పెరియార్: విగ్రహాలు మన ఆలోచనలను ఏం చేస్తాయంటే..
త్రిపురలో బీజేపీ మద్దతుదారులు లెనిన్ విగ్రహాన్ని కూల్చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆ పార్టీ జాతీయ కార్యదర్శుల్లో ఒకరైన హెచ్.రాజా తన ఫేస్ బుక్ పేజీలో తమిళనాడులోని పెరియార్ విగ్రహాన్ని కూడా అదే విధంగా ధ్వంసం చేయాలని పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/DRAVIDARKAZHAGAM
దీనిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌తో పాటు అనేక మంది నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో రాజా - దానిని అడ్మిన్‌లు పోస్ట్ చేశారంటూ, ఆ పోస్టుపై విచారం వ్యక్తం చేశారు. ఆ అడ్మిన్‌ను తొలగించినట్లు కూడా తెలిపారు.
అయితే వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్‌లో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పెరియార్ విగ్రహం దెబ్బ తింది. దీనికి సంబంధించి పోలీసులు ముత్తురామన్ అనే వ్యక్తిని, స్థానిక బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వారిద్దరూ మద్యం సేవించి ఉన్నారు.
ఈ నేపథ్యంలో విగ్రహాల గురించి పెరియార్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు:
- పెరియార్ జనవరి 23, 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక సదస్సు నిర్వహించారు. ఆ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో హిందూ దేవతలను అవమానపరిచారంటూ పెరియార్ వ్యతిరేకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పెరియార్ చిత్రాలను పాదరక్షలతో కొట్టారు. వాటిని తగలబెట్టారు. దీనిపై ప్రతిస్పందిస్తూ పెరియార్ - కావాలంటే తన చిత్రాలను, పాదరక్షలను సగం ధరకే పంపిస్తానని ప్రకటించారు.
- అదే ఏడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరియార్‌కు చెందిన ద్రవిడ కజగం పార్టీ డీఎంకేకు మద్దతు తెలిపింది. హిందూ దేవుడైన రాముడి చిత్రపటాలను పాదరక్షలతో కొట్టిన ద్రవిడ కజగం డీఎంకేకు మద్దతు పలికిందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేశాయి. అయితే 1967 ఎన్నికల్లో 137 సీట్లతో గెలుపొందిన డీఎంకే, 1971 ఎన్నికలలో 184 సీట్లలో గెలుపొందింది.
- మే 24, 1969లో ధర్మపురిలో తన విగ్రహాన్ని నెలకొల్పడానికి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పెరియార్, ''విగ్రహాల స్థాపన, స్మారక స్థూపాల నిర్మాణం.. ఇవన్నీ గొప్పల కోసం కాదు, ప్రచారం కోసం. ఎవరో ఒకరు 'ఈ విగ్రహం ఎవరిది?' అని ప్రశ్నిస్తారు. ఇంకెవరో 'అది పెరియార్ విగ్రహం' అంటారు. దానికి ఆ మొదటి వ్యక్తి 'పెరియార్ ఎవరు?' అని ప్రశ్నిస్తారు. దానికి రెండో వ్యక్తి 'దేవుడు లేడని ప్రచారం ప్రారంభించిన వ్యక్తి' అని చెబుతాడు. అలా విగ్రహాలు మన ఆలోచనలు విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయి'' అని పేర్కొన్నారు.
- ''ఎవరైనా నా విగ్రహం నెలకొల్పితే, ఆ విగ్రహాన్ని పూజించడానికి పెట్టింది కాదు. అది ‘దేవుణ్ని నమ్మేవాడు ఒక మూర్ఖుడు, ఆటవికుడు’ అని ప్రచారం చేసే ఒక నాస్తికుడి విగ్రహం'' అని పెరియార్ ద్రవిడ కజగం 'విడుదలై' పత్రికలో జూన్ 9, 1969లో పేర్కొన్నారు.
- ''మేం చెప్పేదంతా గుడ్డిగా నమ్మమని మేం చెప్పడం లేదు. మీ సొంత జ్ఞానంతో దాని గురించి ఆలోచించండి. అది నిజమని మీకనిపిస్తేనే విశ్వసించండి, లేదంటే వద్దు. మేం చెప్పిందంతా విశ్వసించమని చెప్పడం లేదు'' అని పెరియార్ తంజావూర్‌లో తన 89వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




