపోగా, దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మేం ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించాం. కానీ బతికించుకోలేకపోయాం’’ అని ఆ యువతి వెల్లడించారు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
నిందితులపై గతంలో కేసు
తన ఇంట్లోకి ప్రవేశించి కూతురిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గౌరవ్ శర్మపై బాధితురాలి తండ్రి అమ్రిశ్ శర్మ 2018 జులైలో కేసు పెట్టారు. ఈ కేసులో గౌరవ్ శర్మ కొన్నాళ్లు కస్టడీలో ఉండి, బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ కేసును విత్ డ్రా చేసుకోవాలని జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత గౌరవ్ శర్మ ఒత్తిడి చేశారని, కానీ తన తండ్రి అందుకు ఒప్పుకోలేదని బాధితురాలు వెల్లడించారు. ఆ కారణంగా బాధితుడిపై నిందితులు కక్ష పెంచుకున్నారు.
గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య అనేకసార్లు గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. "పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. నిందితులు ఆ కుటుంబాన్ని చంపేస్తామని గతంలోనే బెదిరించారు. పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్యను నివారించేవారు.’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు తెలిపారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుస ఘటనలు
యూపీలో అత్యాచార సంఘటనలే కాకుండా హత్యలు, లైంగిక వేధింపుల కేసులు అనేకం నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట సీతాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేశారని, ఆపై ఆమెను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపించాయి.
ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
వేధింపుల కారణంగా ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుమార్తెకు వేధింపులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది.
తన కూతురిని వేధిస్తున్నారంటూ గత ఏడాది నవంబర్‌లో నిరసన వ్యక్తం చేసిన ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలపై పదే పదే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








