క్రమశిక్షణా లేక సృజనాత్మకతా? విద్యార్థులకు ఏది ముఖ్యం?

ఫొటో సోర్స్, Getty Images
మన పిల్లల కోసం ఎలాంటి స్కూల్ ఎంచుకుంటాం? పూర్తిగా సృజనాత్మకతతో స్వతంత్రంగా ఆలోచించే అలవాటు నేర్పే స్కూలా, లేక మంచీ చెడుల గురించి చెబుతూ క్రమశిక్షణ నేర్పించే స్కూలా?
చాలా మంది రెండూ కావాలని, పిల్లలు మానసికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే రెండూ ముఖ్యమేనని అంటారు. ఉద్యోగాలు చేయడం కన్నా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగే సామర్థ్యాన్నిచ్చే సృజనాత్మకత, మంచికి చెడుకి మధ్య ఉన్న తేడాను గుర్తించే క్రమశిక్షణ రెండూ అనివార్యమని అంటారు.
దీనిపైన అమెరికాలో ప్యూ రీసెర్చ్ గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి పలు ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల ప్రజల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు.
ప్యూ రీసెర్చ్ గ్రూప్ వార్షిక సర్వేలో భాగంగా విద్య పట్ల ఈ 19 దేశాల ప్రజల అభిప్రాయాలు.. సాంస్కృతిక, రాజకీయ భేదాభిప్రాయాల కోణంలో ముందుకు వచ్చాయి.
స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, కెనడా వంటి దేశాల్లో ప్రజలకు విద్య పట్ల స్పష్టమైన అభిప్రాయం, ప్రాధాన్యం ఉన్నాయి. అందుకే ఈ దేశాల్లో ప్రజలు విద్య అంటే సృజనాత్మకత, స్వతంత్రంగా ఆలోచించడమేనని అంటారు.
స్పెయిన్‌లో 67 శాతం ప్రజలు స్కూల్‌లో సృజనాత్మకతనే ముఖ్యమని అన్నారు. 24 శాతం మంది మాత్రం పిల్లలకు మంచి, చెడుల గురించి నేర్పించడం ముఖ్యమని, అందువల్ల క్రమశిక్షణే వారికి తొలి ప్రాధాన్యమని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ తొలి ప్రాధాన్యం.. క్రియేటివిటీ
స్పెయిన్‌కు భిన్నంగా బ్రిటన్‌లో మాత్రం 51 శాతం ప్రజలు పిల్లల క్రమశిక్షణే కోరుకుంటామని తెలిపారు. పిల్లల అభివృద్ధికి క్రమశిక్షణ పునాది అని వారు అభిప్రాయపడ్డారు. 37 శాతం ప్రజలు మాత్రం పిల్లలు తామెంచుకున్న రంగాల్లో చెరగని ముద్ర వేయడానికి సృజనాత్మకతే ముఖ్యమని, ఉపాధ్యాయులు దీనిపైనే దృష్టి పెట్టాలని అంటున్నారు.
అయితే బ్రిటన్‌లో ఉన్న ఈ ధోరణి... తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు దగ్గరగా ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. కెన్యా, నైజీరియాలో సైతం ఇలాంటి అభిప్రాయమే ఉందని, అక్కడ కూడా ప్రజలు పిల్లల్లో క్రియేటివిటీ కన్నా క్రమశిక్షణే కోరుకుంటున్నారని ఈ సర్వే పేర్కొంది.
ఈ విషయంలో మన దేశ వైఖరి స్పెయిన్, గ్రీస్, జర్మనీకి దగ్గరలో ఉంది. భారత్‌లో 43 శాతం మంది సృజనాత్మకతే తొలి ప్రాధాన్యమని అంటుంటే క్రమశిక్షణకే తమ ఓటని 29 శాతం మంది అంటున్నారు.
అయితే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు మాత్రం తటస్థ అభిప్రాయంతో ఉన్నాయి. ఆ దేశాలు తమ పిల్లలకూ రెండూ ముఖ్యమేనని పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, అమెరికాల్లో ఏమనుకుంటున్నారంటే..
చైనాలో ప్రజలు విద్య అంటేనే క్రమశిక్షణ, సృజనాత్మకతల కలయిక అని, ఈ రెండూ వేరుచేయలేమని అన్నారు.
ప్యూ రీసెర్చ్ గ్రూప్ ఈ సర్వేలో విద్యా విధానంపై ప్రజాభిప్రాయాన్ని పరీక్షించే ప్రయత్నం కూడా చేసింది. ఇందులో భాగంగా విద్యపై ఉదారవాద, మితవాద అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశంపై కూడా అధ్యయనం చేసింది.
ఈ సర్వేలో పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాలో విద్యాపరమైన ప్రాధాన్యత "సైద్ధాంతిక అంశమని" విశ్లేషకులు పేర్కొన్నారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వామపక్ష, మితవాద భావజాలాలు కలిగి ఉన్న ప్రజలు "విద్య" పై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
అమెరికాలో ఉన్నత విద్యతో విద్యార్థుల వైఖరి ఎలా మారుతుందనే అంశంపై కూడా ప్యూ రీసెర్చ్ గ్రూప్ సర్వే జరిపింది. దేశ అభివృద్ధిలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల పాత్రపై రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మధ్య అభిప్రాయాల్లో స్పష్టమైన తేడా కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘విద్య అంటే వ్యక్తిగత అభివృద్ధి’
రిపబ్లికన్లు ఉన్నత విద్య పై తీవ్రమైన సందేహాలు కలిగి ఉన్నారు. ప్యూ రిపోర్ట్ ప్రకారం 58 శాతం రిపబ్లికన్లు "కళాశాలలు, విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్న పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి" అని అన్నారు.
డెమోక్రాట్లు దీనికి విరుద్ధంగా స్పందించారు. 72 శాతం డెమోక్రాట్లు ఉన్నత విద్యతో అమెరికాలో "సానుకూల ప్రభావం" వచ్చిందని అన్నారు.
ఉన్నత విద్య వల్ల కలిగే ప్రయోజనం గురించి కూడా వీరిద్దరి మధ్య తేడా కనిపించింది. చాలామంది రిపబ్లికన్లు నైపుణ్యాన్ని పొందడమే విద్య లక్ష్యమని తెలిపారు. మరోవైపు డెమొక్రాట్లు విద్య అంటే "వ్యక్తిగత అభివృద్ధి" అనే ఆలోచనకు దగ్గరలో కనిపించారు.
అంతర్జాతీయంగా విద్యకు నిధుల కేటాయింపు, ప్రజావసరాలకు నిధుల కేటాయింపులపై కూడా గణాంకాలను ప్రచురించింది.
యూరోస్టాట్ డేటా ప్రకారం యూరోపియన్ యూనియన్ సభ్యులు ప్రత్యేకించి డెన్మార్క్, స్వీడన్, ఐస్లాండ్ వంటి దేశాలు విద్యా వ్యవస్థపై అత్యధికంగా నిధులు కేటాయిస్తాయని తెలిపింది. విద్యను ఆ దేశాలు జాతీయ సంపదగా భావిస్తాయని యూరోస్టాట్ డేటా వెల్లడించింది.
ఫిన్లాండ్, బెల్జియం, ఎస్టోనియా, లాత్వియా వంటి దేశాలు కూడా విద్యకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తాయని, బ్రిటన్ మాత్రం యూరోపియన్ యూనియన్ సగటుకు దగ్గరలో విద్యపై నిధులు ఖర్చు చేస్తోందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతేకాకుండా ఈ రిపోర్ట్‌లో ఏఏ దేశాలు జీడీపీలో ఎంత మొత్తం విద్యపై నిధులు ఖర్చు చేస్తున్నాయనే వివరాలు కూడా వెల్లడయ్యాయి.
డెన్మార్క్‌లో పాఠశాలలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రథమ స్ధానం ఉంటుందని, లా అండ్ ఆర్డర్, పోలీసింగ్‌కు చివరి స్థానం ఉంటుందని ఈ రిపోర్ట్ తెలిపింది. కానీ రుమేనియా దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగం లా అండ్ ఆర్డర్‌కే ఉంటుందని, కనిష్ఠంగా విద్యపై కేయాయింపులుంటాయని ఈ రిపోర్ట్ తెలిపింది.
విద్యా వ్యవస్థ రాబోయే కాలంలో కూడా రాజకీయాలకు, ప్రాధాన్యాలకు మధ్యన విస్తృత వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?
- పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- కాలేజీలను తిట్టడం సరే, తల్లిదండ్రులుగా మనమేం చేస్తున్నాం?
- తల్లిదండ్రుల ఆశలు, అంచనాలు.. పిల్లలను ఏకాకులను చేస్తున్నాయా?
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








