మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఎలా జరిగిందంటే...

అజిత్ పవార్, ఫడణవీస్, శరద్ పవార్
    • రచయిత, నాందేవ్ అంజన
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి వరకూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వ ఏర్పాటుకోసం సమావేశాల్లో మునిగితేలుతున్నాయి. కానీ, శనివారం (నవంబర్ 23) ఉదయం దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వ ఏర్పాటు కోసం ముంబయి, దిల్లీలో వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నాయి. ఇంతలోనే వ్యూహాత్మకంగా బీజేపీ ఆ పార్టీలు ఊహించని రీతిలో నిశ్శబ్దంగా చెయ్యాల్సిన పనిని ముగించింది.

తమకు ఎన్సీపీ ఎమ్మెల్యేలందరి మద్దతూ ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరీష్ మహాజన్ అంటున్నారు. కానీ, అజిత్ పవార్ చర్యకు ఎన్సీపీ మద్దతివ్వదు అని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఇది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని, పార్టీ నిర్ణయం కాదని ఆయనన్నారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, CMO

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 145మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి 105మంది సభ్యులున్నారు. మెజారిటీని నిరూపించుకోవాలంటే వారికి మరో 40 మంది మద్దతు అవసరం. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతునిస్తున్నారన్న మహాజన్ వ్యాఖ్యలు నిజమే అయితే, అసలు బీజేపీ.. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఎలా పొందగలిగింది? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న.

దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌ల ప్రమాణ స్వీకారం తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రావత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అజిత్ పవార్ బాడీ లాంగ్వేజ్‌పై శుక్రవారమే అనుమానం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

సంజయ్ రావత్ వ్యాఖ్యలు, శనివారంనాడు వేగంగా మారిన పరిణామాలను బట్టి బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్ కమలం'పై చర్చలు ఊపందుకున్నాయి.

గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాల్లో, సమావేశాల్లో బిజీగా ఉంటే.. బీజేపీ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ నిశ్శబ్దానికి అర్థం ఏంటో ఈ రోజు మహారాష్ట్ర ప్రత్యక్షంగా చూసింది.

ఈ ఆపరేషన్ మొత్తం ఎలా జరిగిందనే దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది బీబీసీ.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, ANI

అజిత్ పవార్ ముందే సంకేతాలిచ్చారా?

మహారాష్ట్రలో బీజేపీ ఆపరేషన్ కమలాన్ని అమలుచేసిందా? విపక్షాలన్నీ చర్చల్లో ఉండగా తెరవెనక రాజకీయాలు నడిపిందా? కొన్ని రోజులుగా అజిత్ పవార్ చర్యలు ఈ సంకేతాలనే ఇస్తున్నాయి.

‘‘మాతో సమావేశాల్లో ఉండగా అజిత్ మా కళ్లలోకి చూసేవారు కాదు’’ అని అజిత్ చర్యలపై సంజయ్ రావత్ అనుమానాలను వ్యక్తం చేశారు. "నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కూడా ఆయన మాతో ఉన్నారు. కానీ, ఆయన మా కళ్లలోకి చూసేవారు కాదు. శరద్ పవార్ కూడా దీన్ని గ్రహించారు. కాసేపటి తర్వాత ఉన్నట్లుండి అయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తన లాయరుతో సమావేశమయ్యారని తెలిసింది. శరద్ పవార్‌కు ఈడీ నోటీసులు రాగానే మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం విభిన్నంగా ఉంది. ఆ సమయంలోనే అజిత్ రాజీనామా చేశారు. అప్పుడే నాకూ అర్థమయ్యింది, ఆయన ద్రోహానికి పాల్పడే యోచనలో ఉన్నారని. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్‌ను దూరం చేసిన బీజేపీ చర్యలకు ప్రజలే సమాధానం చెబుతారు" అని సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు.

"రాష్ట్ర ప్రజలను అజిత్ వెన్నుపోటు పొడిచారు. ఆయన ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లాల్సిన వారు. కానీ, బీజేపీ తన జిమ్మిక్కులతో ఎన్సీపీ నుంచి అజిత్‌ను, కొందరు ఎమ్మెల్యేలను దూరం చేసింది. మేము మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది దేశ రాజకీయాల్లో మార్పును తీసుకొస్తుంది" అని సంజయ్ రావత్ అన్నారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

నవంబరు 13న ముంబయిలో కాంగ్రెస్, ఎన్సీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. కానీ, మధ్యలోనే ఉన్నట్లుండి అజిత్ బయటకు వెళ్లిపోయారు. బారామతి వెళ్లిన ఆయన, సమావేశం రద్దయిందని చెప్పారు. రాష్ట్రపతి పాలన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.

బీజేపీ నుంచి దూరం జరిగిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు ప్రారంభించింది. పృథ్వీరాజ్ చవాన్, నవాబ్ మాలిక్ తమ తమ పార్టీల తరఫున మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్సీపీలో అజిత్ పవార్ సీనియర్ నాయకుడైనప్పటికీ ఆయన పార్టీ తరఫున ముందుకు వచ్చి మాట్లాడలేదు. పరిణామాల పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి.

''ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యాక అజిత్ పవార్ వ్యాఖ్యల తీరు మారిపోయింది. జయంత్ పాటిల్ ఎప్పుడూ శరద్ పవార్ పక్షానే కనిపించారు. కానీ, అజిత్ పవార్ అలా లేరు'' అని సీనియర్ పాత్రికేయుడు శ్రీమంత్ మనె అన్నారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, FACEBOOK/SUPRIYA SULE

ఎన్నికలకు ముందు ఆ రాజీనామా

మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం గురించి ఈడీ శరద్ పవార్‌కు నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందిస్తూ శరద్ పవార్ స్వయంగా ఈడీ కార్యాలయానికి వెళ్లి, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈడీ అధికారులు, పోలీసుల అభ్యర్థనల తర్వాత ఆయన వెనక్కితగ్గారు. అదే రోజు సాయంత్రం అజిత్ పవార్ అకస్మాత్తుగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తన వల్ల శరద్ పవార్ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొవాల్సి వచ్చిన కారణంగా రాజీనామా చేశానని అజిత్ పవార్ వివరణ ఇచ్చారు. నిజానికి, ఈడీ నోటీసులపై శరద్ పవార్ చూపించిన దూకుడుతో ఎన్సీపీ కార్యకర్తలు పునరుత్తేజంతో ఉన్నారు. అజిత్ పవార్ రాజీనామా అప్పటి దాకా జరుగుతున్న చర్చ‌ను దారి మళ్లించింది.

''ఈడీ శరద్ పవార్‌కు నోటీసులు ఇవ్వడంతో రాజకీయ నాటకానికి తెర లేచింది. శరద్ పవార్‌కు వస్తున్న సానుభూతిని పక్కదోవ పట్టించడానికే అజిత్ పవార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారనుకుంటా'' అని శ్రీమంత్ మనె అన్నారు.

పవార్ కుటుంబంలో నాయకత్వం ఎవరిదన్న విషయంలో నెలకొన్న పోటీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ చర్చనీయాంశంగా ఉంది.

సుప్రియా సూలే, అజిత్ పవార్‌ల మధ్యే పోటీ అని ముందు అనుకునేవారు. రోహిత్ పవార్ ఎమ్మెల్యేగా గెలిచాక, ఆయన కూడా పోటీలోకి వచ్చారు. నాయకత్వం విషయంలో పోటీ పెరుగుతుండటంతో అజిత్ పవార్‌లో ఆందోళన మొదలైందా అన్న ప్రశ్న ఉదయించింది.

ఎన్నికలకు ముందు, తర్వాత కూడా అజిత్ పవార్ తన అసంతృప్తిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రదర్శిస్తూ వచ్చారు. బీజేపీ ఆపరేషన్ కమలం ఈ పరిణామంతోనే మొదలైందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

బాల్ ఠాక్రే అరెస్టుపై అజిత్ పశ్చాతాపం

గతంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అరెస్టైన వ్యవహారం గురించి తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అజిత్ పవార్ పశ్చాతాపం వ్యక్తం చేశారు.

''ఎన్సీపీ తరఫున జరిగిన పొరపాటు అది. కొందరు సీనియర్ నాయకుల ఒత్తిడితోనే అలా చేయాల్సి వచ్చింది'' అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్ కావాలనే ఈ అంశాన్ని ప్రస్తావించారని శ్రీమంత్ మనె అన్నారు.

''బాల్ ఠాక్రేపై ఛగన్ భుజ్‌బల్ తీసుకున్న ఆ చర్యను అజిత్ కావాలనే లేవనెత్తారు. భుజ్‌బల్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించలేదు. ఎన్సీపీ జోరుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నమే అది'' అని అభిప్రాయపడ్డారు.

అజిత్ పవార్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయనతోపాటు కలిసి వెళ్లిన కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత శరద్ పవార్ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలోనూ వేదికపై కనిపించారు. వారిలో రాజేంద్ర షింగ్నే, సందీ క్షీర్‌సాగర్ కూడా ఉన్నారు. తమకు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి ముందుగా తెలియదని వారు అన్నారు.

''ఉదయం ఏడు గంటల వరకు ధనంజయ్ ముండే ఇంటికి రావాలని అర్ధరాత్రి 12 గంటలకు మాకు పిలుపు వచ్చింది. అక్కడి నుంచి ఓ చోటుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్ భవన్ చేరుకునేవరకూ మాకేమీ తెలియదు. అక్కడికి వెళ్లాక దేవేంద్ర ఫడణవీస్, ఇతర నాయకులను చూశాం. కొంతసేపటి తర్వాత ప్రమాణ స్వీకారాలు జరిగాయి. మాకు అక్కడ ఇబ్బందికరంగా అనిపించింది. కార్యక్రమం అయిన వెంటనే మేం శరద్ పవార్‌ను కలిసేందుకు వచ్చాం. మేం ఎన్సీపీతోనే ఉన్నాం'' అని రాజేంద్ర షింగ్నే చెప్పారు.

ఎమ్మెల్యేలకు ఏమీ చెప్పకుండా రాజ్ భవన్‌కు తీసుకువెళ్లడం ఆపరేషన్ కమలంలోని వ్యూహమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

''ఎన్సీపీని బీజేపీ విజయవంతంగా విడగొట్టింది. శరద్ పవార్ మాటను అజిత్ పవార్ జవదాటరని చెబుతూ.. శరద్ పవార్ విశ్వసనీయతపై సందేహాలు తలెత్తేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది'' అని శ్రీమంత్ అన్నారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

నమ్మకంతో ఉన్న బీజేపీ

అజిత్ పవార్ లాగే కొందరు బీజేపీ నేతలు కూడా ఆపరేషన్ కమలం గురించి ముందు నుంచీ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మాజీ మంత్రి సుధీర్ ముంగంతివార్ తదితర నాయకులు మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని గట్టిగా చెబుతూ వచ్చారు.

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు నవంబర్ 14న సమావేశమయ్యారు. అప్పుడు దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ తప్ప మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.

కొన్ని రోజుల క్రితం ముంబైలో గడ్కరీ మాట్లాడుతూ.. రాజకీయాలు, క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని అన్నారు. కొన్ని సార్లు మ్యాచ్ ఓడిపోతున్నట్లు కనిపించినా, ఫలితం దానికి పూర్తి భిన్నంగా వస్తుందని వ్యాఖ్యానించారు.

నవంబర్ 15న చంద్రకాంత్ పాటిల్ కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని సుధీర్ ముంగంతివార్ అన్నారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

2014లో బీజేపీకి ఎన్సీపీ మద్దతు

2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి. అప్పుడు బీజేపీకి 123, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి.

అప్పుడు బీజేపీ మెజార్టీకి 22 సీట్ల దూరంలో ఉంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామని శరద్ పవార్ ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఎన్సీపీ, బీజేపీ ఒక్క దగ్గరికి రావడం అదే తొలిసారి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)