రూ. 2.5 కోట్లు చెల్లించలేదని బాలుడి మృతదేహాన్ని ఇవ్వని హాస్పిటల్‌పై ట్యాక్సీ డ్రైవర్ల దాడి

ఫొటో సోర్స్, RSUP M Djamil
కుమారుడికి జబ్బు చేయడంతో ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు, కానీ, ఆ బాలుడు చనిపోయాడు. 2.50 కోట్ల ఇండోనేసియా రూపాయలు (భారత కరెన్సీలో రూ.1.27 లక్షలు) వరకు బిల్లు అయ్యింది. దానిని చెల్లించే వరకూ బాలుడి మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది.
ఈ విషయం తెలుసుకున్న మోటార్ సైకిల్ ట్యాక్సీ డ్రైవర్లు భారీగా తరలి వచ్చి ఆస్పత్రిపై దండెత్తారు. ఆస్పత్రి సెక్యూరిటీని ఎదిరించి బాలుడి మృతదేహాన్ని మార్చురీ నుంచి బయటకు తీసుకొచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇండోనేసియాలోని పడంగ్ నగరంలో ఈ సంఘటన జరిగింది.
''మానవతా దృక్పథం''తోనే బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తాము ఆస్పత్రిపై దండెత్తామని ఈ సంఘటనలో పాల్గొన్న మోటార్‌సైకిల్ ట్యాక్సీ డ్రైవర్ వర్దియన్స్య బీబీసీ ఇండోనేసియాతో చెప్పారు.
ఆరు నెలల ఆలిఫ్ పుతుర్ మృతదేహాన్ని తీసుకుని పదుల సంఖ్యలో మోటార్ సైకిల్ ట్యాక్సీ డ్రైవర్లు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఫోన్‌తో రికార్డు చేసిన ఒక వీడియోలో ఇదంతా కనిపిస్తోంది.
ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి వీలైనంత త్వరగా ఖననం చేయాలి.
కానీ, ఆలిఫ్ వైద్యానికి సంబంధించిన బిల్లులను చెల్లించే వరకూ బాలుడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇవ్వబోమని అతని తల్లిదండ్రులతో ఎం జమిల్ ఆస్పత్రి చెప్పింది.
ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బాలుడి కుటుంబ సభ్యుడు ఒకరు తన సహచరులకు విషయం చెప్పారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లంతా ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

''ఆస్పత్రి బిల్లుల కింద 2.50 కోట్ల (ఇండోనేసియా) రూపాయలు (భారత కరెన్సీలో రూ.1.27 లక్షలు) చెల్లించలేకపోవడంతో బాలుడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇవ్వటం లేదని తెలియడంతో మేం ఇలా చేయాల్సి వచ్చింది'' అని వర్దియన్స్య తెలిపారు.
''సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ మేం చాలామంది ఉండటంతో వారు చేతులెత్తేశారు'' అని ఆయన అన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇండోనేసియాలో వైరల్ అయ్యింది. తమ పిల్లల ఆస్పత్రి బిల్లులు చెల్లించలేని తల్లిదండ్రులపై చర్చకు దారితీసింది.
ఇదే తరహాలో గతంలో కూడా పిల్లల వైద్యానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని, అవి చెల్లించే వరకూ.. అప్పుడే పుట్టిన చిన్నారులను ఇండోనేసియాలోని కొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు బందీలుగా పెట్టుకున్నాయి.
అధ్యక్షుడు జోకో విడొడొ ఆధ్వర్యంలో ఇండోనేసియాలో ఒక సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ పథకానికి నిధుల కొరత సమస్యగా మారింది. పైగా, చాలా పేద కుటుంబాలు ఈ పథకం కింద నమోదు కాలేదు.
మృతి చెందిన బాలడు ఆలిఫ్ తల్లి దేవి సూర్య మాట్లాడుతూ... ఆలిఫ్ జబ్బు పడిన తర్వాత తాము కూడా ఆరోగ్య సంరక్షణ పథకం కింద నమోదు చేసుకునే ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
ఆలిఫ్‌కు ఆపరేషన్ జరిగింది. కానీ, మంగళవారం ఉదయం మృతి చెందాడు.
''బిల్లులు చెల్లించాలని ఆస్పత్రి కోరింది. దీంతో డ్రైవర్లంతా ఆగ్రహించారు. బలవంతంగా ఆలిఫ్‌ను తీసుకొచ్చారు. పాపం ఆలిఫ్ చాలా సేపు మార్చరీలో ఉండాల్సి వచ్చింది'' అని బాలుడి ఖననం సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు అతని తల్లి. ఆస్పత్రిలో బాలుడిని చేర్చే సమయంలో కూడా ఆలస్యం జరిగిందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Halbert Caniago
కాగా, ఈ సంఘటన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
ఆస్పత్రి డైరెక్టర్ యుసిర్వాన్ యసుఫ్ మాట్లాడుతూ.. బాలుడి కుటుంబం చెల్లించాల్సిన బిల్లులను హాస్పిటల్ బోర్డు బరిస్తోందని చెప్పారు. అపార్థాల వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.
''మా ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాతే ఆ బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి మాకు తెలిపింది. మాది ప్రజల ఆసుపత్రి. వైద్యానికి చెల్లించేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవా? అని కూడా మేం పేషెంట్లను అడగం'' అని ఆయన వివరించారు.
అయితే, బైకర్ల దాడిని యూసుఫ్ విమర్శించారు. అలా చేయడం నిర్లక్ష్యం, ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
''మాకొక ప్రామాణిక పద్ధతి ఉంది. దాన్ని బద్దలుకొట్టారు. అది చాలా ప్రమాదకరం. ఒకవేళ ఆ మృతదేహంలో అంటువ్యాధి ఉంటే? అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు?'' అని ఆయన ప్రశ్నించారు.
మోటార్ సైకిల్ ట్యాక్సీ డ్రైవర్ల ప్రతినిధి కూడా ఆస్పత్రి యాజమాన్యానికి క్షమాపణలు తెలిపారు.
''జరిగినదానికి నా సహచరుల తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఆస్పత్రి పేరును నిలబెట్టాలని నిర్ణయించుకున్నాం. మాకు ఆస్పత్రి పద్ధతి తెలియదు. చాలా ఆలస్యం జరిగింది, అందుకే మేం ఆ సిర్ణయం తీసుకున్నాం'' అని డ్రైవర్ అల్ఫియాండ్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- లబ్‌డబ్బు: ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య బీమాతో ప్రయోజనాలివీ..
- భారతీయులు వైద్య విద్య కోసం రష్యా వెళ్లట్లేదు. ఎందుకంటే..
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- క్రమశిక్షణా లేక సృజనాత్మకతా? విద్యార్థులకు ఏది ముఖ్యం?
- 'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- ఈ దళితులు బౌద్ధ మతంలోకి ఎందుకు మారుతున్నారు?
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








