షాద్ నగర్ బాధితురాలి సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్‌నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’

- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ సమీపంలో కిడ్నాప్, అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ సోదరి.. ఈ సంఘటన గురించి, తదనంతర పరిణామాలు, మీడియా, సమాజం, విద్యా విధానం గురించి బీబీసీకి చెప్పిన విషయాలు.. ఆమె మాటల్లోనే.
‘ఆ నిర్లక్ష్యాన్ని వదలాలి’
జరిగిన ఘటన దురదృష్టకరం. ఏదీ తిరిగి రాదు ఇప్పుడు. ఇలా ఎవరికీ జరగకూడదని నేను ఆశిస్తున్నా.
ఎందుకంటే, అటువంటి పరిస్థితుల్లో మా అక్క ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు.
వారు చాలా క్రూరంగా చంపారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఉండకూడదు. అలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదు అని నేను కోరుకుంటున్నా.
అందరూ అన్ని వేళలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఏమీ అవదులే అని ఎప్పుడూ అనుకోవద్దు.
నిన్న కూడా నేను చాలా మామూలుగా మాట్లాడాను. భయపడుతున్నా అని ఆమె చెప్పినప్పటికీ.. నాకు మాత్రం నిజంగా ఆ సీరియస్‌నెస్ తెలియదు. ఆమె చెప్పే మాటల్ని నేను చాలా మామూలుగా తీసుకున్నాను. ఇలా చాలా మందికి జరుగుతుంది.
ఇలా చాలా మందికి జరుగుతుంది. ఇలాంటివి మామూలుగా జరుగుతాయిలే, పట్టించుకోనక్కర్లేదు అనే నిర్లక్ష్యం వదలాలి.
ఎందుకంటే, జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఏదీ ఊహించలేం.
ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంత చిన్న విషయమైనా సరే.

‘తెలిసిన వాళ్లైనా సరే, వారితో కూడా జాగ్రత్తగా ఉండండి’
నేను కూడా విషయాలను సీరియస్‌గా తీసుకోను. అలా సీరియస్‌గా తీసుకుని ఉండుంటే మా అక్క ప్రాణం కాపాడి ఉండేదాన్ని.
ఎవరినీ నమ్మకండి. తెలిసిన వాళ్లైనా సరే కూడా.. నమ్మకండి. నేను ఇలా చెప్పకూడదేమో. కానీ, బర్త్‌డే పార్టీకని వెళ్లిన అమ్మాయిని కూడా రేప్ చేసి, చంపేశారని నాకు తెలిసింది.
ఆ సంఘటనే నాతో ఇలా మాట్లాడిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండండి.. తెలిసిన వాళ్లైనా సరే, వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాతి క్షణం ఏం జరుగుతుందో మనం ఊహించలేం కదా.
పార్టీలైనా, మరొకటైనా రాత్రిపూట మానేయండి. ఒకవేళ రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. స్నేహితులకు చెప్పండి. వెళ్లే ముందు ఎవరో ఒకరికి నిజం చెప్పండి. ఎక్కడకి వెళ్తున్నా, ఏం జరుగుతుందో చెప్పండి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేసి ఉండాల్సింది అని అందరూ అంటున్నారు.
ఆ సమయంలో అక్క 100కి కాల్ చేసుండాల్సింది అని నేను అనుకోలేదు.
ఎందుకంటే మనమెవరం అటువంటి పరిస్థితుల్లో లేం. తను ఉంది ఆ పరిస్థితుల్లో.
తను అప్పటికే చాలా భయపడి ఉంది. కంగారు పడి ఉంది. అభద్రతతో ఉంది. బాధతో ఉంది.
ఆ సమయంలో ఆమె 100కి కాల్ చేయాల్సింది అను నేను అనుకోలేదు.
కానీ ప్రజలు, ఏదైనా కాస్త తేడా ఉందని అనిపిస్తే.. వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి.
ఒకవేళ విషయం ఇంత సీరియస్ అని నాకు తెలిస్తే నేనే ఫోన్ చేసేదాన్ని. కానీ ఆ పరిస్థితి అంత సీరియస్ అని నాకు తెలియదు.

‘ఏమీ జరగదులే అనుకోవద్దు’
అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదీ నిర్లక్ష్యంగా తీసుకోవద్దు.
ముఖ్యంగా అమ్మాయిలు బయటకు వెళ్లేప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. కనీసం అందరూ అవగాహన పెంచుకోవాలి.
మనకు జరిగే వరకూ ఏం జరుగుతుందిలే, ఏమీ జరగదులే అనుకోవద్దు. ప్రజలు అవగాహన పెంచుకోవాలి.
ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి. అవి ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. బయటకు వెళ్లేప్పుడు స్నేహితులో, బంధువులో ఎవరో ఒకరికి చెప్పాలి.
ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లొద్దు. ఇలాంటివి చేయవద్దు.
ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం ఇంకా కఠిన నిబంధనలు తేవాలి.
‘మన విద్యా విధానంలో విలువలను చేర్చాలి’
ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజుల్లో మానవత్వం లేదు.
మన విద్యా విధానంలో నైతికత లేదు. సమాచారం ఉంది. జ్ఞానం, విజ్ఞత లేదు. విద్య అంటే చదువు మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉండాలి. ఏది తప్పు, ఏది ఒప్పో చెప్పగలిగే జ్ఞానం ఉండాలి.
మన విద్యా విధానంలో విలువలను చేర్చాలని నేను కోరుకుంటున్నా.
కానీ మన విద్యా విధానంలో నైతికత నేర్పడం లేదు. మానవత్వం లేదు.
అందరికీ చదువు అంటే.. వెళ్లడం, చదవడం, ఏదో ఒకటి అయ్యి.. డబ్బు సంపాదించడం.. ఇలాగే ఉంది చదువంటే. చదువు లేకపోయినా చాలా డబ్బు సంపదించవచ్చు.
నువ్వు చదువుకున్న వ్యక్తి అంటే నీలో విజ్ఞత, జ్ఞానం ఉండాలి.

ఫొటో సోర్స్, UGC
‘మీడియా అడగాల్సింది మా ఆత్మీయత గురించి కాదు’
నేను (మీడియాను) నిందించాలనుకోవడం లేదు. కానీ ఈరోజంతా నేను ఎలా గడిపానో, నాకు ఏమనిపించిందో అది చెప్తా.
ఒకే ప్రశ్న పదే పదే అడగడంలో అర్థం ఏముంది?
మేమిద్దరం మాట్లాడుకున్న ఆడియో బయటకు వచ్చి, అందరూ విన్నాక కూడా.. మీరు ఏం మాట్లాడుకున్నారని అడగడంలో అర్థం లేదు. మీ అక్కతో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఇదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడగడం ఎందుకు?
నన్ను భావోద్వేగానికి గురి చేసి సీన్ చేయాలనుకున్నారని నాకు అనిపించింది. మీడియా అలా చేయకూడదు.
వాళ్లు సంబంధం ఉన్న ప్రశ్నలు అడగాలి. కుటంబంలో నష్టం నష్టమే. అందరికీ ఆమెతో భావోద్వేగాలు ఉంటుంది.
దాన్ని బాగా భావోద్వేగపూరితం చేయకూడదు. ఘటన గురించి, దారి తీసిన పరిస్థితులు, కారణాలు చెప్పాలి.
దానికి ఏం చేయాలి, దాని నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో చెప్పాలి. అంతేకానీ, నాకూ మా అక్కకూ ఉన్న ఆత్మీయత గురించి కాదు మాట్లాడాల్సింది.
అందరికీ కుటుంబం ఉంటుంది. ఆత్మీయత ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా వ్యక్తిగత అనుబంధం గురించి చెబితే సమాజానికి ఏం ఉపయోగం?
నా జీవితంలో ఒక దారుణ ప్రమాదం జరిగితే, దాన్నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో మీడియా చెప్పాలి.
వాస్తవంగా ఏం జరిగిందో మీడియా చెప్పాలి. భావోద్వేగపూరితం చేయడం కాదు. అది సరికాదని నాకు అనిపించింది. ఇలాంటి ప్రశ్నల్ని కొందరు నన్ను అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది.

ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
‘మీడియా వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు సమంజసమేనా?’
మీడియాను నేను తప్పు పట్టడం లేదు. కానీ మీడియానే ఆలోచించుకోవాలి. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు సమంజసమేనా? కాదా? అని ఆలోచించుకోవాలి.
అవే ప్రశ్నలు. అవే ప్రశ్నలు.. రోజంతా అవే. అదే విషయం. అదే విషయం. కొత్తగా ఏం రాదు. నేను, అక్క మాట్లాడుకున్నది అంతా విన్నారు. అయినా మళ్లీ వచ్చి అదే అడుగుతారు.
నీకేమనిపించింది. నువ్వెందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇలాంటివి అడగాల్సింది.
సంఘటనకు సంబంధించిన, సమంజసమైన ప్రశ్నలు అడగమని మీడియాకు సలహా ఇస్తున్నా.
ఏదో చూపించడానికి వచ్చి, ప్రజలను బలవంతం పెట్టి, వాళ్లను ఇబ్బంది పెట్టి.. ఇదంతా సరికాదు. మీడియా ఇలా చేయకూడదు.
వంద చానళ్లు ఒకే ప్రశ్న అడగడం మంచిది కాదు. ఆలోచించాలి. సందర్భోచితంగా ప్రశ్నలు అడగండి.
వాళ్ళు నన్ను భావోద్వేగానికి గురి చేయాలని చూశారు. నాకు మా అక్కతో అనుబంధం ఉంది.
మీకు నేను మీడియా ముందు ఏడవాలి. దాన్ని టీవీలో పెట్టాలనుకుంటున్నారు. దాన్ని ఎమోషనల్ చేయాలనుకుంటున్నారు. అది సరికాదు.
ఈ టైంలో మీరైతే ఏం చేసుండేవారు లాంటవి అడిగి మీరు (మీడియా) నన్ను భావోద్వేగ పరంగా రెచ్చగొట్టాలని చూశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘మీడియా చేయాల్సింది ఇదీ..’
ఇప్పటికే మేం బాధలో ఉన్నాం. నష్టాన్ని భరిస్తున్నాం. ఆ తీపి గుర్తులు గుర్తు చేసి, ఇప్పుడామెలేదని గుర్తు చేసి మీరు (మీడియా) మమ్మల్ని మరింత బాధ పెట్టాలనుకుంటున్నారు. ఇది సరికాదు.
అలాంటిది చేయకూడదని వ్యక్తిగతంగా కోరుతున్నా. సంబంధం ఉన్నవి మాట్లాడండి.
సమాజంలో అవగాహన పెంచండి. తద్వారా సమాజంలో భద్రత పెరిగేలా చేయండి.
ఇప్పుడు ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి, కొద్దిసేపు ప్లే చేసి.. తరువాత ప్రజలు మర్చిపోతారు. అది కాదు కావాల్సింది.
సమాజంలో భద్రత మరింత పెరగాలి. అవగాహన పెరగాలి. అది మీడియా చేయాలి. కానీ ఆ విషయం మీడియా మర్చిపోతోంది.
చాలామంది వచ్చారు. కానీ, ఈ ఘటనను ఒకటి, రెండు నెలల్లో అంతా మర్చిపోతారు. కాబట్టి మా అక్కా చెల్లెళ్ల అనుబంధం.. ఇదంతా సంబంధం లేనివి.
కానీ మీరు మీడియాలో చూపించే దాని ప్రభావం ప్రజలపై ఉండాలి. దీన్ని చూసి వారిలో అవగాహన పెరగాలి. వారిలో తెలివితేటలు పెరగాలి.
(ఎవరికైనా) ఇలాంటి పరిస్థితి వస్తే, మా అక్క ఫోన్ చేయలేదు. కానీ వాళ్లు ఫోన్ చేసేట్టు ఉండాలి.
వారు ఇది గుర్తు చేసుకోగలగాలి. ఆ అవగాహనను మీడియా పెంచాలి. అంతేకానీ ఎమోషనల్ చేయడం కాదు.


ఫొటో సోర్స్, twitter/TelanganaDGP
‘ప్రమాదంలో ఉన్న మహిళలు, అమ్మాయిలు ఈ హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోండి’
‘ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, మీ ఆత్మస్థైర్యమే మీకు రక్షణ’ అని తెలంగాణ డీజీపీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘‘అనుకోని ప్రమాదంలోగానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే అధైర్యపడకండి. ధైర్యంగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉంటూ వేగంగా కదలండి, వీటన్నింటికంటే ముందుగా పరిస్థితులను చురుగ్గా అర్థం చేసుకోవడం ప్రధానం’’ అని రాసి ఉన్న ఒక పోస్ట్‌ను ఆ ట్వీట్‌లో జత చేశారు.
ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్ లైన్ నెంబర్లకు తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యమని, ‘ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోండి’ అని తెలిపారు.
- విద్యార్థులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 100 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబర్ 0402785235 కు గానీ, వాట్సాప్ నెంబర్ 9490616555 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- అలాగే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112, 100, 1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి. ఈ నంబర్లు ఏ రాష్ట్రంలో అయినా పనిచేస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 షీ టీమ్‌ల ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ నెంబర్లను కూడా తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:
- బీజేపీ పట్టు సడలుతోందా... ఏడాదిలో 21 నుంచి 17 రాష్ట్రాలకు పడిపోయిన అధికారం
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు.. ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?
- GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది - అభిప్రాయం
- హినా మునావర్: ఈ పాకిస్తాన్ మహిళ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు?
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








