క్యాన్ వాటర్ తాగడం మంచిదేనా, బాటిల్ ఎన్ని రోజులకు మార్చాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నందిని వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో క్యాన్లలో దొరికే తాగునీటి వాడకం కొన్నేళ్లుగా బాగా పెరిగింది. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఈ తాగునీటి క్యాన్లు కనిపించేవి. ఇప్పుడు వీటి వాడకం పల్లెలకు కూడా చేరింది.
ఈ తాగునీటి డబ్బాలను సరిగ్గా వాడుతున్నామా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఒక తాగునీటి డబ్బాను ఎన్నోసార్లు తిరిగి వాడుతుంటారు. అయితే, తరచుగా ఉపయోగించే ఇలాంటి క్యాన్లను నిర్ణీత కాలానికి మించి ఉపయోగించకూడదని మీకు తెలుసా?
అలాగే, ఈ తాగునీటి క్యాన్లను మాత్రమే కాకుండా, వీటిని నిల్వ చేయడానికి ఇళ్లలో వాడే 'బబుల్ టాప్' క్యాన్లను కూడా శుభ్రంగా ఉంచుకుంటామా?

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన క్యాన్డ్ వాటర్ తయారీదారులు, అమ్మకందారులకు ఇటీవల నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆహార భద్రతా శాఖ అధికారులు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.
- వాటర్ క్యాన్లను 50 సార్లకు మించి వాడకూడదు.
- మురికి, గీరుకుపోయినట్లుగా ఉన్న తాగునీటి క్యాన్లను ప్రజలకు పంపిణీ చేయకూడదు.
- ఎండలో ఉంచిన తాగునీటి డబ్బాలను పంపిణీ చేయకూడదు.
- క్యాన్లలోని తాగునీరు కూడా కచ్చితంగా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి.
ఆహార భద్రతా శాఖ అధికారులు పై సూచనలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంస్థ బాటిల్డ్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను అత్యంత ప్రమాదకర ఆహారాల జాబితా (హై రిస్క్ ఫుడ్ లిస్ట్)లో చేర్చింది.
ఈ మేరకు నిరుడు నవంబరులో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను అత్యంత ప్రమాదకర ఆహారాల జాబితాలో చేర్చుతున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మామూలుగానైతే, ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశమున్న ఆహార పదార్థాలను ఈ జాబితాలో చేర్చుతారు. ఈ జాబితాలోని ఆహారాల నాణ్యతను తనిఖీ చేయడానికి కఠినమైన నిబంధనలు పాటించాలి.
ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ 2024 అక్టోబర్‌లో సవరించిన నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌కు కూడా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి.
అంతేకాకుండా, వీటిని తయారు చేసే కంపెనీలకు లైసెన్స్ మంజూరు చేసేప్పుడు, నమోదు చేయడానికి ముందు అధికారులు ఆ కంపెనీలను నేరుగా తనిఖీ చేయాలి. అలాగే, సంవత్సరానికి ఒకసారి వీటిని థర్డ్ పార్టీలతో తనిఖీ చేయిస్తుండాలి.
ఈ భద్రతా ప్రమాణాలను పాటించకపోతే ఇళ్లలో తాగునీటి క్యాన్లను ఉపయోగించేవారికి ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి? తాగునీటి క్యాన్ సురక్షితంగా ఉందని ఎలా నిర్ధరించాలి?

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్లలోని నీరు తాగడం మంచిదేనా?
''మనం వాడే వాటర్ క్యాన్లపై బీఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చే నాణ్యతా పత్రం (క్వాలిటీ లైసెన్స్), గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్), బ్యాచ్ నంబర్ ఉన్నాయో లేదో చూడాలి. కొన్ని బాటిళ్లకు మినహాయించి, చాలా వరకు క్యాన్లకు ఇలాంటి వివరాలు ఉండవు'' అని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన మెడికల్ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ ఎస్. చంద్రశేఖర్ చెప్పారు.
నీళ్లలోని అనవసరపు వ్యర్థాలు, మూలకాలను బయటకు పంపడానికి 5-6 వడపోత పద్ధతులు ఉంటాయి. అల్ట్రావయొలెట్ కిరణాలను ఉపయోగించి నీళ్లలోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడానికి యూవీ వడపోత పద్ధతిని వాడతారు. నీళ్లలోని ఖనిజాలు, ఉప్పు, ఇతర మలినాలను తొలగించే పద్ధతి ఆర్వో(రివర్స్ ఓస్మోసిస్) అని పిలుస్తారు. అలాగే మైక్రాన్ ఫిల్టర్లను కూడా వాడతారు.
''అయితే, క్యాన్ల ద్వారా పంపిణీ అయ్యే నీళ్లను ఒకసారి మాత్రమే ఫిల్టర్ చేస్తారు. నీళ్లను ఎలా ఫిల్టర్ చేస్తారో వినియోగదారులు తెలుసుకోవాలి. క్యాన్ వాటర్ సరఫరా చేసే కంపెనీకి లైసెన్స్ ఉందో లేదో కూడా వినియోగదారులు తెలుసుకోవాలి'' అని ప్రొఫెసర్ చంద్రశేఖర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టీడీఎస్ స్థాయిలు ఎందుకు ముఖ్యం?
తాగునీటి నాణ్యతను అందులో కరిగిన మొత్తం ఘనపదార్థాల (టీడీఎస్) స్థాయిని బట్టి నిర్ధరిస్తారు. తాగునీటిలోని ప్రమాదకరమైన ఐరన్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి విష పదార్థాల పరిమాణాన్ని టీడీఎస్ వెల్లడిస్తుంది.
బీఐఎస్ ప్రమాణాల ప్రకారం, టీడీఎస్ మోతాదు ఒక లీటర్ నీటిలో 500 మిల్లీగ్రాములకు మించకూడదు.
అయితే, నీటిలో టీడీఎస్ శాతం లేకపోతే తాగునీటిలో మినరల్స్ లేవని అర్థం చేసుకోవాలని స్వచ్ఛంద వినియోగదారుల సంస్థ 'కన్జ్యూమర్ వాయిస్' చెబుతోంది.
టీడీఎస్ స్థాయి తక్కువగా ఉంటే ఆ నీటికి రుచి ఉండదని కన్జ్యూమర్ వాయిస్ సంస్థ తెలిపింది.
చాలావరకు క్యాన్లలో దొరికే తాగునీటిలో లీటరుకు 100 మిల్లీగ్రాముల టీడీఎస్ ఉంటుందని చంద్రశేఖర్ అన్నారు.
తాగునీటి డబ్బాలు ఎక్కువగా ఎండలో ఉంటాయి కాబట్టి డబ్బాల్లో రసాయన చర్య వేగంగా జరిగి ప్లాస్టిక్‌లో ఉండే బీపీఏ (బిస్ఫోనల్ ఎ) అనే రసాయనం కరుగుతుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య సమస్యలు
''ఈ ప్లాస్టిక్ ముఖ్యంగా ఎండోక్రైన్ గ్రంథుల్లో మార్పులకు కారణమవుతుంది. దీనివల్ల ఊబకాయం, గుండెజబ్బులు, వీర్యకణాల సంఖ్య తగ్గడం, థైరాయిడ్, డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు వస్తాయి.
ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ క్యాన్లలోని నీరు తాగడమే ప్రధాన కారణమని నేను చెప్పట్లేదు. కానీ, ఈ సమస్యలకు దారి తీసే ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి'' అని చంద్రశేఖర్ వివరించారు.
''డబ్బాలను సరిగా కడగకపోతే ఈ.కోలి, లెజియోనెల్లా, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలకు అవి ఆవాసంగా మారతాయి.
దీన్ని నివారించడానికి తాగునీటి క్యాన్‌ను కొన్న వెంటనే అందులోని నీటిని వెంటనే అల్యూమినియం జగ్గులు లేదా కుండల్లోకి బదిలీ చేయాలి. బబుల్ టాప్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఉపయోగించాలి'' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం)














