గ్రౌండ్ వాటర్ తాగుతున్నారా? ఏపీ, తెలంగాణ భూగర్భ జలాల్లో ఏమేం కలుషితాలు ఎంతెంత ఉన్నాయో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భూగర్భ జలాల నాణ్యత ఏ స్థాయిలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానంగా 'ప్రమాదకర స్థితి'లో ఉందని చెబుతోంది కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ).
ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్ సహా వివిధ కలుషితాలు (కంటామినెంట్స్) నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లుగా తేలింది.
దేశవ్యాప్తంగా భూగర్భ జలనాణ్యత వివరాలతో 2024 వార్షిక నివేదికను కేంద్ర భూగర్భ జల మండలి విడుదల చేసింది.
ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తీసుకున్న శాంపిల్స్ (నమూనాలు), నీటిలో హానికారకాలు, వాటి పరిణామాల వివరాలను ప్రస్తావించింది. తెలంగాణ నుంచి 1150, ఏపీ నుంచి 1149 శాంపిల్స్ తీసుకుని విశ్లేషించింది కేంద్ర భూగర్భ జలమండలి.
ఈ ప్రమాణాలు మారుతుంటాయని, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు భూగర్భ నీటి నాణ్యత పెరుగుతుందని చెప్పారు తెలంగాణ భూగర్భ జలశాఖ డైరెక్టర్ శంకర్.


ఫొటో సోర్స్, Getty Images
ఫ్లోరైడ్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో లీటరుకు ఒక మిల్లీగ్రాముకు మించి ఫ్లోరైడ్ ఉండకూడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లీటరు నీటిలో 1.5 మిల్లీ గ్రాముల వరకు ఉన్నప్పటికీ, తాగేందుకు సరైనవేనని చెబుతుంది బీఐఎస్. అంతకు మించితే ఆ నీరు తాగడానికి వీల్లేదని సూచిస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది.
తాజాగా విడుదలైన నివేదికలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ 1.5 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కొన్ని శాంపిల్స్‌లో ఏకంగా 6.86 మిల్లీ గ్రాముల వరకు ఉంది.
- తెలంగాణలో సేకరించిన నీటి శాంపిల్స్ - 1150
- 1.5 మి.గ్రా.ల కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న శాంపిల్స్ - 171
- ప్రభావిత జిల్లాలు - 28
‘‘నమూనాలు వర్షకాలం ముందు, తర్వాత తీసుకున్నాం. వర్షాలు పడిన తర్వాత ఫ్లోరైడ్ స్థాయి కొంత తగ్గుతోంది'' అని కేంద్ర భూగర్భ జలమండలి నివేదిక చెబుతోంది.
తెలంగాణలో సేకరించిన నమూనాల్లో 350 శాంపిల్స్ వర్షాకాలం ముందు, తర్వాత తీసుకుని విశ్లేషించగా, 209 చోట్ల నీటిలో ఫ్లోరైడ్ శాతం కొంత తగ్గిందని నివేదికలో అధికారులు ప్రస్తావించారు.
''వర్షాల కారణంగా భూమిలోకి నీరు ఇంకి భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో ఫ్లోరైడ్ శాతం తగ్గింది'' అని ఆ నివేదిక చెబుతోంది.
డెక్కన్ ప్రాంతం కావడంతో తెలంగాణలో ఫ్లోరైడ్ ఎక్కువగా కనిపిస్తోందని జేఎన్‌టీయూ జల వనరుల విభాగం నిపుణుడు ప్రొఫెసర్ ఎంవీఎస్ఎస్ గిరిధర్ చెప్పారు.
''మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో నీరు వచ్చినా సరే, భూమి ఉపరితలంపైనే ప్రవాహం ఉంటుంది. భూగర్భం లోపలికి చొచ్చుకెళ్లేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్లోరైడ్ శాతం తగ్గడమనేది చాలా తక్కువ'' అని చెప్పారాయన.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కొన్ని జిల్లాల్లోని శాంపిల్స్‌లో ఫ్లోరైడ్ శాతం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తేలింది.
అల్లూరి, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, తిరుపతి, కడప జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది.
ఇదే సమయంలో వర్షాకాలం ముందు తర్వాత ఫ్లోరైడ్ స్థాయుల్లో తేడాలు వచ్చినట్లు తేలింది.
- వర్షాకాలంలో 280 శాంపిల్స్‌లో 158 చోట్ల నీటి నాణ్యత పెరిగినట్లు తేలింది.
- ఆంధ్రప్రదేశ్‌లో సేకరించిన నీటి శాంపిల్స్ – 1149
- 1.5 మి.గ్రా.ల కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న శాంపిల్స్ - 130
- ప్రభావిత జిల్లాలు - 17

ఫొటో సోర్స్, Getty Images
నైట్రేట్
వ్యవసాయ ప్రాంతాల్లో నైట్రేట్స్ సమస్య ఎక్కువగా ఉంటోంది.
ముఖ్యంగా నైట్రోజన్ ఆధారిత ఎరువులు వాడకం, పశువ్యర్థాల కారణంగా భూగర్భంలో నీటి నాణ్యత తగ్గి నైట్రేట్స్ పెరుగుతున్నాయని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.
బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగునీరులో లీటరు నీటిలో నైట్రేట్స్ 45మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
నైట్రేట్ స్థాయులు ఎక్కువగా ఉంటే, ఆ నీటిని ఎక్కువ కాలంపాటు తాగుతుంటే 'బ్లూ బేబీ సిండ్రోమ్' వచ్చే అవకాశం ఉంది. నైట్రేట్ అనేది అమ్మోనియం, అమ్మోనియా, నైట్రేట్, నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్ రూపంలో ఉండే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో సేకరించిన కొన్ని శాంపిల్స్‌లో 1988.5 మిల్లీగ్రాముల వరకు నైట్రేట్స్ ఉన్నట్లుగా తేలింది. ఏపీలో కొన్ని శాంపిల్స్‌లో ఏకంగా 2296 మిల్లీగ్రాముల వరకు నైట్రేట్స్ నమోదయ్యాయి.
- ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
- తెలంగాణలో నైట్రేట్స్ ఎక్కువగా ఉన్న శాంపిల్స్ - 316
- ఏపీలో నైట్రేట్స్ ఎక్కువగా ఉన్న శాంపిల్స్ – 270
రివర్స్ ఆస్మోసిస్, కటలైటిక్ రిడక్షన్, బ్లెండింగ్ వంటి పద్ధతులతో నైట్రేట్‌ను భూగర్భ జలాల నుంచి కొంతమేర తొలగించవచ్చని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.
నైట్రేట్స్ భూగర్భ జలాల్లో కలవడానికి ప్రధాన కారణం సీవేజీ (మురుగు నీరు) అని ప్రొఫెసర్ ఎంవీవీఎస్ గిరిధర్ చెప్పారు.
''భూగర్భ నీటి నాణ్యత పెంచేందుకు ఆర్టిఫిషియల్ రీచార్జి చేయాల్సి ఉంటుంది. భూమి పైనుంచి నేరుగా భూమిలోకి పైపు లైను వేసి ఇంజెక్షన్ వెల్ తరహాలో నిర్మాణం చేపడితే భూగర్భ జలం తేలికపడుతుంది. నీటి నాణ్యత మెరుగుపడుతుంది'' అని చెప్పారు.
ఈ విధానం ద్వారా జేఎన్టీయూలో 2010లో ఫ్లోరైడ్ 2.6 పీపీఎంగా ఉండేదని, ప్రస్తుతం 1.3 పీపీఎంకు తీసుకువచ్చామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లోరైడ్
భూగర్భ జలాల్లో క్లోరైడ్ శాతం లీటరు నీటిలో 250 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి.
ప్రత్యామ్నాయ తాగునీటి వనరులు లేని పక్షంలో తాగునీటిలో క్లోరైడ్ శాతం లీటరు నీటికి 1000 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చని బీఐఎస్ ప్రమాణాలు సూచిస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో క్లోరైడ్ పరిస్థితి ఇది. (మొత్తం శాంపిల్స్ 1149)
- 250 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్న శాంపిల్స్ – 887
- 250 నుంచి 1000 మిల్లీగ్రాముల వరకు ఉన్న శాంపిల్స్ - 222
- 1000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న శాంపిల్స్- 40
- తెలంగాణ విషయానికి వస్తే (మొత్తం శాంపిల్స్ - 1150 శాంపిల్స్)
- 250 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్న శాంపిల్స్ – 1007
- 250 నుంచి 1000 మిల్లీగ్రాముల వరకు ఉన్న శాంపిల్స్ - 137
- 1000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న శాంపిల్స్- 6

ఫొటో సోర్స్, Getty Images
ఐరన్
ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో సేకరించిన శాంపిల్స్‌లో ఐరన్ రేణువులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం, లీటరు నీటిలో ఐరన్ ఒక మిల్లీగ్రాము మించకూడదు.
ఏపీలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉందని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్సెనిక్
ఆర్సెనిక్ అనేది ఓ ప్రమాదకర మూలకం. దీని మోతాదులు ఎక్కువగా ఉన్న నీరు తాగితే దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులకు రావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా తాగునీటిలో 10 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకు ఆర్సెనిక్ ఉండొచ్చని బీఐఎస్ సూచిస్తోంది.
ఏపీలో ఉమ్మడి అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్సెనిక్ నిర్దేశిత స్థాయుల కంటే ఎక్కువగా ఉందని నమూనాల విశ్లేషణలో తేలిందని నివేదిక స్పష్టం చేసింది.
అలాగే ఎలక్ట్రికల్ కండక్టివిటీ నిర్దేశిత ప్రమాణాల కంటే 3000 కంటే ఎక్కువగా 34 నమూనాల్లో ఉన్నట్లుగా తేలింది.
ఏపీ విషయానికి వస్తే, 1149 శాంపిల్స్‌లో 112 శాంపిల్స్‌లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉందని తేలింది.
నేరుగా భూగర్భంలోకి వర్షపు నీరు ఇంజెక్ట్ అయ్యేలా చేస్తే, భూగర్భ జల నాణ్యతలో మార్పులు వస్తాయని ప్రొఫెసర్ ఎంవీవీఎస్ గిరిధర్ చెప్పారు.
మరోవైపు, వర్షాలు ఎక్కువగా కురిసినందున భూగర్భ జల నాణ్యత చాలావరకు మెరుగుపడిందని, గతంతో పోల్చితే ఫ్లోరైడ్ స్థాయులు తగ్గాయని తెలంగాణ భూగర్భ జల శాఖ డైరెక్టర్ శంకర్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














