డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జనవరి 6న తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రేరేపించారనే అభియోగాలతో సెనేట్ చేపట్టిన అభిశంసన ప్రక్రియ వీగిపోయింది. ట్రంప్‌ను దోషిగా నిర్ధరించేందుకు సెనేట్‌లో అవసరమైన మూడింట రెండు వంతు మెజారిటీ లభించలేదు.

ట్రంప్‌ను దోషిగా నిర్ధరిస్తూ సెనేట్‌లో మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. ఏడుగురు రిపబ్లికన్లు కూడా వారితో చేయి కలిపారు. మొత్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా 57 మంది, అనుకూలంగా 43 మంది ఓటు వేశారు. మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం 67 మంది ఓట్లు వేయాలి. అంటే, 10 ఓట్ల తేడాతో సెనేట్ ట్రంప్‌ను దోషిగా నిలబెట్టలేకపోయింది.

అభిశంసన నుంచి బయటపడిన తరువాత ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ, "చరిత్రలోనే ఇది అత్యంత కక్షపూరితమైన వేధింపు" అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ మీద అభిశంసన ప్రక్రియ చేపట్టడం ఇది రెండోసారి. ట్రంప్ కనుక అభిశంసనకు గురై ఉంటే, మళ్లీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా సెనేట్ నిషేధం విధించి ఉండేది.

యూఎస్ సెనేట్

ఫొటో సోర్స్, SENATE TELEVISION HANDOUT

ఫొటో క్యాప్షన్, యూఎస్ సెనేట్

ఓటింగ్ ముగిసిన తరువాత కాంగ్రెస్‌లోని సీనియర్ రిపబ్లికన్ నేత సెనేటర్ మిచ్ మెక్‌కోనెల్, "క్యాపిటల్ భవనం మీద దాడికి 'బాధ్యత' ట్రంప్‌దే. అది హేయమైన చర్య మాత్రమే కాదు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కిందకు వస్తుంది" అని వ్యాఖ్యానించారు.

ఆయన ట్రంప్‌ను దోషిగా నిర్ధరించడానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆయన అధ్యక్ష స్థానంలో లేరు కాబట్టి అది రాజ్యాంగబద్ధం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత అభిశంసన విచారణను జాప్యం చేయడంలో మెక్‌కోనెల్ కీలక పాత్ర వహించారు.

ఇప్పటికైనా, ట్రంప్ కోర్టు ఎదుట దోషిగా నిలబడే అవకాశం ఉందని ఆయన అన్నారు. "ఇంతటితో ట్రంప్ ఈ వ్యవహారం నుంచి బయటపడలేదు. మన దేశంలో నేర విచారణ జరిపే న్యాయవ్యవస్థ ఉంది. అలాగే, సివిల్ కోర్టులు కూడా ఉన్నాయి. ఈ రెండు చట్ట వ్యవస్థల నుంచి మాజీ అధ్యక్షులకు కూడా మినహాయింపు ఏమీ లేదు" అని మెక్‌కోనెల్ అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)