తల్లిదండ్రుల ఆశలు, అంచనాలు.. పిల్లలను ఏకాకులను చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాథరీన్ సెల్‌గ్రెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మన చుట్టూ ఎన్నో కోరికలు అల్లుకుని ఉంటాయి, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అందువల్ల ఏదైనా పనిలో మనం విఫలమైతే ఎలా?''
''నా పరీక్షల ఫలితాలు నేను అనుకున్నంత బాగా రాలేదు. పెద్ద ఫుట్ బాల్ ప్లేయర్ అవుతానని, డాక్టర్ అవుతానని - వాళ్లు పెట్టుకున్న కోరికలు నిజం కాలేదు.''
యువతలో ఒంటరితనంపై నిర్వహించిన ఒక పరిశోధనలో యువతీయువకులు తమపై ఉన్న ఒత్తిడి గురించి వెల్లడించిన విషయాలివి.
మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, మరో ఛారిటీ సంస్థ కలిసి నిర్వహించిన పరిశోధనలో - పెద్దల అంచనాలను అందుకోలేకపోయినప్పుడు యువత ఎలా ఒంటరి అయిపోతారో, ఆందోళన చెందుతారో వెల్లడించింది.
విద్య, కెరీర్ విషయంలో తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తామేమో అనే భావన నుంచే ఈ ఒంటరితనం, న్యూనత బయలుదేరుతుంది.
ఈ పరిశోధనలో 14-25 ఏళ్ల మధ్య ఉన్న భిన్నమైన నేపథ్యాలకు చెందిన 140 మంది యువతీయువకులను పరిశీలించారు.
ఈ పరిశోధన - జీవితంలో విఫలం అవుతామనే భయం, ఇతరులను నిరాశపర్చుతామనే భావన యువతను ఎంత ఒత్తిడిలోకి నెడతాయో తెలిపింది.
''సంతోషంగా ఉండాలని, విజయాలు సాధించాలని భావించే ఈ ప్రపంచంలో, ఒంటరితనం అనేది ఒక సిగ్గుపడే విషయంగా, మరకగా భావిస్తారు'' అని పరిశోధకులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'నేను ఇప్పటికీ ఒంటరినే అనిపిస్తుంది'
ఈ పరిశోధనలో సోషల్ మీడియా 'ఎంతో ఆసక్తికరంగా, ఇతరులు ఈర్ష్య చెందేలా జీవితాన్ని గడుపుతున్నట్లు నిరంతరం ఒత్తిడి పెడుతుంటుంది' అని గుర్తించారు.
21 ఏళ్ల యువతి పరిశోధకులకు, ''సోషల్ మీడియా నిజానికి సోషల్ ఒత్తిడిగా మారింది. దానిలో నకిలీ ఆనందాన్ని పోస్ట్ చేస్తున్నారు'' అని తెలిపారు.
''ఆన్‌లైన్‌లో ఒక చేతిలో డ్రింక్‌తో సంతోషంగా కనిపించాలి. 'నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను' అనలేం కదా?''
''కొన్నిసార్లు నేను చేయాల్సినవన్నీ చేసి, నా కుటుంబం సంతోషపడేట్లు చేసినా, ఇంకా అసంతృప్తితోనే ఉంటాను. నేనింకా ఒంటరినే అనిపిస్తుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విజయం, సంపద, ఆనందమే పరమావధి
మరో యువకుడు, ''నేను యూనివర్సిటీలో చేరాలనుకున్నా, అది కుదర్లేదు. ఇప్పుడు మా ఊరికి వెళ్లడం నాకిష్టం లేదు. ఇక్కడేవేవో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నా, దాని వల్ల పెద్దగా సంపాదనేం లేదు. కొన్నిసార్లు నేను విఫలమయ్యానేమో అనిపిస్తుంది. కానీ ఇదంతా నా కుటుంబానికి తెలీడం నాకిష్టం లేదు'' అని తెలిపారు.
మరో 23 ఏళ్ల యువకుడు, ''30 ఏళ్లు వచ్చేసరికల్లా, నాకో మంచి ఇల్లు, హోదా ఉంటుందని అనుకునే వాణ్ని. కానీ వయసు మీద పడుతున్నా నాకవన్నీ లభ్యం అవుతాయని అనిపించడంలేదు. నాకింత వరకు కెరీర్ లేదు. నేను సమయాన్ని వృధా చేస్తున్నానేమో అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకు నేను సరైన దిశలో వెళ్లడం లేదు?'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశోధకులు విడుదల చేసిన ఈ నివేదిక ''పాఠశాలల్లో చెప్పే- సాధికారత, కష్టించి పని చేసే తత్వం, లక్ష్యం, సొంత కాళ్లపై నిలబడాలి.. ఇలాంటి ఉపదేశాలన్నిటిపై చర్చ జరగాలి'' అని అభిప్రాయపడింది.
మీడియాలో జరుగుతున్న చర్చలు.. వ్యక్తిగత కృషి మీద కాకుండా, విజయం మీద, సంపద మీద, ఆనందమే పరమావధిగా జరుగుతున్నాయని ఈ నివేదిక అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








