ఆంధ్రప్రదేశ్: ఉపాధి హామీ కార్మికులు 8.58 లక్షల మందికి రూ. 53.47 కోట్లు మూడేళ్లుగా పెండింగ్.. కారణం ఏమిటి?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ (ఎన్‌ఆర్ఈజీఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది ఉపాధి కార్మికులు కొందరు మూడేళ్ళుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 8.58 లక్షల మంది కార్మికులకు రావలసిన 53.47 కోట్ల రూపాయలు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి?
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకూలీని కార్మికులకు ప్రధానంగా పోస్టల్ శాఖ ద్వారా ఇచ్చేవారు. అయితే, మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ఈఎఫ్ఎంఎస్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఈ సిస్టమ్ ద్వారా కార్మికుల అధార్ సంఖ్యతో అనుసంధానించిన బ్యాంకు అకౌంట్లో వారికి రావలసిన కూలీ మొత్తం నేరుగా జమ అవుతుంది. ఉపాధి హామీ పథకం నిధులను మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి బదులు నేరుగా కార్మికుల అకౌంట్లలో జమ చేయడం వల్ల జాప్యం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది.
అయితే, ఎన్ఈఎఫ్ఎంఎస్ 2016 డిసెంబర్లో అమల్లోకి వచ్చిన తరువాత అప్పటికి పాత అకౌంట్లలో ఉన్న ఉపాధి హామీ వేతనాలు కొత్త అకౌంట్లలోకి బదిలీ కాలేదు. చాలా మంది సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు ఆ మార్పు గురించి అవగాహన లేకపోవడంతో పాత అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకోలేకపోయారు. చివరకు, కొత్త అకౌంట్లలోకి ఆ డబ్బు బదిలీకాలేదు. ఆ డబ్బే వారికి ఇప్పటికీ అందలేదు.

2016కు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి- పోస్టల్ శాఖకు మధ్య అనుసంధాన కర్తగా ఈపాస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉపాధి వేతనాల పంపిణీకి ప్లాట్‌పార్మ్‌గా ఏపీఆన్‌లైన్ సంస్థ పని చేసింది. ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపుల ప్రక్రియ మొదలైన తరువాత ఈ సంస్థతో ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు నిలిచిపోయింది. దాంతో, ఏపీ ఆన్‌లైన్ రాష్ట్రవ్యాప్తంగా తాను నెలకొల్పిన బయోమెట్రిక్ మెషీన్లను కొన్ని నెలల తరువాత వెనక్కి తీసుకుంది.
ఈ పరిణామాలతో లబ్ధిదారుల పాత అకౌంట్ నంబర్లు, బయో మెట్రిక్ వివరాలు కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఈఎఫ్ఎంఎస్ విధానంతో పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ కాలేదు. ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఉపాధి హామీ కార్మికులకు జరపాల్సిన రూ. 53,47,14,373 చెల్లింపులు పెండింగ్‌లో పడ్డాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రం
ఈ సమస్య ముఖ్యంగా వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాలలో తీవ్రంగా ఉంది. ఇక్కడి ఉపాధి కూలీలలో, ఉపాధి హామీ సిబ్బందిలో అవగాహన అంతగా లేకపోవడం, సిబ్బంది అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. అలాగే, కొత్త అకౌంట్లు వస్తున్నప్పుడు పాత అకౌంట్లలోని డబ్బులు తీసుకోవాలని ప్రజలకు చెప్పడంలో ఏజెన్సీ ప్రాంతాలలోని పోస్టాఫీసు సిబ్బంది నిర్లక్ష్యం మరొక కారణం.
దానివల్ల మూడేళ్ళుగా ఉపాధి వేతనాలు అందుకోని వేలాది మందిలో ఒకరైన విశాఖ జిల్లాలోని గనపర్తి గ్రామానికి చెందిన గెంట వెంకటసత్యవతి, "ఉపాధి హామీ కాల్వ పనులు చేసి మూడేళ్ళయింది. ఇంకా డబ్బులు రాలేదు. ఇంతకు ముందు పోస్టాఫీసులో డబ్బులు తీసుకునేదాన్ని. ఇప్పుడేమో వేలిముద్రలు సరిపోలేదని అంటున్నారు. ఒక్కోసారి నా ఆధార్ కార్డు కాన్సిలైందని అంటున్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం, యలమంచిలి... అన్ని ఈసేవ కేంద్రాలకు వెళ్ళి అడిగాను. అయినా పని కాలేదు. దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు రావాలి" అని అన్నారు.
మూడేళ్ళుగా ఉపాధి హామీ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త, లిబ్‌టెక్ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ చక్రధర్ బుద్ధా, ఎన్ఈఎఫ్ఎంఎస్ మోడ్‌లోకి చెల్లింపుల ప్రక్రియ మారడానికి ముందు, అంటే 2016 డిసెంబర్‌కు ముందు ఉపాధి హామీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిల డేటా ప్రభుత్వం వద్ద లేకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఒక్క సీతంపేట మండలంలోనే అత్యధికంగా 5,527 మంది కూలీలకు 67.8 లక్షల రూపాయల చెల్లింపులు పెండింగులో ఉన్నాయని, విశాఖపట్నం జిల్లాలోని 39 మండలాల్లో 4.5 కోట్ల చెల్లింపులు పెండింగులో ఉంటే, అందులో 3.6 కోట్ల రూపాయలు జిల్లాలోని 11 గిరిజన మండలాల ప్రజలకు చెందినవేనని గుర్తు చేస్తున్న చక్రధర్, "మూడేళ్ళుగా రాష్ట్రంలోని 8.58 లక్షల మంది ఉపాధి కూలీలు తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ఈఎఫ్ఎంఎస్ విధానానికి పూర్వం తలెత్తిన సాంకేతిక సమస్యల మూలంగా ఉపాధి హామీ కింద వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం పోస్టల్ శాఖకు ఇచ్చింది. కానీ, తమ వద్ద అప్పటి డేటా లేదని, లబ్ధిదారుల వివరాలను తెలపాలని పోస్టల్ శాఖ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ విషయంలో ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ చొరవ తీసుకుని బాధితులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా చూడాలి" అని కోరుతున్నారు.

ప్రభుత్వానికి లేఖలు రాసిన పోస్టల్ శాఖ
పాత ఏఈపీఎస్ కూలీలకు సంబంధించిన కొత్త ఎన్ఈఎఫ్ఎంఎస్ ఫినాకిల్ అకౌంట్ల వివరాలు ఇచ్చి పెండింగ్‌లో 53.47 కోట్ల చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించాలని కోరుతూ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) ఈ ఏడాది జూలైలో రెండు సార్లు, ఆ తరువాత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరో రెండు సార్లు లేఖలు రాశారు.
ఈ విషయంలో ప్రజల నుంచి తమ మీద ఒత్తిడి ఉందని కూడా ఆ శాఖ తన లేఖలో తెలిపింది.
త్వరలో చెల్లింపులు జరిపేలా చూస్తామని ప్రభుత్వ హామీ
అయితే, ఈ బకాయిలన్నీ 2016 డిసెంబర్ కన్నా ముందువి మాత్రమే కాదని, ఆ తరువాత కూడా ఆధార్ అనుసంధానిత పోస్టల్ అకౌంట్ల మార్పు ప్రక్రియ వల్ల నిలిచిపోయిన చెల్లింపులు కూడా అందులో ఉన్నాయని కొత్త బకాయిలు కూడా పెండింగులో పడిపోయాయని గ్రామీణాభివృద్ది శాఖ అడిషనల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బీబీసీతో చెప్పారు.
నిజానికి, ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం కూలీలకు వేతన చెల్లింపులను 15 రోజుల్లోగా జరపాలి. లేని పక్షంలో ప్రభుత్వం వారికి నష్ట పరిహారం చెల్లించాలి. అయితే, కూలీల అకౌంట్లలో డబ్బు పడిన తరువాత నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.
మూడేళ్ళుగా పాత బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఎనిమిది లక్షలకు పైగా గ్రామీణ పేదలు, గిరిజనులకు 53.47 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమిటని అడిగినప్పుడు, " చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్‌కు అవసరమైన డేటా అంతా ఇచ్చాం. ఆయనతో నేను వ్యక్తిగతంగా కూడా దీని గురించి మాట్లాడాను. వీలైనంత త్వరగా లబ్ధిదారుందరికీ పాత బకాయిలు అందుతాయని ఆశిస్తున్నాం" అని బాలసుబ్రహ్మణ్యం బదులిచ్చారు.
నిజానికి, ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏనాడో పోస్టల్ శాఖకు ఇచ్చిందని, చెల్లింపులు అక్కడే ఆగిపోయాయని కూడా ఆయన అన్నారు.
అయితే, "సహజ న్యాయ సూత్రాల ప్రకరాం పని చేయించుకుంది ప్రభుత్వమే కాబట్టి, పని చేసిన కూలీలకు చెల్లింపులు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది" అని చక్రధర్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- #UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితంలో కొంత మార్పొచ్చింది
- ఆధార్ రూల్స్ మారాయ్.. ఇప్పుడు వీటికి ఆధార్ కార్డు అస్సలు అవసరం లేదు
- “రైతుబంధు, అన్నదాత సుఖీభవ పథకాలు మాకొద్దు.. మమ్మల్ని ఇలా వ్యవసాయం చేసుకోనివ్వండి”
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి ఇంటర్వ్యూ: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- రాజకీయ చదరంగంలో అమిత్ షాపై శరద్ పవార్ ఎలా గెలిచారు.. అసలు చాణక్యుడు ఎవరు?
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








