త్రిపురలో హింస: సీపీఎం, బీజేపీ పరస్పర ఆరోపణలు

లెనిన్ విగ్రహం కూల్చివేత
ఫొటో క్యాప్షన్, బెలోనియాలో లెనిన్ విగ్రహం కూల్చివేత

బీజేపీ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు.

త్రిపురలో 25 ఏళ్ల సీపీఎం పాలన ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరిగింది.

ఒక ఎక్స్‌కవేటర్‌తో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినట్లు ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఈ ఎక్స్‌కవేటర్‌ను బీజేపీ కార్యకర్తలు అద్దెకు తీసుకున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

రాజధాని అగర్తలాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణం నడిబొడ్డున ఉన్న లెనిన్ విగ్రహాన్ని కూల్చేస్తున్నపుడు 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారు.

దాంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇప్పటివరకు నాలుగు చోట్ల హింస జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు.

త్రిపుర హింస

పశ్చిమ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ మిలింద్ రామ్‌టెక్.. హింస చోటు చేసుకున్న 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు.

ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ తమ పార్టీ కార్యాలయాలను, పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుందని వామపక్ష కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

సీపీఎం మాజీ ఎమ్మెల్యే జుము సర్కార్ - తమ బంధువులు ఎంతో మందికి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. ప్రతి రోజు తనకు బెదిరింపులు వస్తున్నాయని, పోలీసులు తమకు కల్పించిన భద్రతను ప్రభుత్వం తొలగించారని అన్నారు.

జుము సర్కార్ నివాసానికి కొద్ది దూరంలోనే ఉన్న ఆయన మ్దతుదారుల ఇళ్లను తగలబెట్టారు.

లంకమురా పంచాయత్‌లో సీపీఎం కార్యకర్త సుకుమార్ ఆచార్జీ ఇల్లు కూడా ఈ అల్లర్లలో కాలి బూడిదైంది.

త్రిపుర హింస

'ఆయుధాలు ధరించిన వాళ్లు దాడులు చేశారు'

ఫలితాలు వెలువడిన మరుసటి రోజే తన ఇంటిపై కొందరు సాయుధులు దాడులు చేశారని సుకుమార్ తెలిపారు.

''మా ఇంటిని మొత్తం తగలబెట్టారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు’' అని సుకుమార్ తెలిపారు.

ఈ పరిణామాలతో ఆయన కుటుంబం మొత్తం బెదిరిపోయింది. ఆయన భార్య శోభిత అక్కడి నుంచి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవాలనుకుంటున్నారు.

అయితే బీజేపీ మాత్రం ఇదంతా సీపీఎం వాళ్లే చేసుకుంటున్నారని అంటోంది.

''ఓటమి పాలయ్యాక, సీపీఎం వద్ద ఎలాంటి అంశాలూ లేవు. అందుకే మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు'' అని బీజేపీ కార్యకర్త సంజీబ్ దేబ్ తెలిపారు.

త్రిపుర హింస
ఫొటో క్యాప్షన్, బీజేపీ కార్యకర్త సంజీబ్ దేబ్

కానీ సుకుమార్ మాత్రం సీపీఎం కార్యకర్తలను ఆపి మరీ దాడి చేస్తున్నారని తెలిపారు.

తాము ముందుగా అనుమానించినట్లుగానే, త్రిపురలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నారని అన్నారు.

ప్రస్తుత పరిణామాలతో కలత చెందిన మాజీ ఎమ్మెల్యే జుము సర్కార్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)