ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?

ఫొటో సోర్స్, Getty Images/SpecialStatusCampaign/tdp.ncbn
- రచయిత, జి ఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
చంద్రబాబు నిర్ణయం అంత సంచలనమేమీ కలిగించలేదు. రేపో మాపో అనే భావన ఇప్పటికే స్థిరపడిపోయి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఢిల్లీలో గానీ పెద్ద హడావుడి ఏమీ లేదు. అటు బిజెపి ఇటు తెలుగుదేశం ఈ పరిణామానికి పూర్తిగా సన్నద్ధమయ్యే ఉన్నాయి. కేంద్రంలో బిజెపికి కానీ, రాష్ర్టంలో తెలుగుదేశానికి కానీ హఠాత్తుగా వాటిల్లే నష్టం ఏమీలేదు.
ఇంకా కొనసాగడం వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవడానికి తప్పితే ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేశాం అనే కొత్త మైలేజ్ చంద్రబాబు ఎంత పొందగలరనేది వేయి వరహాల ప్రశ్న.
ముందస్తు ఎన్నికలొస్తాయా, రావా? ఈ పరిస్థితుల్లో బిజెపి వైసిపిలు చేతులు కలపగలవా? ఒక వేళ కలపాలనుకున్నా బహిరంగంగా పొత్తు పెట్టుకునేంత దూరం వెడతాయా, లేక ఇంకేదైనా మార్గంలో మిత్రబంధం ఉంటుందా? పవన్ కల్యాణ్ దిశ దశ ఏమిటి? కర్నాటక ఎన్నికల ఫలితాలు రాష్ర్ట రాజకీయాల్లో పొత్తులను ఎంతవరకు ప్రభావితం చేయబోతున్నాయి? అనేవి ఇవాళ మిగిలిన ఆసక్తికరమైన ప్రశ్నలు.
హోదా ఈ రాజకీయ సుడిగుండంలో వారి వారి అవసరాల మేరకు ఉపయోగపడుతున్న అస్త్రం మాత్రమే.
తమ రాజకీయ వ్యూహాలను దాటుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగా హోదా గురించి ఇతర హామీల అమలు గురించి ఒక్కతాటి మీదకు రాగలవా అనే ప్రశ్న కూడా వేసుకోవచ్చును. కానీ అలాంటివాటికి మన రాజకీయాల్లో తావు తక్కువ.
ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి
ప్రత్యేక హోదా రాజకీయ వివాదంగా మారి చాలా కాలమే అయ్యింది. అదొక భావోద్వేగపరమైన అంశంగా మారిపోయింది. దాని ఆరంభమే చిత్రంగా సాగింది. . అది చట్టంలో పొందుపర్చలేదు. చివరి నిముషంలో రాయబారాల ఫలితంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఇచ్చిన హామీ అది . చట్టబద్ధత ఉంటుందా లేదా అనే సాంకేతికాంశం వదిలేస్తే అది పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాని కొత్త రాష్ట్రానికి ఇచ్చిన హామీ. కొత్త రాష్ట్రం అని సాంకేతికంగా తెలంగాణను పిలిచినప్పటికీ ప్రాక్టికల్ అర్థంలో ఇంకా బాలారిష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ర్టం అవుతుంది.
బిజెపి కూడా ప్రత్యేక హోదాను బలపరిచింది. ఒక అడుగు ముందుకేసి పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాల్సిందే అని సభలో పట్టుబట్టారు కూడా. కమలనాథులు పగ్గాలు చేపట్టాక స్వరంలో మార్పొచ్చింది. విభజన చట్టంలో పొందుపర్చినవాటినన్నింటినీ అమలు పరుస్తాం, కట్టుబడి ఉన్నాం అని డిప్లమాటిక్ భాషలోకి దిగడం అలవాటుగా మారింది. . ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అయితే ఒక ప్రభుత్వం సభలో ఇచ్చిన హామీని, (అందునా తాము కూడా మద్దతిచ్చిన హామీని) నిలబెట్టుకునే బాధ్యత తర్వాతి ప్రభుత్వం మీద ఉండదా అనే ప్రశ్నకు మోదీ- జైట్లీ ద్వయం జవాబు చెప్పాల్సి ఉంది.
హోదా హామీతో పాటు రైల్వేజోన్ ఏర్పాటును సానుకూలంగా పరిశీలిస్తాం అని ఆ పరిస్థితుల్లో చెప్పాక, ఎన్నికల మానిఫెస్టోలో పెట్టాక జనం ఆశిస్తారు- నమ్మకం పెట్టుకుంటారు అనేది సీనియర్ నాయకులకు చెప్పాల్సిన పనిలేదు. ఏం చేసినా బిజెపి ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనాలు పొందలేదు కాబట్టి రాజకీయ దృష్టితోనే హామీలను అమలు చేయట్లేదు అనే భావన బలపడితే అది ఫెడరల్ వ్యవస్థకు శోభస్కరం కాదు.
ఇస్తే అడ్డుకునేదెవరు?
ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలి అని గట్టిగట్టిగా సభలో ఎందుకు అరిచానా అని తర్వాత తల పట్టుకోవాల్సిన స్థితి వెంకయ్యనాయుడిది. కలుపుగోలుతనంతో ఎవ్వరిమీద పరుషంగా మాట విసరకుండా తన మీద పరుషమైన మాట పడకుండా కాపాడుకుంటూ వచ్చే వెంకయ్యనాయుడు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పరుషమైన దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రత్యేక హోదా ఫలానా ఫలానా నిర్దుష్ట లక్షణాలున్న అత్యంత వెనుకబడిన రాష్ట్రాలకు ఇస్తారు అని జైట్లీ పదే పదే నొక్కి చెప్పనక్కర్లేదు. వేరే రాష్ట్రాలు కూడా అదే అడుగుతాయి అనేది కూడా సరైన కారణం అనిపించుకోదు. వాస్తవానికి మామూలు పరిస్థితుల్లో అయితే ప్రత్యేక హోదాకు అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేని మాట వాస్తవం.
ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని లేని రాష్ట్రం ఏర్పడుతున్నది కాబట్టి అప్పటి ప్రభుత్వం సభలో ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రకు హోదా ప్రకటించారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తర్వాత ప్రభుత్వంపై ఉంటుందని సమర్థించుకోలేనంత వాదనా పటిమ లేని వ్యక్తిగా జైట్లీని భావించలేం. ఇవ్వాలనుకుంటే కేంద్రాన్ని అడ్డుకునే వారు ఎవరూ లేరు.

ఫొటో సోర్స్, Tdp.ncbn/YSJagan/Janasena
తాకట్టు.. కనికట్టు
ప్రత్యేక హోదా సాధ్యం కాదు, 14వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది అని కేంద్రం ప్రత్యేక హోదాకు సాంకేతిక సమాధి కట్టాక జరిగిన పరిణామాలు ఆసక్తికరమైనవి. తెలుగుదేశం ప్రత్యర్థి వైసీపీ దాన్నే అస్త్రంగా మల్చుకుని జనంలో పర్యటిస్తున్నది.
హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తాం అని ప్రకటించాక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. పార్టీ నేతలు కూడా ఈ విషయంలో బిజెపి మీద విమర్శలు చేయకుండా కట్టడి చేశారు. ఆ క్రమంలో తెలుగు మీడియాలో ప్యాకేజీకి అనుకూలంగా కథనాలు వ్యాసాలు వెలువడ్డాయి. హోదా కంటే ప్యాకేజే మెరుగని విశ్లేషణలొచ్చాయి.
మరి ఏ ప్రత్యేక ప్రయోజనాలూ లేకపోతే ఎందుకు అంత పెద్ద విషయంగా ఉండింది, మధ్యలో ఎలా ప్రయోజనం కాకుండా పోయింది, మళ్లీ ఇపుడెలా పెద్ద విషయంగా మారింది అనే సందేహాలు కొందరిలోనైనా కలగడం సహజం.
తెలుగుదేశం తన రాజకీయ అవసరాల కోసం మెతక వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని జగన్ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ వస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పైన ప్రత్యేకించి విమర్శలు చేయకపోయినా చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పేరుతో తమ వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.
పవన్ కల్యాణ్ ప్రవేశంతో పెరిగిన ఒత్తిడి
వీటన్నింటిని మించి ప్రత్యేక హోదానే తన రాజకీయపు తొలి అడుగుకు మెట్టుగా మార్చుకున్నారు పవన్ కల్యాణ్. రాజకీయంగా ఆయన వ్యాఖ్యానాల పట్ల ఎవరికి ఏ అభిప్రాయమైనా ఉండొచ్చు గానీ ఆయన ప్రభావం పూర్తిగా తోసిపుచ్చలేనిది. పైగా ఆయన తీసుకున్న వైఖరి, వివిధ రంగాల నిపుణులతో అధ్యయనం కోసం కమిటీ ఏర్పరచిన తీరు తీసిపారేయలేనివి.
ఇటీవల జగన్ మోహన్ రెడ్డికి ఆయన ఒక సవాల్ విసిరారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి, దేశవ్యాప్తంగా తిరిగి మద్దతు కూడకడతా అన్నారు. అనూహ్యంగా జగన్ దాన్ని అందిపుచ్చుకున్నారు. అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
సిబిఐ కేసుల్నుంచి బయట పడ్డం కోసం బిజెపితో రహస్య మైత్రి నెరుపుతున్నారు అనే తెలుగుదేశం ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఇదొక అస్ర్తంగా ఉపయోగించుకోవచ్చు అని జగన్ భావించినట్టు అర్థమవుతోంది. ఇలాంటి పరిణామాలు తెలుగుదేశంపై ఒత్తిడి పెంచినట్టు కనిపిస్తున్నది.
ఇద్దరూ కలిసి జనంలో ఆశలు పెంచారు
ఇంకోవైపు చూస్తే ప్రత్యేక హోదా, రాజధాని రెండు విషయాల్లోనూ అంచనాలను చేరలేకపోతే ఎదురయ్యే అసంతృప్తిని ఎదుర్కోవడానికి తెలుగుదేశానికి ఒక అస్ర్తం కావాలి. కాబట్టి ఎపుడో ఒకప్పుడు బిజెపితో తెగదెంపులు చేసుకుని అసంతృప్తిని అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తుందనేది బహిరంగ రహస్యంగా అందరినోటా ఉన్నది.
బహుశా ఇక ముందు తెలుగుదేశం నేతల్లో ఆధ్యాత్మిక ప్రదర్శన తగ్గొచ్చు. వామపక్షాలతో ఉన్నప్పుడు ‘కామ్రేడ్స్’గానూ, బీజేపీతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక బృందంగానూ కనిపించగల పాదరస లక్షణం తెలుగుదేశానికి ఉంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం-వైసీపి హోరాహోరీగా తలపడ్డాయి. రైతు, డ్వాక్రా రుణమాఫీతో పాటు మోదీ, పవన్ కల్యాణ్ ల దోస్తీ చంద్రబాబుకు కలిసొచ్చింది. లేకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. బిజెపికి ఆంధ్రలో అంతగా బలం లేనప్పటికీ అప్పటికి మోదీ ఇమేజ్ తారాజువ్వలాగా ఉన్నది. జన సామాన్యంలో, ముఖ్యంగా యువతలో సినీ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రచారం మరింత ఉపయోగపడింది.
పోటీ తీవ్రత వల్లనో ఏమో కానీ జనాన్ని తమవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు-మోదీ ద్వయం అంచనాలను విపరీతంగా పెంచేసింది. మోదీ అంతటి మనిషి ఏకంగా ఢిల్లీని మించిన రాజధానిని తెలుగువారికి కట్టిస్తాం అని సభా ముఖంగా హామీ ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పదేళ్లు ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజిని కూడా బిజెపి తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అందరూ కలిసి జనంలో ఆశలను అమాంతంగా పెంచారు.

ఫొటో సోర్స్, DrSivaPrasad/YsAvinashYouth/FB
సగం గ్లాసు.. ఎలా చూస్తావు?
ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా అని అనుమానం వచ్చే స్థాయిలో అనేక అద్భుతమైన అందమైన ఫోటోషాప్ నగరాలను రాజధాని నమూనాగా చంద్రబాబు చూపిస్తూ వచ్చారు. నాలుగేళ్లలో జరిగిన ప్రగతి దానికి దీటుగా ఉందా అనేది ఒక ప్రశ్న.
సానుకూలంగా చూసేవారు అమరావతిలో అక్కడక్కడా సాగుతున్న నిర్మాణాలను, రోడ్డుకు అటూ ఇటూ ఎదుగుతున్న మొక్కలను చూపిస్తారు. ప్రతికూలంగా చూసేవారు ఇంకో రకంగా వాదిస్తారు. ఈ వేగంతో సాగితే మీరు బొమ్మల్లో చూపించిన రాజధాని నిర్మాణం జరిగే మాటేనా అని ప్రశ్నిస్తారు. ఇదంతా సగం నిండిన గ్లాసును ఎలా చూస్తావు అన్నట్టు ఉంటుంది.
కర్మాగారాల స్థాపన, ఉద్యోగ కల్పన అంచనాలకు తగ్గట్టు ఉన్నదా అనేది మరో ప్రశ్న. ఎన్నికల సమయంలో పెంచిన అంచనాలను అందుకోవడం సులభం కాదు. చేయగలిగినంత చేశాం కేంద్రం సహకరించకపోవడం వల్లే అనుకున్నవన్నీ చేయలేకపోయాం అని ఇపుడు తెలుగుదేశం వాదించగలదు.
సమైక్య ఉద్యమం పేరుతో సాగిన దృశ్యాలేనా..మార్పేమైనా ఉంటుందా?
వాస్తవానికి మెతకవైఖరితో రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అని జగన్ విమర్శించినపుడల్లా స్నేహంగా ఉంటూ రాష్ర్టానికి రావాల్సినవి రాబట్టుకోవడం తన వైఖరి అని చంద్రబాబు లాజికల్ వాదన ముందుపెడుతూ వచ్చారు. ఇవాళ హఠాత్తుగా ఏమైందని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్న ఎదురవుతుంది.
అలాగే హోదా వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు, ప్యాకేజే మేలు అని అపుడెందుకు అన్నారు, ఇవాళ మళ్లీ హోదా కోసం ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది? రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన చంద్రబాబు దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతారన్నది ఆసక్తికరం. వైసిపి నిజంగా అవిశ్వాసం పెడితే తెలుగుదేశం ఏ వైఖరి తీసుకుంటుంది అనేది మరో ఆసక్తికరమైన అంశం.
నాలుగైదేళ్ల క్రితం సమైక్య వాదులు ఆచరణాత్మకమైన వైఖరి తీసుకోకుండా జనాల్ని మభ్యపుచ్చుతూ రోజువారీగా ధర్నాలు నిరసనల పేరుతో నష్టం చేశారనే మాట ఆంధ్రలో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మళ్లీ అవే సీన్లు అంతటా కొంతకాలంగా కనిపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఆవరణలో అయితే మరీనూ. ప్రత్యేకహోదా కూడా అలాంటిదేనా, భిన్నంగా ఏమైనా ఉంటుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ!
ఇవి కూడా చదవండి:
- ‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’
- హోదా కోసమా? మైలేజీ కోసమా? ఏం జరుగుతోంది?
- అభిప్రాయం: హోదా దారెటు? టీడీపీ పయనమెటు?
- పవన్ కల్యాణ్: 'ఎన్నికల్లో నన్ను వాడుకుని వదిలేశారు'
- విభజన హామీల సాధనకు జేఏసీ ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్
- ఎడిటర్స్ కామెంట్: చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- సైకోలే సరైన నాయకులా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








