జర్మనీ: ఇద్దరిని హత్య చేసిన హంతకుడు.. ఆన్‌లైన్‌లో ఎక్కడా తన పేరు లేకుండా చూసుకున్నాడు

గూగుల్ సెర్చి

ఫొటో సోర్స్, Getty Images

మూడున్నర దశాబ్దాల కిందట 1982లో ఒక హత్య కేసులో దోషిగా తేలిన జర్మనీ దేశస్థుడొకరు ఆన్‌లైన్ సెర్చ్‌లో ఎక్కడా తన పేరు రాకుండా ఉండే హక్కును సాధించుకున్నారు. ఆన్‌లైన్ సెర్చ్‌లో ఆయన పేరు ఎక్కడా రాకూడదని జర్మనీలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

యాచ్‌లో 1982లో ఇద్దరిని హత్య చేసిన కేసులో అప్పట్లో ఆ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. 2002లో జైలు నుంచి విడుదలైన ఆయన, ఆ నేరానికీ, తన కుటుంబం పేరుకూ సంబంధం ఉండకూడదని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించగా కార్ల్స్‌రుహీలోని రాజ్యాంగ న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది.

దీంతో, ఆన్‌లైన్ ఆర్కైవ్స్ ఆధారంగా చేసుకుని ఆయన పేరు ఎక్కడా ప్రచురించకుండా కోర్టు ఆదేశాలు నిరోధిస్తాయి.

గన్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటా కేసు?

కరీబియన్ దీవుల్లో అపోలోనియా నౌకలో ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడిన ఓ వివాదంలో ఆయన తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొందరు గాయపడ్డారు.

ఈ కేసు ఆధారంగా చేసుకుని ఒక పుస్తకం, ఒక టీవీ డాక్యుమెంటరీ విడుదలయ్యాయి.

1999లో డెర్ స్పీజెల్ మ్యాగజీన్ తన వెబ్‌సైట్‌లో ఆయన పూర్తిపేరుతో మూడు రిపోర్టులు అప్‌లోడ్ చేసింది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ దొరుకుతుంది.

కోర్టులేం చెప్పాయి?

తనకు సంబంధించిన ఆర్టికల్స్ వెబ్‌సైట్లో ఉన్న విషయం ఆ వ్యక్తికి 2009లో తెలిసింది. దాన్ని తొలగించమని కోరారు. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని అవి నిరోధిస్తాయని ఆయన అన్నారని కోర్టు ఒక ప్రకటనలో చెప్పింది.

అయితే, వ్యక్తిగత గోప్యత హక్కు కారణంగా పత్రికా స్వేచ్ఛను, ప్రజాప్రయోజనాన్ని కాదనలేమంటూ 2012లో ఫెడరల్ కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

రాజ్యాంగ న్యాయస్థానం ఆ తీర్పును పక్కనపెట్టి ఇప్పుడు ఆదేశాలిచ్చింది.

ప్రచురణ సంస్థలు తమ ఆర్టికల్స్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరుచుకునే వీలుంది కానీ కోరినప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది.

కాగా ఈ 'రైట్ టు బీ ఫర్గాటెన్' యూరోపియన్ యూనియన్, గూగుల్ మధ్య వివాదాలకు కారణమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)