కంటి క్యాన్సర్: ‘నేను ఇంకా రెండేళ్లే బతుకుతాను’.. మృత్యువు ముంగిట ఉన్న 30 ఏళ్ల మహిళ ఇస్తున్న సలహా

ఫొటో సోర్స్, CERIDWEN HUGHES
- రచయిత, నికోలా బ్య్రాన్
- హోదా, బీబీసీ న్యూస్
“పెద్ద ఇల్లు, మంచి కారు.. వీటన్నిటి కోసం పాకులాడటం ఆపండి. కాస్త నిదానించి, మీకు లభించిన దానిపట్ల కృతజ్ఞతగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించే వారితో సంతోషంగా సమయాన్ని గడపండి”
ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి, చికిత్స పొందుతున్న, 30 ఏళ్ల మెగాన్ మెక్ క్లే ఇస్తున్న సలహా ఇది.
18 నెలల క్రితం మెగాన్ మెక్ క్లే ఓక్యులర్ మెలనోమా (క్యాన్సర్) బారిన పడినట్లు, వ్యాధి తీవ్రత నాలుగో దశలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తెలిసింది. ఆ క్యాన్సర్ కాలేయానికి సోకిందని, ఇక ఆమె జీవితకాలం రెండేళ్లే అని అంచనా వేశారు వైద్యులు.
“నాకు జీవితంలో ఏది ముఖ్యమైనదో తెలుసుకుని, దానిపైనే సమయం వెచ్చిస్తున్నాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. నా గురించి నేను తెలుసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నాను” అన్నారు మెగాన్.

ఫొటో సోర్స్, CERIDWEN HUGHES
బ్రిటన్‌లోని కార్డిఫ్ బే లో ఉన్న సెలెడ్డ్ ఒరియల్‌లో, “వాట్ మ్యాటర్స్ మోస్ట్?” అనే పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో మెగాన్ కథను కూడా ఉంచారు.
అక్కడ ప్రదర్శించిన ఫోటోగ్రాఫ్‌లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ప్రాణాంత వ్యాధుల బారిన పడిన వారి జీవితం, వారి కుటుంబం, పాలియేటివ్ కేర్‌లో పనిచేసే వారి జీవనశైలి, జీవిత గాథలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
ఈ ప్రదర్శన నిర్వహకురాలు సెరిడ్వెన్ హ్యుగ్స్ ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్.
తన తల్లి మరణం తరువాత పుట్టిన ఆలోచన నుంచి ఈ ప్రదర్శనకు సంబంధించిన ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నట్లు ఆమె చెప్పారు. సెరిడ్వెన్‌కు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనది.
సెరిడ్వెన్ తల్లి 81 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడ్డారు.చివరి రోజులు ఇంట్లోనే గడపాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆమెకు సరైన సహకారాన్ని ఇవ్వలేకపోయారు సెరిడ్వెన్, ఆమె తోబుట్టువులు. తమకు అవగాహన లేకనే అలా చేయలేకపోయామని సెరిడ్వెన్ అన్నారు.
“మా అమ్మ భరించలేని నొప్పితో మరణించారు. అది చాలా బాధాకరమైనది. ఆ సమయంలో ఆమె ఎంతటి వేదన అనుభవించిందో చెప్పలేం.
మేమంతా ఫోన్లు పట్టుకుని అందరికీ సమాచారం ఇవ్వడంలో నిమగ్నమై, చివరిక్షణాల్లో ఆమెను సరిగా పట్టించుకోలేకపోయాం. ఆ రోజులు నన్ను వెంటాడుతున్నాయి” అన్నారు.
తాను నిర్వహించిన ఎగ్జిబిషన్ వల్ల జీవితపు చివరి దశ గురించి, మరణం గురించి ఎక్కువ చర్చలు జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
“మరణం గురించి మాట్లాడగానే, ఆ సంభాషణ నుంచి దూరంగా వెళ్లిపోవాలని, దాని గురించి అసలు మాట్లాడకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ, మనం మాట్లాడుకోనంత కాలం మార్పు రాదు. మనం పుట్టుక గురించి ఎలాగైతే సాధారణంగా మాట్లాడుకుంటామో, దాని గురించి కూడా అలాగే సంభాషించుకోవాలి” అన్నారు సెరిడ్వెన్.

ఫొటో సోర్స్, CERIDWEN HUGHES
'నాకే ఎందుకిలా జరిగింది?'
నోర్‌ఫోక్‌కు చెందిన 26 ఏళ్ల మెగాన్‌కు తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు (లైట్ ఫ్లాష్)లు రావడం మొదలైంది.
మొదటి రెండు వారాలు అది మైగ్రేన్ వల్లనేమో అని, దాని గురించి అంతగా పట్టించుకోలేదు మెగాన్. ఆ తరువాత ఆప్టీషియన్‌ను సంప్రదించగా యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు.
స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్లాక, పరీక్షలన్ని చేసి, మెగాన్ ఓక్యులర్ మెలనోమా అనే కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు వైద్యులు.
ఆ క్యాన్సర్ సోకిన వారిలో కంటిలోని పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉన్నట్లుండి విపరీతంగా పెరిగిపోతాయి.
“నాకసలు అదేంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో మొదట అర్థం కాలేదు” అన్నారు మెగాన్.
“క్యాన్సర్ సోకితే పరిణామాలు దారుణంగా ఉంటాయని నాకు తెలుసు. నా విషయంలో చూడండి. ఆ క్యాన్సర్ కణం మిల్లీమీటర్ల పరిణామంలో మాత్రమే ఉంటుంది. కానీ ప్రాణాంతకం.
నేను నా మనసులో అది చాలా చిన్నది. దానికి చికిత్స తీసుకుని మందుకు సాగొచ్చు. నేను ఏ పాపం చేయలేదు. కాబట్టి నాకేం కాదని నాకు అనిపించింది” అన్నారు.
క్యాన్సర్ కణాలు కాలేయం వరకూ సోకాయని, మెగాన్ రెండేళ్ల వరకు జీవించే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేశారు.
“నన్ను చూసిన వాళ్లకు అది నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే, నా మొఖంలో అనారోగ్యపు ఛాయలేవీ కనిపించవు” అన్నారు.
“కొన్నిసార్లు నాకేమీ జరగలేదు. అదేమీ నిజం కాదు అని నాకూ అనిపిస్తుంది” అని తన పరిస్థితిని వివరించారు.
ప్రస్తుతం మెగాన్ ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్నారు. ఆ చికిత్స వల్ల ఆమెకు సోకిన క్యాన్సర్ నయం కానప్పటికీ, దానిని నియంత్రించేందుకు సహకరిస్తుంది.
మెగాన్ తన జీవితపు చివరి క్షణాలను స్థానిక హాస్పైస్ (చివరిదశలోని రోగులకు సేవలు అందించే కేంద్రం) లేదా పాలియేటివ్ కేర్‌లో గడిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
“రెండేళ్లు అనే పదం మాత్రం నాకు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆ వాస్తవాన్ని అంగీకరించి, ముందుకుసాగడం కష్టతరమైన విషయం” అన్నారు.
హాస్పైస్‌లో జరిగే సంభాషణలు జీర్ణించుకోవడానికి ఇబ్బందిగానే ఉన్నప్పటికీ, అక్కడి సదుపయాలు, పనితీరు తనకు తన భాగస్వామికి, కుటుంబాని సాంత్వన చేకూరుస్తోందని చెప్పారు మెగాన్.
తన జీవితపు చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో మెగాన్ అర్థం చేసుకున్నారు. ఆ దశలో నిస్సహాయంగా ఉండటం తప్ప ఏమీ చేయలేనప్పటికీ, ధైర్యంగా ఉన్నారు. కానీ ఆమెను ఎంతగానో ప్రేమించే వారికి మాత్రం అదంతా కష్టంగా ఉంది.

ఫొటో సోర్స్, CERIDWEN HUGHES
'అంత సులభం కాదు'
“వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నాకు ఎదురవబోయే మరణం గురించి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడొచ్చు. అలాగని, నా భాగస్వామి లేదా నా కుటుంబం కూడా అదే రీతిలో స్పందిస్తారని అనుకోవద్దు” అన్నారు మెగాన్.
“నేను శాశ్వతంగా దూరం అవుతున్నాను అనే వాస్తవాన్ని వారు అంగీకరించి, ఇకపై వారి జీవితాల్లో నేను ఉండనని ముందుకు సాగడం దుఖంతో కూడుకున్నది. చివరికి అది అలా ముగిసిపోవలసిందే. కానీ, ఆ దశ చాలా క్లిష్టమైనది. మాటల్లో చెప్పినంత సులువు కాదు” అన్నారు.
మెగాన్, డిమిటార్ కష్చీవ్‌లు 2018లో కలుసుకున్నారు. వారు బంధానికి ఏడాది పూర్తయ్యేలోగానే మెగాన్‌కు క్యాన్సర్ సోకిందని, వ్యాధి తీవ్రత మొదటి దశలో ఉందని తెలిసింది. ఏడాది గడిచేలోగానే ప్రాణాంతక వ్యాధిగా నిర్ధారించారు వైద్యులు.
“అది మాకు ఊహించని దెబ్బ. ఎందుకంటే, ఆ సమయంలో మేం మా జీవితం గురించి, భవిష్యత్తు గురించి కలలు కంటున్నాం. ప్రణాళికలు వేసుకుంటున్నాం” అని చెప్పారు డిమిటార్.
“అలాంటి ఆలోచనల్లో ఉన్న నాకు ఉన్నట్లుండి ఇకపై తనకు భవిష్యత్తు ఉండదని అంగీకరించడం కష్టంగా మారింది” అన్నారు.
డిమిటార్ క్రమంగా తన మనసులోని ఆలోచనల్ని మెగాన్‌తో పంచుకోవడం మొదలుపెట్టారు. ఆమెతో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆమెను అర్థం చేసుకుని, సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
“మేమిద్దరం సాధ్యమైనంత మేర ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, భవిష్యత్తులో మాకు ఆ అవకాశం ఉండదు” అన్నారు.
మెగాన్ గురించి ప్రతీ విషయాన్ని డిమిటార్ తన పుస్తకంలో రాసుకుంటున్నారు. ఆమె మాటల్ని రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే, భవిష్యత్తులో అవే అతడికి జ్ఞాపకాలు.
డిమిటార్ జరగబోయేదాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. కానీ కొంతమేర దాని గురించి ఆలోచిస్తున్నారు.
“కొన్నిసార్లు మెగాన్ లేని జీవితాన్ని ఎలా గడపాలోనని తల్చుకుంటే, నేనే ద్రోహం చేస్తున్నట్లు అనిపిస్తుంది. తను లేకుండా నేను జీవించడమంటే, మేం చేసుకున్న బాసల్ని తప్పినట్లేగా” అన్నారు.
మెగాన్ తనను అందరూ ఎలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారో చెప్తున్నారు.
“మీ జీవితంలో అన్నింటా తలమునకలైనప్పుడు, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పుడు నేను మీకు గుర్తుకురావాలి. మీరు మీ కెరీర్, పిల్లల వెనుక పరుగులు తీస్తున్నప్పుడు నేను మీకు గుర్తుకురావాలి.
మీ ఉరుకుల పరుగుల జీవితాన్ని ఆపి, మీ ఫోన్‌లు పక్కకు పెట్టి, మీ చుట్టూ ఉన్న వారితో సమయం కేటాయించమని మీకు గుర్తుచేయాలని అనుకుంటున్నాను” అన్నారు మెగాన్.
ఆమె మాట్లాడుతూ “మనం ఎప్పుడూ పెద్ద ఇల్లు, పెద్ద కారు, అదీ, ఇదీ.. అంటూ సంపాదన కోసం ప్రయత్నిస్తూ, మన ముందు ఉన్నదేంటో చూడటం మర్చిపోతాం.
అందుకే, అన్నింటికీ పాజ్ బటన్ నొక్కి, మన దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞులుగా ఉందాం. నేను అలాంటి వాటికి రిమైండర్‌గా ఉండాలని అనుకుంటున్నాను” అని చెప్పారు మెగాన్.
ఇవి కూడా చదవండి..
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














