ప్రెస్ రివ్యూ: అమెరికాలో భారత ఎంబసీ పేరిట భారీ మోసాలు

ఫొటో సోర్స్, Getty Images
భారత ఎంబసీ పేరిట భారీగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నారైల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. పలువురి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రాగా.. అత్యున్నత దర్యాప్తునకు భారత రాయబారి కార్యాలయం ఆదేశించినట్లు ఆ కథనం తెలిపింది.
‘సాక్షి’ కథనం ప్రకారం.. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం పేరిట కొందరు ఫేక్ కాల్స్ చేస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు. పాస్ పోర్టులో పోరపాట్లు ఉన్నాయని, వీసా ఫామ్స్, ఇమ్మిగ్రేషన్ ఫామ్‌లకు సంబంధించిన వ్యవహారాల పేరిట ఆ ఫోన్ కాల్స్ వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
మరికొందరి నుంచైతే క్రెడిట్ కార్డులకు సంబంధించిన విషయాలు కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తు దారులకు కూడా ఈ తరహా కాల్స్ వచ్చినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయం నంబర్ల నుంచే ఆ కాల్స్ రావటంతో బాధితులు కూడా అదంతా నిజమే అని నమ్మేశారు. వారు చెప్పినట్లు అకౌంట్‌లో డబ్బును జమ చేశారంట.
ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ విషయాన్ని యూఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అధికారులేవరూ వ్యక్తిగత సమాచారంపై అలాంటి ఫోన్లు చెయ్యరని.. అమెరికాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాధితులు డబ్బును జమ చేసిన అకౌంట్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఊడనున్న 1.78 లక్షల అధ్యాపక ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ కాలేజీల్లో పని చేస్తున్న 1.78 లక్షల మంది ఉద్యోగాలు ఊడే పరిస్థితి దాపురించిందని.. కారణం అధ్యాపక సిబ్బంది, విద్యార్థుల నిష్పత్తిని పెంచడమేనని ‘నవతెలంగాణ’ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ఇంజినీరింగ్, ఎంబీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో టీచర్ స్టూడెంట్ నిష్పత్తిని 1:15 నుంచి 1:20కి పెంచుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకున్నది.
బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులున్న ప్రయివేటు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీలకు ఈ నిబంధన వర్తించనున్నది. దీంతో పాటు డిప్లొమాలో 1:20గా ఉన్న అధ్యాపక విద్యార్థి నిష్పత్తిని 1:25కి పెంచారు.
కాగా.. ఏఐసీటీఈ తాజా నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ అధ్యాపకులు భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రయివేటు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (పీఈఐఈఏ) తమిళనాడు, మరికొందరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ఈనెల 9న విచారించే కోర్టు ధర్మాసనం అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని ఆధార్ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు: సీఐసీ
ప్రధాని నరేంద్రమోదీ ఆధార్, ఓటరు ఐడీ వివరాలను వెల్లడించలేమన్న ప్రధాని కార్యాలయం నిర్ణయాన్ని కేంద్ర సమాచార కమిషన్ సమర్థించినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ప్రధానితో రాష్ట్రపతి 'నరేంద్రమోదీ' పేరుతోనే ప్రమాణం చేయించారో లేదో తెలియజేయాలని సోని ఎస్ ఎరమత్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రధాని కార్యాలయాన్ని కోరారు. మోదీ ఆధార్ కార్డు, ఓటరు ఐడీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని కూడా కోరారు.
రాజ్యాంగంలోని నిబంధనల మేరకే ప్రమాణస్వీకారం జరిగిందని ప్రధాని కార్యాలయం తెలియజేసింది. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కుచట్టంలోని సెక్షన్ 8(1)(జే) ప్రకారం మినహాయింపు ఉందని ప్రధాని కార్యాలయంలోని కేంద్ర ప్రజా సమాచార అధికారి దరఖాస్తుదారుకు స్పష్టం చేశారు.
కోరిన సమాచారం వ్యక్తిగతమయినదై ఉండి, ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేనిదై ఉంటే ఈ సెక్షన్ కింద సమాచార వెల్లడికి మినహాయింపు ఉంటుంది. ప్రధాని కార్యాలయం స్పందన సంతృప్తికరంగా ఉందని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంజీఆర్‌లా పాలన అందిస్తా: రజనీకాంత్
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌లా మంచి పరిపాలనను అందిస్తానని సినీనటుడు రజనీకాంత్ చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యంతో తమిళనాట రాజకీయ వెలితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ కథనం పేర్కొంది.
‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. ప్రస్తుతం తమిళనాడుకు 'తలైవన్' కావాలని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంజీఆర్ విగ్రహాన్ని రజనీకాంత్ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జయలలిత అంటే తనకు భయం లేదని, ఆమె పరిపాలనా దక్షతపై గౌరవంతోనే అప్పుడు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
'ఇప్పుడు రాష్ట్రంలో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ నడుస్తోంది. సినీ పరిశ్రమే ఆయన పుట్టినిల్లు. ఈ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఎందుకు దూరంగా పెడుతోంది. సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదని అంటున్నారు. ఎక్కడెక్కడ తప్పు జరుగుతోందో, ఏం జరుగుతోందో నాకు తెలుసు. అందువల్లే నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను. అందరూ ఎంజీఆర్ కాలేరని అంటున్నారు? అవును, నిజంగానే ఎవరూ ఎంజీఆర్ కాలేరు. ఆయన ఒక యుగ పురుషుడు. మరో వెయ్యేళ్ల వరకు అటువంటి వ్యక్తి పుట్టడు. కానీ, ఎంజీఆర్ ఇచ్చిన మంచి పరిపాలనను ప్రజలకు అందించగలను' అన్నారు.
తమిళనాడులో ప్రాంతీయ భాషకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి తెలిసి కూడా రజనీకాంత్ ఆంగ్లానికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Sunny Leone/Instagram
సన్నీ లియోన్‌కు కవల పిల్లలు!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మరో ఇద్దరు పిల్లలకు అమ్మయిందని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులు.. ఇప్పుడు ఇద్దరు కవల మగ పిల్లలను తమ ఫ్యామిలీలోకి వెల్‌కమ్ చెప్పారని ఆ కథనం పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఇది గాడ్స్ ప్లాన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ చెప్పింది. ‘ఇంత తక్కువ టైమ్‌లో మా కుటుంబంలోకి ముగ్గురు పిల్లలు రావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో మా కుటుంబం పరిపూర్ణమైంది. మా ఈ ఇద్దరు కవల పిల్లలు కొన్ని వారాల కిందటే జన్మించారు. దేవుడు మాకు పెద్ద కుటుంబాన్నిచ్చాడు’ అంటూ సన్నీ తెగ మురిసిపోయింది.
అటు ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశాడు. గతేడాది జులైలో నిషా అనే ఓ చిన్నారిని ఈ కపుల్ దత్తతకు తీసుకుంది. అయితే ఈ పిల్లలు ఎవరు, ఎలా వచ్చారు అన్న అంశంపై మొదట్లో గందరగోళం ఏర్పడటంతో సన్నీ స్పందించింది. ఆ పిల్లలు సరోగసీ ద్వారా జన్మించినట్లు సన్నీ ట్విట్టర్‌లో చెప్పినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








