సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!

ఫొటో సోర్స్, Getty Images
గతంలో సిమ్ కార్డులు పెద్దగా ఉండేవి. క్రమంగా వాటి పరిమాణం తగ్గి నానో సిమ్‌లు వచ్చాయి.
ఇప్పుడు కొత్తగా ఇ-సిమ్‌లు వస్తున్నాయి. ఇవి నానో సిమ్ కంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి.
కానీ భవిష్యత్‌లో ఐ సిమ్ రాబోతోంది. ఏఆర్‌ఏం సంస్థ దాన్ని ఇటీవలే ఆవిష్కరించింది.
ఐ సిమ్ అందరికీ అందుబాటులోకి వస్తే సంప్రదాయ సిమ్‌లకు కాలం చెల్లినట్లేనని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సంప్రదాయ సిమ్‌కార్డులకు ప్రత్యామ్నాయం!
స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణం మరింత తగ్గించేందుకు తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
కానీ కొన్ని సవాళ్లను అవి దాటలేకపోతున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ, సిమ్‌కార్డు స్లాట్‌లు అధిక స్థలాన్ని ఆక్రమిస్తున్నాయి.
ఈ సమస్యకు ఏఆర్‌ఏం సంస్థ ఒక కొత్త తరహా పరిష్కారం చూపిస్తోంది.
ఎలాంటి స్లాట్ అవసరం లేని సిమ్‌కార్డును తయారు చేసింది.
దీన్ని ఐ-సిమ్‌గా పిలుస్తున్నారు.
ప్రపంచంలోని దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఈ సంస్థ చిప్‌లను తయారు చేస్తోంది.

ఫొటో సోర్స్, Thinkstock
అసలు ఐ సిమ్ అంటే ఏమిటి?
సిమ్ కార్డుతో చేసే అన్ని పనులను ఐ సిమ్‌తో చేసుకోవచ్చు.
ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్ పంపించొచ్చు. డేటా వాడుకోవచ్చు. ఇతర అన్ని సేవలూ పొందవచ్చు.
నానో, ఇ సిమ్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సిమ్ స్లాట్‌లో వేసుకోవాల్సి ఉంటుంది.
కానీ ఐ సిమ్‌కు అలాంటి అవసరం ఉండదు. ఐ సిమ్ డీఫాల్ట్‌గా సెల్‌ఫోన్‌లో ఉండే చిప్‌లోనే ఉంటుంది.
ప్రాసెసర్‌లో ఉండే దీన్ని ఎస్‌ఓసీ అంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు సిమ్ పని చేసేలా చేస్తాయి. దీనికి ప్రత్యేకంగా సిమ్ స్లాట్ అవసరం లేదు.
అయితే, సిమ్‌కార్డు పూర్తిగా అదృశ్యం అవుతుందని కాదు. కానీ స్మార్ట్‌ఫోన్ చిప్‌లోనే దాన్ని ఏర్పాటు చేస్తారు.
ఐ సిమ్ ఎంత పరిమాణంలో ఉంటుందో ఇప్పటి వరకైతే కచ్చితంగా తెలియదు.
కానీ ఒక చదరపు మిల్లీ మీటర్ కంటే చిన్నగా ఉంటుందని కేంబ్రిడ్జికి చెందిన సంస్థ అంచనా వేస్తోంది.


ఐ సిమ్ ఉపయోగాలు ఏంటి?
ఐ సిమ్ వల్ల సిమ్‌కార్డు పోతుందనే భయం ఉండదు.
స్క్రాచ్‌పడి పనికిరాకుండా పోతుందన్న ఆందోళన ఉండదు. ఎందుకంటే ఐ సిమ్ స్మార్ట్‌ఫోన్ చిప్‌లోనే ఉంటుంది.
ఐ సిమ్ వల్ల ప్రత్యేకంగా ఫోన్‌లో స్లాట్ అవసరం ఉండదు.
అంతేకాదు, తయారీ ఖర్చు కూడా తక్కువేనని ఏఆర్ఎం సంస్థ చెబుతోంది.
ఇతర సిమ్‌కార్డుల మాదిరిగానే ఐ సిమ్‌లోనూ ఒక మొబైల్ నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కి మారొచ్చు.
ఐ సిమ్‌ను ఒక్క సెల్‌ఫోన్‌లోనే కాదు.. ఇంటర్నెట్‌తో అనుసంధానించే ఇతర పరికరాల్లో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT) కూడా దీన్ని వాడొచ్చు.
నెట్‌వర్క్‌తో అనుసంధానించే వైర్‌లెస్ పరికరాల్లో వాడొచ్చు. ఉదాహరణకు సెన్సర్లు, అప్లికేషన్లు మొదలైనవి.

ఫొటో సోర్స్, Getty Images
ఐ సిమ్‌కు టెలిఫోన్ ఆపరేటర్లు అంగీకరిస్తారా?
క్వాల్‌కమ్, మీడియా టెక్ వంటి చిప్ తయారీ సంస్థలు ఐ సిమ్‌ను తమ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో చేర్చడంపై పరిశోధనలు చేస్తున్నాయి.
ఈ ఏడాది చివరి కల్లా దీని వినియోగం మరింత పెరుగుతుందని ఏఆర్ఎం సంస్థ అంచనా వేస్తోంది.
అయితే, ఐ సిమ్‌ను టెలిఫోన్ ఆపరేటర్లు అంగీకరిస్తారా లేదా అన్నది సందేహమే.
ఇప్పటికే నానో సిమ్‌కు ప్రత్యామ్నాయంగా ఇ సిమ్ అందుబాటులోకి వచ్చింది. కానీ టెలికం ఇండస్ట్రీ నుంచి ఇ సిమ్‌కి పెద్దగా ఆదరణ లభించడం లేదు.
అయితే, ఐ సిమ్ ఆదరణ పొందడానికి కొంత సమయం పడుతుందని ది వెర్జ్ మ్యాగజీన్ ఎడిటర్ జాకబ్ చెప్పారు.
2025 నాటికి 4400 మిలియన్ల పరికరాలు ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతాయని మెచినా రిసెర్చ్ సంస్థ నివేదిక చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?
- మే నెలలోపు కిమ్ జోంగ్ ఉన్ - డొనాల్డ్ ట్రంప్ భేటీ!!
- సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యానికి ముప్పుందా?
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్'లు.. ఓ అంతర్జాతీయ సమస్య!
- ఫేస్బుక్లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
- 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్‌ల అమ్మకాలు బంద్
- వైన్‌తో ‘దంత సమస్యలు దూరం’!
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.










