చలికాలంలో దాహంగా అనిపించడం లేదని నీళ్లు తాగకపోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా..

నీళ్లు, ఆరోగ్యం, మహిళలు, రక్తపోటు, చలికాలం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుభ్ రానా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేసవి తాపానికి, చెమటలకు తాళలేక ఎండాకాలంలో వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ వెంటే ఉంచుకుంటాం. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు, మార్గంమధ్యలో, తిరిగి వచ్చేటప్పుడు కూడా నీళ్లను తాగుతుంటాం.

కానీ శీతాకాలం వచ్చాక అంతా మారిపోతుంది. హాయిగా దుప్పటి కప్పుకుని వేడి టీ తాగుతూ వాటర్ బాటిల్‌ను కొంచెం దూరం పెడతాం.

శీతాకాలంలో దప్పిక ఎందుకు వేయదో ఎప్పుడన్నా గమనించారా? చలికాలంలో శరీరానికి ఎక్కువ నీళ్లు అవసరమని వైద్యులు చెబుతుంటారు. శీతాకాలంలో దాహం ఎందుకు తగ్గుతుంది? తక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? దీనివల్ల ఎవరిపై ఎక్కువ ప్రభావం పడుతుంది? పిల్లలా? వృద్ధులా?

ఈ సందేహాలకు సమాధానాల కోసం ఆరోగ్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నీళ్లు, ఆరోగ్యం, మహిళలు, రక్తపోటు, చలికాలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేసవిలోలానే చలికాలంలోనూ ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరానికి వేసవిలో ఎన్ని నీళ్లు అవసరమో చలికాలంలో కూడా అంతే...

"చల్లని వాతావరణంలో దాహం వేయడం బాగా తగ్గిపోతుంది. శీతాకాలంలో మనకు చెమట తక్కువగా పడుతుంది కాబట్టి శరీరానికి తక్కువ నీళ్లు అవసరమనుకుంటాం" అని దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ పులిన్ కుమార్ గుప్తా చెప్పారు.

"చాలా మంది ముఖ్యంగా వృద్ధులు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఎక్కువ నీళ్లు తాగితే తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తక్కువ నీళ్లు తాగుతారు."

"శరీరానికి వేసవిలో ఎన్ని నీళ్లు కావాలంలో శీతాకాలంలో కూడా అన్నే కావాలని శాస్త్రీయంగా నిరూపితమైంది. చలికాలంలో మూత్రపిండాలు మూత్రం ద్వారా ఎక్కువ నీటిని విసర్జిస్తాయి. అలాగే ఇళ్ళు ఆఫీసుల్లో హీటర్లు, డ్రయర్లు, వేడిని పెంచే ఇతర వ్యవస్థలు గాలిని చాలా పొడిగా చేస్తాయి. దీనివల్ల చర్మం, శ్వాస ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతాం.''

''వెచ్చని దుస్తులు ధరించడం వల్ల చెమట తక్కువగా అనిపించవచ్చు. కానీ కొద్దిగా అయినా చెమట పడుతూనే ఉంటుంది. కానీ చలిగా ఉందని మనం తక్కువ నీళ్లుతాగుతాం. శరీరంలోని నీరు నిరంతరం బయటకుపోతుంది. ఇది దీర్ఘకాలికంగా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది'' అని ఆయన తెలిపారు.

చాలా కాలం పాటు నీళ్లు తక్కువ తాగితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2019 అధ్యయనంలో తేలింది.

"వాతావరణం చలిగా ఉన్నప్పుడు, శరీరం వేడిని ఆదా చేయడానికి రక్త నాళాలను (పీబీవీ) సంకోచింపచేస్తుంది" అని వెల్‌నెస్ థెరపిస్ట్, డైటీషియన్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ మెటామార్ఫోసిస్ సీఈవో దివ్య ప్రకాశ్ చెప్పారు.

"ఇది రక్త పరిమాణాన్ని పెంచుతుంది. శరీరం అంతా బాగానే ఉందని, నీళ్ల అవసరం లేదని భావిస్తుంది. దీని వల్ల దప్పిక వేస్తున్న భావన 40 శాతం వరకు తగ్గిపోతుంది. కానీ శరీరానికి నీళ్ల అవసరంపై వాతావరణం ప్రభావం ఉండదు. శరీరానికి ఎప్పుడూ 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు కావాలి.

నీళ్లు, ఆరోగ్యం, మహిళలు, రక్తపోటు, చలికాలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చలికాలంలోనూ శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని వైద్యులంటున్నారు.

తక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు

మన శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది.

"ఈ నీరు రక్తంలో ఉంటుంది. రక్తం ద్వారానే ఆక్సిజన్, పోషకాలు, ఇతర ముఖ్యమైనవి మొత్తం శరీరంలోని కణాలకు చేరుతాయి" అని డాక్టర్ పులిన్ కుమార్ గుప్తా చెప్పారు.

"నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రక్తం మందంగా మారుతుంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందంగా ఉన్న రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది'' అని ఆయన చెప్పారు.

శరీరంలో నీళ్లు తక్కువగా ఉండటం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయని, దీనివల్ల మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందని వైద్యులుంటున్నారు. అలాగే మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని చెప్పారు.

తక్కువ నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువకాలం పాటు తక్కువగా నీళ్లు తాగడం వల్ల అలసట, తలనొప్పి, తలతిరగడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

మన శరీరం దీనిపై మొదట్లోనే సంకేతాలిస్తుంది. కానీ, మనం నిర్లక్ష్యం చేస్తుంటాం.

" చాలా నీరసంగా, బలహీనంగా అనిపించడం, అలసట, ఒత్తిడి, ఆందోళన, తలతిరగడం, ఆక్సిజన్ లేకపోవడం వంటి డీహైడ్రేషన్‌ను సూచించే కొన్ని సంకేతాలను ఇస్తుంది" అని ఎయిమ్స్ రిషికేశ్ మాజీ డైటీషియన్, వన్ డైట్ టుడే వ్యవస్థాపకురాలు డాక్టర్ అను అగర్వాల్ అంటున్నారు. శరీరానికి ఎక్కువ నీరు కావాలని ఈ సంకేతాల ద్వారా అర్ధమవుతుందని చెప్పారు.

నీళ్లు, ఆరోగ్యం, మహిళలు, రక్తపోటు, చలికాలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీళ్లు తాగకపోవడం అనారోగ్య సమస్యలను మరింత పెంచుతుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం..

వృద్ధులు, బీపీ, మధుమేహ రోగులు, గుండె శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేదా రక్తం పలుచబడటానికి మందులు వాడుతున్నవారికి తక్కువ నీళ్లు తాగడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉందని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.

తగినంత నీరు తాగకపోవడం వల్ల వివిధ వయసుల మహిళలపై ప్రభావం పడుతుందని డాక్టర్ అగర్వాల్ వివరించారు.

యువతులు, మధ్య వయస్కులైన మహిళలకు (40 సంవత్సరాల వరకు) ఇప్పటికే హార్మోన్ల మార్పులువంటివి ఉంటున్నాయి. రుతుస్రావం సమయంలో రక్త కోల్పోవడం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. పీరియడ్స్ సమయంలో నొప్పి పెరుగుతుంది, గ్యాస్, కడపుబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

"తక్కువ నీళ్లు తాగడం రక్తప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఈస్ట్రోజెన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల పనితీరు నీటిపై ఆధారపడి ఉంటుంది. నీళ్లు సరిపడా తాగకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పురావడం, పీరియడ్స్ క్రమంగా రాకపోవడం వంటివి పెరుగుతాయి" అని ఆమె చెప్పారు.

నీళ్లు, ఆరోగ్యం, మహిళలు, రక్తపోటు, చలికాలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యాయామం వల్ల దాహం పెరుగుతుంది.

కావాల్సినన్ని నీళ్లు ఎలా తాగాలంటే...

శీతాకాలం, వేసవి రెండింటిలోనూ ప్రతి ఒక్కరూ 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు త్రాగాలని డాక్టర్ అగర్వాల్ సూచిస్తున్నారు. అంటే 250 మిల్లీలీటర్ల గ్లాసు ఉపయోగించి 10 నుంచి 12 గ్లాసులు తాగాలి.

  • శీతాకాలంలో ఉదయం నిద్రలేచిన 2-3 గంటలలోపు నెమ్మదిగా 2-4 గ్లాసుల నీళ్లు తాగాలి.
  • నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి రోజుకు సరిపడా నీళ్లు సాయంత్రం 5 గంటలలోపు తాగాలి.
  • రాత్రిపూట మూత్రపిండాలు శుభ్రం చేసుకుంటుంటాయి. సాయంత్రం పూట ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది.
  • సాయంత్రం 5 గంటల తర్వాత, రాత్రి భోజనంతో లేదా తర్వాత కొంచెం తాగవచ్చు. కానీ ఎక్కువగా తాగకూడదు.

"చలికాలంలోనీళ్లకు బదులుగా టీ, కాఫీ, సూప్ లేదా చాలా వేడి నీటిని తీసుకుంటుంటారు. కానీ వేడి(50-60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ) ఎక్కువగా ఉన్న నీళ్లు తాగడం మంచిది కాదు. ఎందుకంటే మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. శరీరం వేడికి తగ్గట్టుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది శరీరానికి మంచిది. నీటిని శరీరం సులభంగా గ్రహిస్తుంది" అని దివ్య ప్రకాశ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)