మహారాష్ట్ర: బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన ఆ ఆరు తప్పులు.. ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరే బాధ్యులా?

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్సీపీలో చీలిక తెచ్చి, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.. మెజార్టీ లేక రాజీనామా చేశారు.
దీనికి ముందు గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది.
మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి?
ఇదే విషయాన్ని సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్ సింగ్ విశ్లేషించారు. బీబీసీ ప్రతినిధి మానసీ దాశ్‌తో మాట్లాడుతూ.. బీజేపీ ప్రధానంగా ఆరు తప్పులు చేసిందని ఆయన చెప్పారు. ఆ తప్పులు, వాటి వివరాలు ఆయన మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images
1. ఎన్సీపీని దూరం చేసుకోవడం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం బీజేపీ వైపు నుంచి జరిగిన తొలి తప్పు.
ఇదేమీ రాజకీయ ప్రతీకారం తీర్చుకునే చర్య కాదని, ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని.. అప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్ మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది.
మహారాష్ట్రలో ఎన్సీపీ ఓ తటస్థ పక్షంలా ఉండేది. శివసేన నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు బీజేపీకి సాయం అందించేందుకు ముందుకు వచ్చేది.
2014లో బీజేపీ మెజార్టీ రుజువు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్సీపీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.
కానీ, ఈడీ నోటీసులతో ఎన్సీపీతో ఉన్న ఆ సంబంధాలను బీజేపీ పూర్తిగా పాడు చేసుకుంది. దీంతో శివసేన బయటకు వెళ్లాక, బీజేపీ ఒంటరైపోయింది.

ఫొటో సోర్స్, NCP @Facebook
2. అజిత్ పవార్‌ను నమ్ముకోవడం
అజిత్ పవార్‌ను అవినీతిపరుడని బీజేపీ ఐదేళ్లుగా అంటూ వచ్చింది. ఆయన కంటే పెద్ద అవినీతిపరుడు మరొకరు లేరని ఆరోపణలు చేసింది.
చివరికి మళ్లీ బీజేపీ ఆయన్నే నమ్ముకుంది. ఓ విధంగా ఆయన దొంగతనంగా తెచ్చిన లేఖపై భరోసా పెట్టుకుంది.
అజిత్ పవార్ దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలున్నారనే విషయంపై ముందు నుంచీ సందేహాలు ఉన్నాయి. దాన్ని గుర్తించడంలో బీజేపీ కూడా విఫలమైంది.
కేవలం అజిత్ మాటలనే బీజేపీ నమ్ముకున్నట్లు అనిపిస్తోంది.
అజిత్ ఎమ్మెల్యేలను వెంట తీసుకురావడంలో విఫలమైతే ఏం చేయాలన్నదాని గురించి ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రణాళికలూ లేవు.

ఫొటో సోర్స్, Facebook
3. పవార్ కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోవడం
శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య బంధాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. వాళ్లిద్దరూ ఒకే కుటుంబ సభ్యులు.
అధికారం కోసం ఆ కుటుంబంలో విభజనలు వస్తాయని బీజేపీ అంచనా వేసింది.
కుటుంబం నుంచి దూరంగా వచ్చిన వ్యక్తిపై భావోద్వేగపరంగా ఉండే ఒత్తిడి ఎలా పనిచేస్తుందన్నది లెక్కలోకి తీసుకోలేదు.
అజిత్ పవార్‌ను సముదాయించడం కుటుంబ సభ్యులకు తేలికే అయ్యింది. బీజేపీతో వెళ్లినా, ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమితో ఉన్నా ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవే వస్తుందని వాళ్లు బుజ్జగించగలిగారు.
కుటుంబానికి దూరంగా వెళ్లడం వల్ల వస్తున్న లాభమేమీ లేదని అజిత్ పవార్ గుర్తించగలిగారు. ఈ విషయంలో పవార్ కుటుంబ సభ్యులు విజయవంతమయ్యారు.

ఫొటో సోర్స్, Twitter
4. శరద్ పవార్‌ను తక్కువ అంచనా వేయడం
శరద్ పవార్ శక్తిని బీజేపీ తక్కువ అంచనా వేసింది. ఇది అన్నింటికన్నా పెద్ద తప్పు.
ఈడీ నోటీసుల అందుకున్న తర్వాత శరద్ పవార్ చూపిన ప్రతిఘటన వల్ల బీజేపీ ఎన్నికల్లో కనీసం 15-20 సీట్లు నష్టపోయింది.
మహారాష్ట్రలో, ముఖ్యంగా మరాఠా రాజకీయాల్లో శరద్ పవార్ ఇప్పటికీ పెద్ద నేత. బీజేపీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది.
శరద్ పవార్‌తో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి సుదీర్ఘ బంధం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలనాపరమైన, రాజకీయ వ్యవహారాల గురించి అవసరమైనప్పుడల్లా శరద్ పవార్‌కు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటుండేవాడినని మోదీ స్వయంగా అంగీకరించారు కూడా.
మరి, వారి స్నేహ బంధం ఎందుకు తెగిపోయింది? అలా తెగడం వల్ల వారికి ఏం ప్రయోజనం దక్కింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం.
శరద్ పవార్ విభిన్నమైన రాజకీయాలకు పేరుపొందారు. కొన్ని సార్లు కాంగ్రెస్‌తో ఉన్నారు. కొన్ని సార్లు దూరం వెళ్లారు. మూడు సార్లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆయన ఎన్సీపీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు దాటింది. మహారాష్ట్రలో ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా బలంగా మారింది. జనాదరణను కాపాడుకోవడంలో సఫలమైంది.
శరద్ పవార్ రాజకీయాలను మెరుగ్గా అర్థం చేసుకున్న దిగ్గజాల్లో ఒకరు. ఎప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదన్నది ఆయనకు బాగా తెలుసు.
ఎన్నికల ప్రచార సమయంలో 80 ఏళ్ల వయసులోనూ ఆయన ధీరత్వాన్ని చాటుకున్నారు. ఓ సభ సందర్భంగా జోరు వర్షంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు తీసిన ఫొటో.. ప్రచార సరళినే మార్చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
5. సహనం లేకపోవడం
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలోకి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని తీసుకురావడం పెద్ద పొరపాటు.
ఒక వేళ కేబినెట్ సమావేశం నిర్వహించి, రాష్ట్రపతి పాలనను తొలగించాలని నిర్ణయం తీసుకుని ఉండుంటే, బీజేపీ అంత అప్రతిష్ట పాలయ్యేది కాదు.
అర్ధరాత్రి పూట వ్యవహారాలను పూర్తి చేయాల్సినంత అగత్యం ఏం వచ్చిందని అంతటా చర్చ జరిగింది. అత్యవసర నిబంధనలను ఉపయోగించుకుని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. కానీ, బీజేపీ అందుకోసం సన్నాహాలే చేసుకోలేదని చివరికి తెలిసింది.
అంతా సాధారణ పద్ధతిలో జరిగుంటే, విపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరమే వచ్చుండేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
6. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లను ఒక్కటి చేయడం
ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు విభేదాలు పరిష్కరించుకుని, ఒక్కటయ్యేందుకు కావాల్సినన్ని అవకాశాలు బీజేపీ ఇచ్చింది.
ఒక్కటవ్వడం మినహా ఆ పార్టీల ముందు మరో మార్గం లేదు. ఎందుకంటే వాటికిది అస్తిత్వ సమస్యగా మారింది.
ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీ ముందు ఉంది. ఇందుకోసం ఆ పార్టీ స్వయంగా శరద్ పవార్‌తో మాట్లాడాల్సింది.
ఎన్సీపీ షరతులను ఒప్పుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే, శివసేనకు కళ్లెం వేసే అవకాశం బీజేపీకి వచ్చేది.
మహారాష్ట్రలో బీజేపీకి ఎదురైన ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరినే బాధ్యుడిని చేయలేం. నాయకత్వానికి కూడా ఇందులో పాత్ర ఉంది.
మహారాష్ట్ర చిన్న రాష్ట్రమేమీ కాదు. పైగా ఇదివరకు కర్ణాటకలోనూ ఇదే తప్పు చేశారు.
ఒకవేళ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పడనిచ్చి ఉంటే, అంతర్గత విభేదాలతో అది కూలిపోయే అవకాశాలు ఉండేవి. అప్పుడు బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉండేది. మళ్లీ ఎన్నికలు వచ్చినా, బీజేపీకి లాభం దక్కేది.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పుడు జరిగిందంతా బీజేపీకి నష్టం కలిగించేదే.
ఫడణవీస్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ పడింది. మహారాష్ట్ర నుంచి భవిష్యత్తులో ప్రధాని అయ్యే అర్హతలున్న నేతగా ఆయన్ను భావిస్తూ వచ్చారు.
బీజేపీ ముఖ్యమంత్రులందరిలో కేంద్రంతో అత్యంత సాన్నిహిత్యం ఆయనకే ఉందని పేరు. పార్టీ నాయకత్వం నుంచి కూడా ఆయనకు గొప్ప సహకారం లభిస్తోంది.
కానీ, అధికారం కోసం ఎవరితోనైనా కలిసేందుకు వెనుకాడరన్న పేరును ఆయన ఈ ఎన్నికలతో మూటగట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి.
- రాజకీయ చదరంగంలో అమిత్ షాపై శరద్ పవార్ ఎలా గెలిచారు.. అసలు చాణక్యుడు ఎవరు?
- షాద్ నగర్ అత్యాచారం: ‘ప్లీజ్ పాపా, కొంచేపు మాట్లాడు పాపా.. దెయ్యంలా వెంట పడిండు.. నాకు భయం అయితాంది’
- బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం రేపు.. ఎన్సీపీలోనే ఉంటానన్న అజిత్ పవార్
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








