అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ పేరును 'దిశ'గా మార్చిన పోలీసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు

షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో న్యాయశాఖ దానికి ఏర్పాటు ప్రారంభించింది.
ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
విచారణను వేగంగా పూర్తిచేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని సూచించారు. దీంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం పంపనుంది.
ప్రత్యేక కోర్టు ఏర్పాటైతే కేసులో నిందితులను రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, త్వరితగతిన శిక్ష విధించేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్న మంత్రి న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.
"ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
వెటర్నరీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటన దారుణమన్న సీఎం.. బాధితురాలి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.
మరోవైపు ఈ కేసులో బాధితురాలి పేరును 'దిశ'గా మారుస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకనుంచి 'దిశ' అనే పేర్కొనాలని సూచించారు. సోషల్ మీడియాలోను, ఇతర ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి అసలు పేరు వాడొద్దని సజ్జనార్ కోరారు.
అసలు ఏం జరిగింది?
హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి, శవాన్ని కాల్చేశారు. గురువారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ చింతపల్లి గ్రామ శివార్లలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గర్తించారు.
ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు వారిని జైలుకు తరలించారు.
మృతురాలు పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది.
మృతురాలు బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడే మృతురాలితో ఆమె సోదరితో ఫోన్లో మాట్లాడింది. ఆ సంభాషణను సోదరి రికార్డ్ చేసింది. తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
పోలీసులు వెల్లడించిన వివరాలు...
షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారానికి ఆ నలుగురు నిందితులూ ముందుగానే పథకం వేశారని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ శివార్లలోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.
నవంబర్ 27 రాత్రి ఒక యువతి కనిపించడం లేదంటూ మాకు ఫిర్యాదు అందింది.
ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 20-25 ఏళ్ల మహిళ శరీరం దహనమవుతోందనే సమాచారం మాకు అందింది. ఈ రెండు ఫిర్యాదులనూ కలిపి విచారిస్తే, అది వెటర్నరీ డాక్టరుదేనని తేలింది.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను వేగంగా పూర్తిచేశాం. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొత్తం పంక్చర్ షాపులు అన్నీ చెక్ చేశాం.
నలుగురు నిందితుల్లో ఏ1 లారీ డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఏ2, ఏ3, ఏ4 నిందితులు లారీ క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా మక్తల్ మండలానికి చెందినవారు.
వారు తమ లారీలోని లోడ్ దించడానికి యజమానికి ఫోన్ చేస్తే, సమాధానం రాకపోవడంతో ఏ1 తన లారీని తీసుకొచ్చి టోల్ గేట్ దగ్గర పెట్టారు. లోడు దింపడానికి ఆలస్యం కావడంతో వారు అక్కడే ఎదురుచూస్తున్నారు.
ఆ సమయంలో బాధితురాలు తన వాహనం పార్క్ చెయ్యడం చూశారు. ఆ తర్వాత వీరంతా మద్యం సేవించారు. ఆమె మళ్లీ తిరిగి తప్పకుండా వస్తుందని ఊహించారు.
స్కూటీ టైరు గాలి తీసేస్తే ఎక్కడికీ పోదు అని ఏ2 నిందితుడు చెప్పారు. దీంతో వాళ్లు బాధితురాలి స్కూటీ వెనక టైరులో గాలి తీసేశారు.

సాయంత్రం ఆమె అక్కడికి రాగానే ఏ1 నిందితుడు వెళ్లి పంక్చర్ అయింది, సహాయం చేస్తానని చెప్పారు. తమ వాళ్ల దగ్గరికి వెళ్లి పంక్చర్ వేయించుకుని రమ్మని చెప్పారు.
ఇంతలో బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడారు.
ఆ తర్వాత నలుగురూ కలిసి ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ సమయంలో నోరును, ముక్కునూ గట్టిగా మూసేయడంతో ఆమె అక్కడే మరణించారు.
ఆ తర్వాత ఏ2, ఏ4 నిందితులు స్కూటీ నడపగా, మిగిలిన ఇద్దరూ లారీ నడుపుతూ వెళ్లారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
దగ్గర్లోని బంకులో పెట్రోల్ తీసుకుని, బాడీని దుప్పట్లలో చుట్టి, పెట్రోల్, డీజిల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. కానీ మళ్లీ వెనక్కి వచ్చి బాడీ పూర్తిగా కాలిందో లేదో చూసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆరాంఘడ్ వెళ్లిపోయారు.
దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టి, త్వరలోనే శిక్ష పడేలా చేస్తాం.
ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 100 నెంబరుకు ఫోన్ చెయ్యండి. పోలీసులు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారు.

ఘటన జరిగిన క్రమం ఇదీ...
- సాయంత్రం 6.08 కు బాధితురాలు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చారు.
- సాయంత్రం 6.13 కు తన వాహనం అక్కడ పార్క్ చేసి గచ్చి బౌలి వెళ్లారు.
- రాత్రి 9 తర్వాత మళ్లీ వచ్చారు. తన స్కూటీ టైర్ పంక్చర్ అయిన విషయాన్ని గుర్తించారు. తాను పంక్చర్ వేయిస్తానని నిందితుడు వాహనాన్ని తీసుకెళ్లాడు.
- రాత్రి 9.48 కు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
- రాత్రి 10 తర్వాత లారీ, వెనక స్కూటీ వెళ్లింది.
- అర్థ రాత్రి 1 గంట తర్వాత నిందితులు పెట్రోల్ కొన్నారు.
- అర్థ రాత్రి 2 నుంచి 2.30 మధ్యలో బాడీని తగలబెట్టారు.
ఇవి కూడా చదవండి.
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- వరంగల్: బర్త్ డే పార్టీ అని పిలిచి అత్యాచారం... బాధితురాలి మృతి
- స్కూల్లోనే పిల్లల కాళ్లను తాళ్లతో బంధించారు
- బీజేపీ, మిత్రపక్షాల పట్టు సడలుతోందా... ఏడాదిలో 21 రాష్ట్రాల నుంచి 17 రాష్ట్రాలకు పడిపోయిన అధికారం
- మహారాష్ట్ర: బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన ఆ ఆరు తప్పులు.. ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరే బాధ్యులా?
- నాడూ, నేడూ.. పొలాల్లోనే పాఠశాల... చెట్ల కింద స్పెషల్ క్లాసులు... ఎక్కడో కాదు ఆంధ్రాలోనే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








