డోనల్డ్ ట్రంప్: 'అభిశంసన విచారణకు రాను... అది పారదర్శకంగా ఉంటుందన్న నమ్మకం లేదు'

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై ఆ దేశ కాంగ్రెస్ దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో బుధవారం తొలి అభిశంసన విచారణ జరగనుంది. దీనికి ట్రంప్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ హాజరవ్వరని వైట్ హౌస్ (అధ్యక్ష కార్యాలయం) ప్రకటించింది.

ఈ విచారణ 'పారదర్శకం'గా ఉంటుందని భావించలేమని వైట్ హౌస్ కాన్సెల్ పాట్ కిపోలోన్.. హౌస్ జ్యుడిషియరీ కమిటీకి లేఖ ద్వారా తెలియజేశారు.

ఈ విచారణకు రావాలని, లేదంటే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం మానుకోవాలని ట్రంప్‌కు హౌస్ జ్యుడిషియరీ కమిటీ డెమొక్రటిక్ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ గత వారం లేఖ రాశారు.

జెరాల్డ్ నాడ్లర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జెరాల్డ్ నాడ్లర్

విచారణకు హాజరయ్యేదీ లేనిదీ డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల్లోపు చెప్పాలని, ఒకవేళ న్యాయవాదిని పంపించాలని నిర్ణయిస్తే ఆ న్యాయవాది ఎవరో తెలపాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ స్పందించింది. ఇక రెండో అభిశంసన విచారణకు ట్రంప్ హాజరవుతారా, లేదా అన్న విషయం గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

రెండో విచారణ ఆహ్వానం గురించి విడిగా స్పందిస్తామని మాత్రం వైట్ హౌస్ తెలిపింది. ఆ విచారణ ఎప్పుడు జరుగుతుందనేది కూడా ఇంకా నిర్ణయం కాలేదు.

అభిశంసన విచారణలో హౌస్ కమిటీ 'సరైన ప్రక్రియలు' పాటించడం లేదని, 'మౌలికంగానే పారదర్శకత' లోపించిందని వైట్ హౌస్ కాన్సెల్ తాజా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పొలిటికో వార్తాసంస్థ ప్రచురించింది.

విచారణకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, సాక్షుల సమాచారం కూడా అందించలేదని వైట్ హౌస్ కాన్సెల్ వ్యాఖ్యానించారు.

హంటర్ బిడెన్, జో బిడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంటర్ బిడెన్, జో బిడెన్, ట్రంప్

విచారణ దేని గురించి?

తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు ట్రంప్ అక్రమంగా ఉక్రెయిన్ సాయం అభ్యర్థించారన్న ఆరోపణలు కేంద్రంగా ఈ అభిశంసన ప్రక్రియ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఓ ఉక్రెయిన్ గ్యాస్ సంస్థలో పనిచేశారు.

జో బిడెన్, హంటర్ బిడెన్‌ల ప్రతిష్ఠను దెబ్బతీసేలా విచారణలు చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ ఒత్తిడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, ఇది చట్ట విరుద్ధమని డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్నహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్.. అభిశంసన ప్రక్రియను అధికారికంగా కొనసాగించాలని తీర్మానం ఆమోదించింది

ఆధారాలు ఉన్నాయా?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ‌తో జులై 25న ట్రంప్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ గురించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఓ అజ్ఞాత ఫిర్యాదు అందింది.

గుర్తు తెలియని నిఘా అధికారి ఆ ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత వైట్ హౌస్ ఆ ఫోన్ సంభాషణ వివరాలను బహిర్గతం చేసింది. జో బిడెన్, హంటర్ బిడెన్‌లపై విచారణలు చేపట్టాలంటూ జెలెన్స్కీని ట్రంప్ కోరినట్లు అందులో ఉంది.

ఉక్రెయిన్‌కు సైనికపరమైన సాయాన్ని నిలుపుదల చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఫోన్ సంభాషణ జరిగింది.

బిడెన్‌పై విచారణ చేపడితేనే ఆ సాయాన్ని విడుదల చేస్తామని జెలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారని ఓ సీనియర్ అధికారి వాంగ్మూలం ఇచ్చారు. అయితే, వైట్ హౌస్ మాత్రం ఇది నిజం కాదని అంటోంది.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ ఏం చెబుతున్నారు?

జెలెన్స్కీతో తన ఫోన్ కాల్ అంతా సవ్యంగా సాగిందని ట్రంప్ అంటున్నారు.

సైనికపరమైన సాయాన్ని అడ్డుపెట్టుకుని తాను జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చానన్న ఆరోపణ అవాస్తవమని చెబుతున్నారు.

డెమొక్రటిక్ పార్టీ నాయకులు, మీడియాలోని కొన్ని వర్గాలు పనిగట్టుకుని తనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నమే అభిశంసన విచారణ అని అన్నారు.

ట్రంప్

అభిశంసన ప్రక్రియ ఇలా సాగుతుంది..

అధ్యక్షుడిని తొలగించడానికి అమెరికా చట్టసభ చేపట్టే రెండు దశల ప్రక్రియలో అభిశంసన అనేది మొదటిది.

దేశద్రోహం, అవినీతి, తీవ్రమైన తప్పులు, నేరాలు చేసినట్లు తేలితే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది.

హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ అభిశంసన ప్రక్రియను మొదలుపెడుతుంది. మొదట అభిశంసన విచారణ జరుపుతుంది.

అధ్యక్షుడి నేరాలకు తగిన ఆధారాలుంటే, ఓటింగ్ నిర్వహిస్తారు.

ఇందులోని సభ్యులు సాధారణ మెజార్టీతో అభిశంసనలోని అధికరణాలను ఆమోదించినా, ట్రంప్ అభిశంసనకు గురవుతారు.

అయితే, అభిశంసనకు గురైనంత మాత్రాన అధ్యక్ష పదవి పోదు.

ట్రంప్

అప్పుడే రెండో దశ మొదలవుతుంది. అభిశంసనలో పేర్కొన్న అభియోగాలపై కాంగ్రెస్‌లోని ఎగువ సభ సెనేట్ విచారణ జరుపుతుంది. ఓటింగ్ నిర్వహిస్తుంది.

సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సభ్యులు దోషి అని తేల్చితే, అధ్యక్షుడు పదవి కోల్పోతారు.

అయితే, ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీదే ఆధిపత్యం. ఆయన పదవి కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ.

ఒకవేళ ట్రంప్ పదవి కోల్పోతే, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు.

అమెరికా రాజ్యంగం ప్రకారం.. అధ్యక్షుడు పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా, మరణించినా.. ఉపాధ్యక్షుడు ఆ స్థానంలో మిగతా పదవీ కాలాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

క్లింటన్

ఫొటో సోర్స్, AFP

ఇదివరకు అభిశంసనలు జరిగాయా?

అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఇద్దరు అధ్యక్షులు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్. అయితే, సెనేట్ దోషులుగా తేల్చకపోవడంతో ఆ ఇద్దరూ పదవులు కోల్పోలేదు. 1868లో ఆండ్రూ జాన్సన్ సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు.

1994లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్.. తనపై అభిశంసన పెట్టే అవకాశాలుండటంతో ముందుగానే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)