ప్రత్యేక హోదా: 5 కీలక పరిణామాలు

ఫొటో సోర్స్, NOAH SEELAM
ప్రత్యేక హోదా.. ఏపీ హక్కు: చంద్రబాబు (బుధవారం మధ్యాహ్నం)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వ హామీల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు.
14వ ఆర్థిక సంఘం పేర్కొన్న అవరోధాలను దృష్టిలో ఉంచుకుని ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తామని గతంలో అరుణ్ జైట్లీ చెప్పారు కానీ, దాన్ని అమలు చేయడం లేదని ఆయన అన్నారు.
పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న బీజేపీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పారు.
ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని దాన్ని కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, JIM WATSON
అసలు ప్రత్యేక హోదానే లేదు: జైట్లీ (బుధవారం సాయంత్రం )
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందని బుధవారం అసెంబ్లీలో చెప్పగా.. సాయంత్రం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అసలు ప్రత్యేక హోదా అనేదే ఇప్పుడు లేదని స్పష్టం చేశారు.
గతంలో ప్రత్యేక హోదా అనేది ఈశాన్య.. మూడు పర్వత ప్రాంత రాష్ర్టాలకు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు.
వాటికి తగిన రాబడి లేనందువల్లే అలా చేశారన్నారు. తర్వాత ప్రత్యేక హోదా అనే అంశమే లేదని తేల్చి చెప్పారు.
ప్రత్యేక హోదాకన్నా అధిక ప్రయోజనాలను ఏపీకి కల్పిస్తామని అన్నారు. రెవెన్యూ లోటును పూడ్చాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఆందోళనలతో అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

ఫొటో సోర్స్, facebook/tdp
టీడీపీ మంత్రుల రాజీనామా ప్రకటన (బుధవారం రాత్రి 10.30 గం.)
ప్రత్యేక హోదా అనేదే లేదని అరుణ్ జైట్లీ మాట్లాడటంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
కేంద్ర మంత్రివర్గం నుంచి తాము వైదొలుగుతున్నట్లు టీడీపీ ప్రకటించింది. పార్టీకి చెందిన కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామాలు చేస్తారని చంద్రబాబు మీడియాకు తెలిపారు.
అయితే, ప్రస్తుతానికి ఎన్డీయేలోనే ఉంటామని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, facebook/bjp
బీజేపీ మంత్రుల రాజీనామా (గురువారం ఉదయం)
టీడీపీ కేంద్రమంత్రి వర్గం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఏపీ మంత్రివర్గంలో ఉన్న బీజేపీ కూడా అదే నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్ సమావేశాలు జరగుతున్న సమయంలో కేబినెట్ సమావేశాలకు ఆ పార్టీ కి చెందిన ఇద్దరు మంత్రులు హాజరుకాలేదు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి బీజేపీకి చెందిన మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు రాజీనామాలు చేశారు.
ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసిన రాజీనామా లేఖలను అందజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
టీడీపీ వై.ఎస్. జగన్ సవాల్ (గురువారం ఉదయం 9.15 గం. )
ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీడీపీ కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతిస్తుందని జగన్ అన్నారు.
మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమ పార్టీ నిర్ణయించిందని, టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపి, రాజీనామాలు చేస్తే కేంద్రం దిగొస్తుందని అన్నారు.
టీడీపీకి సమయం ఇవ్వడానికే 21వ తేదీన అవిశ్వాసం పెడుతున్నామని, అంతకంటే ముందు అయినా పెట్టడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి

ఇంకా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








