ఫ్యాటీ లివర్: ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తే ఏమవుతుందో తెలుసా?

సెడెంటరీ జీవనశైలి
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా? దీనివల్ల జరిగే నష్టమేమిటో మీకు తెలుసా?

ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, వెన్నునొప్పి, నాడీ వ్యవస్థలపై ప్రభావం పడుతుందని గతంలో ఎన్నో అధ్యయనాలు వచ్చాయి.కానీ దీనివల్ల మరో ముప్పు కూడా ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం బయపెట్టింది.

ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఫ్యాటీలివర్ బారినపడే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చునే పనిచేస్తుండటంతో వారిలో ఎక్కువమంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నట్లుగా తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్యాటీ లివర్ అధ్యయన బృందం

ఫొటో సోర్స్, uohherald

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్లు కల్యాణ్‌కర్ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్ స్కాలర్స్ భారం భార్గవ, నందిత ప్రమోద్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

ఏమిటీ అధ్యయనం?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్లు కల్యాణ్‌కర్ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్ స్కాలర్స్ భారం భార్గవ, నందిత ప్రమోద్ బృందం ఈ అధ్యయనంలో పాల్గొంది.

వీరికి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీనియర్ హెపటాలజిస్టు డాక్టర్ పీఎన్ రావు సహకారం అందించారు.

ఈ అధ్యయనానికి కేంద్ర విద్యాశాఖ నిధులు సమకూర్చింది.

మొత్తం 758 మందిపై ఈ అధ్యయనం సాగింది. వారిలో 345 మంది జీవక్రియలపై విశ్లేషణ చేశామని ప్రొఫెసర్ మహదేవ్ బీబీసీతో చెప్పారు.

''2023 జులై నుంచి 2024 జూన్ వరకు ఏడాదిపాటు మా పరిశోధన జరిగింది. ఎంపిక చేసిన ఉద్యోగులకు నాలుగు దఫాలుగా మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించాం'' అని ఆయన చెప్పారు.

84 శాతం మంది ఐటీ ఉద్యోగులు, మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎంఏఎఫ్ఎల్‌డీ)తో బాధ పడుతున్నట్లుగా తేలింది.

దీన్నే ఫ్యాటీ లివర్‌ అని కూడా పిలుస్తుంటారు.

దిల్లీలోని ఎయిమ్స్ పరిశోధకులు 2022లో చేసిన సర్వేలో దేశంలో 38 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తేలిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

ఎక్కువసేపు కూర్చుని ఉండటంతో ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తోందని తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

ఫ్యాటీ లివర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్యాటీ లివర్ వ్యాధిని నిశ్శబ్ధ మహమ్మారిగా చూస్తారు.

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?

సాధారణంగా కాలేయంలో అత్యంత తక్కువ మోతాదులో కొవ్వు ఉంటుందని లేదా అసలు కొవ్వు ఉండదని వైద్యులు చెబుతున్నారు.

అతిగా ఆల్కహాల్ తాగడం లేదా ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల అవసరానికి మించి శరీరానికి కేలరీలు అందుతాయి. ఇందులో కొన్ని ఖర్చుకాగా మిగిలినవి కొవ్వుగా మారతాయి. ఆ కొవ్వు కాలేయ కణాల్లో చేరుతుంది.

కాలేయంలో కొవ్వు అయిదు శాతానికి మించి చేరితే ఫ్యాటీ లివర్‌గా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ పీఎన్ రావు.

''ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, షుగర్‌తో కూడిన పానీయాలు (కూల్ డ్రింక్స్, సోడా) తాగడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, అస్తవ్యస్త పనివేళల కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువ'' అని చెప్పారాయన.

దీన్ని ముందుగానే గుర్తించి నియంత్రించుకోకపోతే లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులకు దారి తీసే అవకాశం ఉందని హెచ్‌సీయూ పరిశోధకులు చెబుతున్నారు.

అలాగే, సర్వే చేసిన వారిలో 71 శాతం మంది ఊబకాయంతో బాధపడుతుండగా, 34శాతం మంది జీవక్రియలో ఇబ్బందులతో ఉన్నారని అధ్యయనంలో తేలిందని చెప్పారు ప్రొఫెసర్ మహదేవ్.

''జీవ క్రియలో ఇబ్బందుల కారణంగా ఫ్యాటీ లివర్, ఊబకాయం, మధుమేహం, హై బీపీ వంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది'' అని బీబీసీతో అన్నారు.

తమ అధ్యయన ఫలితాల నివేదిక నేచర్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలోని సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్‌లో ప్రచురితమైందని ప్రొఫెసర్ కల్యాణ్‌కర్ మహదేవ్ చెప్పారు .

ఏం చేయాలి?

ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ బి. సుజీత్ కుమార్.

''హెచ్‌సీయూ అధ్యయన ఫలితాలను చూశాను. నా వద్దకు వచ్చే వారిలోనూ ప్రతి పది మందిలో ఆరేడుగురు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు'' అని డాక్టర్ సుజీత్ బీబీసీకి వివరించారు.

దీనివల్ల జన్యుపరమైన మార్పులు జరిగి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని ఆయన చెప్పారు.

''ఫ్యాటీ లివర్ కారణంగా ఇతరత్రా శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులుంటాయి'' అని బీబీసీతో చెప్పారు.

ఫ్యాటీ లివర్ సమస్య ఎదురుకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పారు డాక్టర్ సుజిత్.

  • ఎక్కువ సేపు కూర్చుని పనిచేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి లేచి అయిదు నిమిషాలపాటు శరీరాన్ని సాగదీస్తుండాలి.
  • కుదిరినప్పుడు స్టాండింగ్ డెస్క్ (నిలబడి) పని చేస్తే మంచిది.
  • జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, సోడాలు తాగకపోవడం మంచిది.
  • తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తున్నాం కదా అని కొందరు రోజంతా కూర్చుని ఉంటారు. అది మంచిది కాదు. మధ్యమధ్యలో కాస్త రిలాక్స్ అవ్వాలి.
  • రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)